- అధికారులు పరుగులు.. బీఎల్ఏలు ఎక్కడ…?
- ముసాయిదా ఓటర్ల జాబితాపై గ్రామ సభలు.. కాలనీల్లో కనిపించని బీఎల్ఏలు
ఎల్బీనగర్:
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా సరూర్‌నగర్ వార్డు కార్యాలయంలో కొనసాగుతున్న ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలన, గ్రామ సభల ప్రక్రియను కందుకూరు ఆర్డీఓ ఎన్.జగదీశ్వర్ రెడ్డి, సరూర్ నగర్ మండల తహసీల్దార్ పి. వేణుగోపాల్ తో కలిసి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.ప్రస్తుతం సర్ ప్రక్రియలో తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, సూపర్‌వైజర్లు, బీఎల్ఓలు కీలకంగా విధులు నిర్వహిస్తున్నారు. ఓటర్ల ముసాయిదా జాబితాను పరిశీలించడం, అభ్యంతరాలు, మార్పులు-చేర్పులకు సంబంధించిన వివరాలను స్వీకరించడం వంటి పనుల్లో అధికారులు నిమగ్నమై ఉన్నారు.
కొంతమంది రాజకీయ నేతల సహకారం
మరోవైపు కొన్ని డివిజన్ల పరిధిలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ముందుకు వచ్చి బీఎల్ఓలకు సహకరిస్తున్నారు. తమ పరిధిలోని ఓటర్లకు అవగాహన కల్పిస్తూ, ముసాయిదా జాబితాలో పేర్లు పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో సర్ ప్రక్రియకు రాజకీయ పార్టీల నుంచి మంచి సహకారం లభిస్తోంది.అయితే చాలా కాలనీల్లో బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) మాత్రం కనుచూపు మేరలో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో తమ పరిధిలోని ఓటర్ల వివరాలను పరిశీలించి, అవసరమైన అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో కనిపించకపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఓటర్ల జాబితా.. అధికారులదే కాదు…!
సర్ ప్రక్రియను కేవలం అధికారుల బాధ్యతగా కాకుండా రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా తమ వంతు బాధ్యతగా భావించి చురుగ్గా పాల్గొనాల్సిన అవసరం ఉంది.అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో వారి పాత్ర కీలకం.అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ విధులు నిర్వహిస్తుంటే.. కొన్ని కాలనీల్లో బీఎల్ఏలు మాత్రం ఎందుకు కనిపించడం లేదు? అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఎన్నికల సమయంలో ఓటర్లను కలిసే రాజకీయ పార్టీలు.. ఓటర్ల జాబితా సవరణ వంటి కీలకమైన ప్రక్రియలోనూ అదే స్థాయిలో చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు తమ బాధ్యతను నిర్వర్తిస్తున్న వేళ.. రాజకీయ పార్టీలు కూడా తమ బీఎల్ఏలను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచితేనే అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.



