శ్రీ మణికంఠ అయ్యప్ప భక్త సమాజం ఆధ్వర్యంలో గణ నాథుడు
ఎల్బీనగర్,
జంట నగరాలలో రెండవ అతిపెద్ద గణనాథునిగా ప్రసిద్ది పొందిన చైతన్యపురి కమలానగర్ గణనాథుడు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాడు.. ఖైరతాబాద్ గణనాథుని రూపకర్తయినటువంటి శిల్పి రాజేంద్రన్ కమలానగర్ గణపయ్యను తీర్చిదిద్దడం ఈ విగ్రహ ప్రత్యేకత. శ్రీ మణికంఠ అయ్యప్ప భక్త సమాజం ఆధ్వర్యంలో ప్రతిఏటా కమలానగర్ లో ఓ భారీ వినాయకున్ని ప్రతిష్టిస్తు ప్రత్యేకతను చాటుతున్నారు. శ్రీ మణికంఠ అయ్యప్ప భక్త సమాజం ఆధ్వర్యంలో గత 50 సంవత్సరాలుగా 1978 నుంచి వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నటప్పటికి… గత ఇరవై సంవత్సరాలుగా 2006 సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఓ ప్రత్యేకతతో కూ డిన భారీ ఏకదంతున్ని రూపొందించడం ఇక్కడి ప్రత్యేకత. అంతేగాక గత పదహారేళ్లుగా ఖైరతాబాద్ గణనాథున్ని రూపొందిస్తున్న శిల్పి రాజేంద్రన్ ఇక్కడ విగ్రహాన్ని కూడ రూపొందిచడం మరో విశేషం. ఈ సంవత్సరం కూడ అదే రీతిలో 30 అడుగుల ఎతైన నందీశ్వర గణపతి విగ్రహాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందు కోసం భక్త సమాజం చైర్మన్ తులసి శ్రీనివాస్ పర్యవేక్షణలో ఖైరతాబాద్ విగ్రహ రూపశిల్పి రాజేంద్రన్ ఆధ్వర్యంలో 15మంది సభ్యుల బృందం గణపయ్య విగ్రహాన్ని తయారుచేస్తున్నారు.
ప్రతి ఏటా ఓ విశిష్టత..
శ్రీ మణికంఠ అయ్యప్ప భక్త సమాజం ఆధ్వర్యంలో ప్రతిష్టించే గణనాథుని ప్రతి సంవత్సరం ఓ ప్రత్యేకత ఉంటుంది. నిర్వాహకుడు తులసి శ్రీనివాస్ గణనాథుని విగ్రహం రూపొందించే విషయంలో ప్రత్యేక శ్రద్ద వహిస్తూ గత రెండు దశాబ్దాలుగా వివిధ రూపాల లంబోదరుని విగ్రహాలను ప్రతిష్టిస్తు నగరంలోనే ప్రత్యేకతను సొంతం చేసుకుంటున్నారు.
పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట..!
పర్యావరణ పరిరక్షణలో భాగంగా బంకమట్టి, వాటర్ కలర్లతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తులసి శ్రీనివాస్ వెల్లడించారు. విగ్రహ తయారీలో కొబ్బరి నార, గోనె తట్టు ఉపయోగించనున్నట్లు వివరించారు. మెట్రో పనుల మూలంగా నిమజ్జనం రోజు ఊరేగింపులో ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఈ ఏడాది విగ్రహ ఎత్తును కుదించడం జరిగిందన్నారు. నిర్వాహకులు విశ్వనాథ రాజు, సిద్దార్థ(మున్నా)లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.


