ఎల్బీనగర్
చింతలకుంట ఎల్పీటీ మార్కెట్ సర్వీస్ రోడ్డు వద్ద నూతనంగా నిర్మిస్తున్న సులభ్ కాంప్లెక్స్ పనులను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న బస్ స్టాప్ వద్ద సులభ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం ప్రతిరోజూ ఉదయం,సాయంత్రం రెండుసార్లు తప్పనిసరిగా శుభ్రం చేసే విధంగా పలు చర్యలు తిసుకోవాలని అధికారులను ఆదేశించారు.పరిసర ప్రాంతాల్లో దుర్వాసన రాకుండా కాలనీ ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా సర్వీస్ రోడ్డుపై ప్రతిరోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో స్థానిక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ను పిలిపించి,ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనదారులకు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పక్కనే ఉన్న సింధూర్ ఎన్క్లేవ్ కాలనీ ప్రతినిధులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిసి తమ కాలనీలోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా రహదారి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో చర్చించి, సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


