Wednesday, November 18, 2026
Google search engine
Homeతెలంగాణ18 ఏళ్ల పోరాటానికి పరీక్ష.. 20న కదం తొక్కనున్న 1300 మంది పాత్రికేయులు!

18 ఏళ్ల పోరాటానికి పరీక్ష.. 20న కదం తొక్కనున్న 1300 మంది పాత్రికేయులు!

  • ప్రభుత్వ నిర్లక్ష్యంపై ‘గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ’ కన్నెర్ర.
  • ధర్నాకు గైర్హాజరైతే నిబంధనల ప్రకారం సభ్యత్వం రద్దు..
  • సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ స్పష్టీకరణ

హైదరాబాద్

పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ, అలుపెరగని న్యాయపోరాటం తర్వాత కూడా జర్నలిస్టుల సొంతింటి కలను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి తగిన గుణపాఠం చెప్పేందుకు గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సిద్ధమైంది. ఈ నెల 20వ తేదీన తలపెట్టిన మహా ధర్నాను చారిత్రాత్మక పోరాటంగా మలిచేందుకు సొసైటీ కార్యవర్గం నడుం బిగించింది. సొసైటీలోని మొత్తం 1300 మంది సభ్యులు ఆ ఒక్క రోజు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన పనులన్నింటినీ పక్కన పెట్టి కచ్చితంగా ధర్నాలో పాల్గొనాలని సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

సంఖ్యాబలమే మన అసలైన ఆయుధం:
ఈ నెల 20న జరగబోయే ధర్నా సాధారణ నిరసన కార్యక్రమం కాదని, ఇది మన అస్తిత్వ పోరాటమని మామిడి సోమయ్య స్పష్టం చేశారు. “పద్దెనిమిది ఏళ్లుగా మనం చేస్తున్న పోరాటాన్ని, మన సొసైటీ ఐక్యతను ప్రభుత్వం, అధికారులు తక్కువ అంచనా వేస్తున్నారు. 1300 మంది సభ్యుల బలం ఉన్న మన సొసైటీ సత్తా ఏమిటో పాలకులకు కళ్లకు కట్టినట్లు చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ధర్నా వేదిక వద్ద మన పూర్తి సంఖ్యాబలం కనిపించకపోతే, సొసైటీ బలహీనంగా ఉందనే తప్పుడు సంకేతాలు ప్రభుత్వ వర్గాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

నిబంధనల అమలులో కఠిన వైఖరి:
సొసైటీ హక్కుల సాధన కోసం చేపడుతున్న ఈ కీలక ఘట్టంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం తప్పనిసరి చేస్తూ కార్యవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై మామిడి సోమయ్య, బొల్లం శ్రీనివాస్ సంయుక్తంగా పలు నిబంధనలను వెల్లడించారు:

  • హాజరు నమోదు: ధర్నా ప్రాంగణానికి విచ్చేసే ప్రతి సభ్యుడి హాజరును కార్యవర్గం అధికారికంగా నమోదు చేస్తుంది.
  • కుటుంబ సభ్యుల ప్రాతినిధ్యం: అనివార్య కారణాల వల్ల సభ్యుడు స్వయంగా రాలేని పక్షంలో, వారి తరఫున కుటుంబ సభ్యులు కచ్చితంగా ధర్నాలో పాల్గొనాలి.
  • సభ్యత్వ రద్దు హెచ్చరిక: ఎటువంటి సహేతుకమైన కారణం లేకుండా ధర్నాకు గైర్హాజరైతే సొసైటీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవు. కార్యవర్గ తీర్మానం ద్వారా అటువంటి వారిని గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వం నుంచి శాశ్వతంగా తొలగించడం జరుగుతుంది.

‘మన కోసం మనం’ కదలిరావాలి:
సభ్యులందరూ ఈ హెచ్చరికలను అన్యథా భావించకుండా, మన హక్కుల సాధన కోసం, మన భవిష్యత్తు కోసం ‘మన కోసం మనం’ అనే స్ఫూర్తితో కదలిరావాలని మామిడి సోమయ్య కోరారు. పద్దెనిమిదేళ్ల కల సాకారం కావాలంటే 20వ తేదీన జరగనున్న ధర్నాను విజయవంతం చేయడం ప్రతి సభ్యుడి బాధ్యత అని కార్యవర్గం పునరుద్ఘాటించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments