- రసాభాసగా ఆసరా పెన్షన్ల అమలు పత్రాల పంపిణీ!
- వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల కష్టాలు పట్టవా?..
- ప్రోటోకాల్ తుంగలో తొక్కిన మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నేతలు…
- గతంలో బీఆర్ఎస్.. నేడు కాంగ్రెస్.. ఎల్బీనగర్లో మారని రాజకీయ క్రీడ!
ఎల్బీనగర్:
కడుపు నిండా తిండి లేక, మందులకు డబ్బుల్లేక, ఎన్నో ఏళ్లుగా ఆసరా పెన్షన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న పేద, వృద్ధ, వికలాంగుల ఆవేదనను నేతలు తమ స్వార్థ రాజకీయాలకు వాడుకున్నారు. లబ్ధిదారులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వ అధికారిక వేడుకను, స్థానిక నేతలు తమ ఆధిపత్య పోరుకు, బలప్రదర్శనకు అడ్డాగా మార్చుకుని రసాభాస చేశారు. నేతల తీరుపై ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు.
పేదల చెక్కుల వద్ద మీ బలప్రదర్శన ఏంటి?.. అని మండి పడుతున్నారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ మధుయాష్కీ గౌడ్ వందలాది మంది అనుచరులు, కార్యకర్తలతో దండులా తరలిరావడంతో ఆ ప్రాంగణమంతా రాజకీయ రణరంగాన్ని తలపించింది.
- బలప్రదర్శన చేసుకోవడానికి అది పార్టీ సభ కాదు, పేదలకు ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమం అనే కనీస స్పృహ లేకుండా ఇరు వర్గాల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలతో హోరెత్తించారు.
- ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ నినాదాలు చేయకూడదనే కనీస నియమాన్ని తుంగలో తొక్కుతున్న కార్యకర్తలను అదుపు చేయాల్సిన నేతలు, తమకు జై కొడుతుంటే మురిసిపోతూ మిన్నకుండిపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఈ అధికారిక వేదికపై ప్రోటోకాల్ అర్హత ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, యాదవ సంక్షేమ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ మాత్రమే ఉండాలి.
- కానీ, ఎటువంటి అధికారిక హోదా లేని మాజీ కార్పొరేటర్లు, స్థానిక కాంగ్రెస్ నేతలు వేదికపైకి ఎక్కి కూర్చోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ హోదా ఉందని వీరంతా ప్రభుత్వ వేదికపైకి ఎక్కారని, ప్రోటోకాల్ నిబంధనలను అధికారులు, నేతలు కలిసికట్టుగా మంటగలిపారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
గతంలో బీఆర్ఎస్.. నేడు కాంగ్రెస్.. జెండాలు మారినా బుద్ధులు మారవా?
ఎల్బీనగర్లో అధికారిక కార్యక్రమాలను సొంత పార్టీ సభలుగా మార్చుకోవడం నేతలకు ఒక అలవాటుగా మారిపోయిందని నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- గత బీఆర్ఎస్ పాలనలోనూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పార్టీ వేదికలుగా మార్చుకుని ప్రోటోకాల్ వివాదాలు సృష్టించారని, ఇప్పుడు మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు సైతం అదే దిగజారుడు రాజకీయాలను కొనసాగిస్తున్నారని విశ్లేషకులు చురకలు అంటిస్తున్నారు.
- పార్టీలు మారినా, నాయకులు మారినా ప్రజల సొమ్ముతో జరిగే కార్యక్రమాలను తమ ప్రచార ఆర్భాటాలకు వాడుకునే నేతల తీరు మాత్రం మారడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
అయోమయంలో లబ్ధిదారులు.. మరోసారి ఇలా జరిగితే సహించం!
ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత పెన్షన్ చెక్కులు అందుతాయన్న ఆశతో వచ్చిన వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు.. వందలాది మంది కార్యకర్తల తోపులాటలు, నినాదాల హోరు మధ్య నలిగిపోయారు. చెక్కులు ఎప్పుడు ఇస్తారో, ఎవరిని అడగాలో తెలియక తీవ్ర అయోమయానికి గురయ్యారు. పేదల కష్టాలను పట్టించుకోకుండా, సంక్షేమ వేదికలను రాజకీయ క్రీడలకు వాడుకునే ఇలాంటి తీరును నేతలు ఇకనైనా మానుకోవాలని, భవిష్యత్తులో అధికారిక కార్యక్రమాలను రసాభాస చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్థానికులు హెచ్చరిస్తున్నారు.



