యోగా గురువు మధుసూదన్ రెడ్డికి ఘన సన్మానం
*ఎల్బీనగర్:
గురు పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని రాక్‌టౌన్ కమ్యూనిటీ హాల్లో యోగా సాధకులు ఘనంగా గురు వందన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదికగా యోగా గురువు శ్రీ మధుసూదన్ రెడ్డిని సాధకులందరూ కలిసి ఘనంగా సన్మానించి తమ గురు భక్తిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా రాక్‌టౌన్ యోగా సాధకులు తమ అనుభవాలను పంచుకుంటూ.. గురువు గారి ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల తమ ఆరోగ్యం ఎంతో మెరుగుపడిందని ఆనందం వ్యక్తం చేశారు.
నిస్వార్ధ సేవకు అంకితం:
గత రెండేళ్లుగా మధుసూదన్ రెడ్డి ఎలాంటి లాభాపేక్ష లేకుండా, పూర్తిగా నిస్వార్ధంగా బోడుప్పల్ నుండి తెల్లవారుజామున 4:30 గంటలకే రాక్టౌన్కు చేరుకుంటున్నారు. సాధకుల బాగోగులు స్వయంగా పరిశీలిస్తూ, వారికి ఉన్న ఆరోగ్య సమస్యలను యోగాభ్యాసం ద్వారా వీలైనంత వరకు తగ్గిస్తున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను తన సొంత సమస్యగా భావించి తగిన యోగాసనాలు నేర్పిస్తూ ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతున్నారు.
ఆరోగ్యకరమైన అల్పాహారం – అసోసియేషన్ అభినందనలు
కార్యక్రమానంతరం హాజరైన యోగా సాధకులందరికీ ఆరోగ్యకరమైన రాగి జావాను అల్పాహారంగా అందజేశారు. రాక్‌టౌన్ అసోసియేషన్ తరఫున గురువు గారికి మరియు క్రమం తప్పకుండా యోగాకు హాజరవుతున్న సాధకులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యోగా గురువు శ్రీ మధుసూదన్ రెడ్డిని అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రాక్‌టౌన్ ప్రెసిడెంట్ ఎర్ర వినోద్ రెడ్డి, సెక్రటరీ జైపాల్ రెడ్డి, ట్రెజరర్ రామచంద్రా రెడ్డితో పాటు అధిక సంఖ్యలో యోగా సాధకులు పాల్గొన్నారు.


