- అనుమతి ఒకటైతే.. నిర్మాణం మరొకటి!
- కాగితాలపై రెండు అంతస్తుల నివాస భవనం.. క్షేత్రస్థాయిలో లోతైన సెల్లార్‌తో 5 అంతస్తుల భారీ వాణిజ్య సముదాయం!
- అనుమతులు లేకుండానే ప్రధాన రహదారి వెంట పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు..
- అధికారుల ముడుపుల మౌనంతో ప్రజా ప్రాణాలకు తీవ్ర ముప్పు!
- వ్రాతపూర్వక ఫిర్యాదులపై, వార్త కథనాలపై స్పందించని అధికారగానం..
- జిహెచ్ఎంసి బడంగ్పేట్ సర్కిల్ 16, లో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ అధికారులు సాయికిరణ్, కళ్యాణ్ ల అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికుల డిమాండ్..
- జిహెచ్ఎంసి శంషాబాద్ జోన్ జోనల్ కమిషనర్ చంద్రకళ, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్ దృష్టి సారించాలి.
బడంగ్పేట్
రాజధాని నగర పరిధిలో అక్రమ నిర్మాణాల పర్వం అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. క్షేత్రస్థాయి అధికారుల ఉదాసీనత, ముడుపుల మాయాజాలంతో నిబంధనలను కాలరాస్తూ వెలుస్తున్న కట్టడాలు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నాయి. బాలాపూర్ ప్రధాన రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఓ భారీ వాణిజ్య నిర్మాణం స్థానికులకు నిద్రలేకుండా చేస్తోంది.
అక్రమ నిర్మాణ స్థలం వివరాలు
- ప్రాంతం: ఎన్.ఎల్.ఎస్.ఎస్ కాలనీ, బాలాపూర్ ఎక్స్ రోడ్, మీర్పేట్ పరిధి.
- చిరునామా: జనప్రియ ఎస్.ఎల్.ఎన్.ఎస్ కాలనీ, భవన సంఖ్య: 6-106.
- పరిధి: జిహెచ్ఎంసి, శంషాబాద్ జోన్, బడంగ్పేట్ సర్కిల్ 16.
నిబంధనలకు తిలోదకాలు.. అక్రమాల వివరాలు - అనుమతుల ఉల్లంఘన: కేవలం రెండు అంతస్తుల నివాస భవనానికి అనుమతులు పొంది, దానికి పూర్తిగా విరుద్ధంగా లోతైన సెల్లార్ తవ్వి, బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నారు.
- రహదారి సరిహద్దుల ఆక్రమణ: ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్నప్పటికీ ఎలాంటి ఖాళీ స్థలం (సెట్‌బ్యాక్) వదలకుండా, 100% డివియేషన్తో చుట్టూ ఉన్న స్థలాన్ని ఆక్రమిస్తూ నిర్మాణం సాగిస్తున్నారు.
- ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి: వాణిజ్య అవసరాల కోసం నిర్మిస్తున్న భవనాన్ని నివాస భవనంగా చూపిస్తూ మున్సిపల్ శాఖకు రావాల్సిన లక్షలాది రూపాయల పన్నులను యథేచ్ఛగా ఎగవేస్తున్నారు.
పొంచివున్న ప్రమాదాలు.. స్థానికుల ఆందోళన - అగ్నిప్రమాదాల ముప్పు: అగ్నిమాపక నిబంధనలను బొత్తిగా విస్మరించి నిర్మిస్తుండటంతో, భవిష్యత్తులో ఏ చిన్న ప్రమాదం జరిగినా భారీ ప్రాణనష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
- రవాణా అంతరాయాలు: 100% డివిషన్తో సరిహద్దు ఖాళీలు లేకుండా ప్రధాన రహదారిపైనే నిర్మాణం చేపట్టడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ఇది నిరంతరం రోడ్డు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది.

ముడుపుల మత్తులో అధికారులు.. నెలలు గడిచినా చర్యలు శూన్యం:
ఈ అక్రమ కట్టడంపై స్థానికులు ఫిర్యాదులు చేసి నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. శంషాబాద్ జోన్, బడంగ్పేట్ సర్కిల్ 16 డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ , టౌన్ ప్లానింగ్ ఏసిపి కళ్యాణ్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ సాయికిరణ్ తదితరులు భారీగా ముడుపులు పుచ్చుకుని ఈ అక్రమాలకు అభయం ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కిందిస్థాయి సిబ్బంది మౌనం అక్రమ నిర్మాణదారులకు కొండంత బలాన్నిస్తోంది.
*ఉన్నతాధికారుల తక్షణ చర్యలకు డిమాండ్:
ప్రజా ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ భారీ అక్రమ కట్టడాన్ని జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్, శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళ, నగర ప్రణాళికాధికారి మహర్ తక్షణమే పరిశీలించాలి. జేసీబీలతో ఈ అక్రమ నిర్మాణాన్ని వెంటనే కూల్చివేసి, నిబంధనలు ఉల్లంఘించిన భవన యజమానిపై మరియు అవినీతికి పాల్పడిన అధికారులపై నేరపూరిత కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



