Wednesday, October 28, 2026
Google search engine
Homeనేషనల్రాహుల్ గాంధీ మెగా ర్యాలీపై వ్యాపారుల ఆందోళన.

రాహుల్ గాంధీ మెగా ర్యాలీపై వ్యాపారుల ఆందోళన.

ఢిల్లీ వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం – వేల కోట్ల రూపాయల వ్యాపారం దెబ్బతినే ప్రమాదం

ఢిల్లీ

కాంగ్రెస్ పార్టీ నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో పది లక్షల మందితో భారీ నిరసన ర్యాలీ నిర్వహించడానికి పిలుపునిచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీనామాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. అయితే, దీపావళి పండుగ వేళ ఈ స్థాయిలో నిరసన చేపట్టడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీకి అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీటీఐ ప్రతినిధులు రెండోసారి లేఖ రాశారు.

లక్షల మంది రాక – రవాణా వ్యవస్థ స్తంభించే అవకాశం:

ర్యాలీ నిమిత్తం సుమారు పది లక్షల మంది నిరసనకారులు, ఇరవై వేల వాహనాలు ఢిల్లీ వీధుల్లోకి వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీల్లో రామ్‌లీలా మైదానం పరిసర ప్రాంతాల్లో రహదారుల మూసివేత, బారికేడ్ల ఏర్పాటు వల్ల వినియోగదారులు దుకాణాలకు చేరుకోలేరు. ఇరుకైన వీధులు కలిగిన రాజధానిలో భారీ వాహనాల రాకపోకలతో తీవ్ర రవాణా అంతరాయం ఏర్పడుతుంది.

పండుగ సమయంలో ఈ నిరసన జరగడం వల్ల రామ్‌లీలా మైదానం పరిసర ప్రాంతాల్లో దాదాపు పది వేల కోట్ల రూపాయల వ్యాపారం దెబ్బతినే ప్రమాదం ఉంది. గతంలో అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద నాలుగు వేల మందితో జరిగిన నిరసనకే రాజధాని వ్యాప్తంగా రాకపోకలు స్తంభించి, మూడు వేల కోట్ల రూపాయల మేర వ్యాపార నష్టం వాటిల్లిందని సీటీఐ తెలిపింది. పది లక్షల మందితో ఆందోళన చేపడితే నష్టం ఊహాతీతంగా ఉంటుందని అంచనా వేశారు.

వ్యాపార సంఘాల విజ్ఞప్తి – ప్రత్యామ్నాయ మార్గాలు:
దీపావళి పండుగ ముగిసే వరకు వ్యాపారాలు సాఫీగా సాగేందుకు ర్యాలీని నవంబర్ 10కి వాయిదా వేయాలని వ్యాపారులు కోరారు. లేదా వాణిజ్య సముదాయాలకు దూరంగా నిరసన ప్రదేశాన్ని మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో చర్చించి ఈ విషయంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని లేఖలో స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments