- నిజామాబాద్‌లో అట్టహాసంగా ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ యాంటీ డ్రగ్ అవగాహన సదస్సు
లక్ష మంది సంతకాలతో కూడిన భారీ ఫ్లెక్సీ ఆవిష్కరణ.. - విద్యార్థులతో ప్రతిన బూన్పించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా..
నిజామాబాద్:
మాదకద్రవ్యాల మహమ్మారి కోరల్లో చిక్కుకుని యువత తమ అమూల్యమైన భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసుకోవద్దని రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నశాముక్త సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని, విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, నవకల్పన, దేశసేవ వైపు యువత తమ దృష్టిని మళ్లించాలని ఆయన పిలుపునిచ్చారు.
మంగళవారం నిజామాబాద్ భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన భారీ యాంటీ డ్రగ్ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతలో సాగుతున్న ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ఒక గొప్ప ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందుతోందని స్పష్టం చేశారు.

*వ్యసనాలతో సర్వనాశనం: ఎంపీ ధర్మపురి అరవింద్
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, మత్తు పదార్థాల వాడకం వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబాలు కూడా సర్వనాశనం అవుతాయని హెచ్చరించారు. యువత క్షణికావేశాలకు, తాత్కాలిక ఆకర్షణలకు లోనై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
*ఉక్కు సంకల్పమే దేశానికి శ్రీరామరక్ష
యువతలోని అంతులేని శక్తిసామర్థ్యాలు, కలలే దేశానికి నిజమైన సంపద అని గవర్నర్ ఉద్ఘాటించారు. స్వామి వివేకానంద బోధనలను స్ఫూర్తిగా తీసుకుని, లోహంలాంటి కండరాలు, ఉక్కులాంటి నరాలు, వజ్రంలాంటి సంకల్పంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జీవితంలో విచక్షణ, ఆత్మనియంత్రణను మార్గదర్శకంగా చేసుకుని, సమాజంలో నశా వ్యతిరేక భావజాలాన్ని బలోపేతం చేయాలని కోరారు.
- లక్ష గళాల ప్రతిన: అంతకుముందు, లక్ష మంది విద్యార్థులు సంతకాలు చేసిన ప్రత్యేక యాంటీ డ్రగ్ అవేర్నెస్ ఫ్లెక్సీని గవర్నర్ ఘనంగా ఆవిష్కరించారు. యువత చేత నషా ముక్త్ ప్రతిజ్ఞ చేయించారు.
- ప్రతిభావంతులకు సత్కారం: నషా ముక్త్ భారత్ కింద నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు గవర్నర్ స్వయంగా జ్ఞాపికలను (మెమెంటోలు) అందించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం. దాన కిషోర్, నగర మేయర్ ఉమారాణి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పి. రాకేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ భవేష్ మిశ్రా, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య తదితరులు పాల్గొన్నారు.



