- ప్రతి అడుగు నిబంధనల ప్రకారమే సాగాలిరైతుల సమక్షంలోనే భూముల కొలతలు..
- ప్రతి అంగుళం భూమికి పక్కా లెక్కలు
- ప్రామాణిక కార్యనిర్వహణ విధానాలను తూ.చ. తప్పకుండా అమలు చేయాలి
- క్షేత్రస్థాయిలో పారదర్శకత.. రైతుల అభ్యంతరాలకు తక్షణ పరిష్కారంతుది రికార్డుల ఖరారులో పూర్తి చట్టబద్ధత ఉండాలి
- రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, ప్రతి రైతుకు తన భూమిపై స్పష్టమైన, వివాదరహితమైన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. భూముల సరిహద్దులు, విస్తీర్ణం, క్షేత్రస్థాయి స్వాధీనం, రెవెన్యూ రికార్డుల మధ్య ఉన్న వ్యత్యాసాలను శాస్త్రీయంగా, పారదర్శకంగా గుర్తించి, భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలకు ఆస్కారం లేకుండా పక్కా భూ రికార్డులను రూపొందించడమే ఈ రీసర్వే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. నిజాం కాలం నాటి గొలుసు కొలతల స్థానంలో ఆధునిక ఉపగ్రహ ఆధారిత సాంకేతికత, అత్యంత కచ్చితమైన ఎలక్ట్రానిక్ కొలతల పరికరాలను వినియోగిస్తూ సెంటీమీటర్ స్థాయి కచ్చితత్వంతో భూముల హద్దులను నిర్ణయించనున్నారు. ఈ ప్రక్రియలో రైతులే కేంద్రబిందువుగా ఉండాలని, వారి సమక్షంలోనే భూముల కొలతలు చేపట్టి, ప్రతి దశలో వారికి పూర్తి సమాచారం అందించాలని సూచించారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ రూపొందించిన ప్రామాణిక కార్యనిర్వహణ విధాన మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో తూ.చ. తప్పకుండా అమలు చేయాలని, రీసర్వేను సాధారణ పరిపాలనా కార్యక్రమంగా కాకుండా ప్రత్యేక లక్ష్యంగా తీసుకొని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తెలంగాణ సర్వే మరియు సరిహద్దుల చట్టం-1923, తెలంగాణ భూ భారతి (భూమిలో హక్కుల రికార్డు) చట్టం-2025 నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, సర్వే అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

రీసర్వేకు ముందే రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి:
గ్రామాల్లో దండోరా వేయించి, గ్రామసభల ద్వారా రీసర్వే ఉద్దేశం, విధానం, ప్రయోజనాలను రైతులకు వివరించాలి. క్షేత్రస్థాయి సర్వేకు కనీసం నాలుగు రోజుల ముందుగానే సంబంధిత పట్టాదారులకు నోటీసులు అందించాలి. సర్వేకు రెండు రోజుల ముందుగా రైతులు తమ పొలాల సరిహద్దు మూలల్లో జెండాలు పాతుకునేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, అటవీ భూముల సరిహద్దులను గుర్తించేందుకు నమూనా-9, నమూనా-10 నోటీసులు జారీ చేయాలి. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆక్రమణలకు ఎలాంటి అవకాశం లేకుండా సరిహద్దులను నిర్ధారించాలి.
రైతుల సమక్షంలోనే కొలతలు.. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన లెక్కలు:
ప్రతి భూ కమతం కొలతలను ఆధునిక డిజిటల్ పరికరాలతో పారదర్శకంగా నిర్వహించాలి. సర్వే పూర్తయిన వెంటనే వాస్తవంగా ఉన్న భూమి విస్తీర్ణాన్ని సంబంధిత రైతుకు అక్కడికక్కడే తెలియజేయాలి. రెవెన్యూ రికార్డుల్లో నమోదైన విస్తీర్ణానికి, క్షేత్రస్థాయి కొలతలకు మధ్య తేడాలు ఉంటే రైతుల దృష్టికి తీసుకెళ్లాలి. ఆ వ్యత్యాసాలకు గల కారణాలను క్షేత్ర రిజిస్టర్లోని విశేషాల గడిలో స్పష్టంగా నమోదు చేయాలి. సర్వే పూర్తయిన వెంటనే సంబంధిత వివరాలను భూ భారతి అంతర్జాల వేదికలో నమోదు చేయాలి.
భూ వివాదాల పరిష్కారానికి గ్రామస్థాయిలో ప్రత్యేక శిబిరాలు:
రికార్డుల్లోని వివరాలకు, క్షేత్రస్థాయి స్వాధీనానికి మధ్య వ్యత్యాసాలు ఉన్న ప్రాంతాల్లో తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలి. అవసరమైన చోట మూడు నుంచి నాలుగు రోజుల పాటు గ్రామస్థాయి ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలి. గ్రామ పెద్దలు, పొరుగు భూముల రైతులు, సంబంధిత పట్టాదారుల సమక్షంలో చర్చలు జరిపి వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలి. ఉమ్మడి ఖాతాలు, ఉమ్మడి భూ కమతాల సంఖ్యలు కలిగిన రైతులు పరస్పర అంగీకారంతో ఉపవిభజన చేసుకునేలా ప్రోత్సహించాలి. చిన్నపాటి సరిహద్దు వివాదాలు సైతం భవిష్యత్తులో పెద్ద సమస్యలుగా మారకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.
అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ.. అభ్యంతరాల పరిష్కారానికి ప్రాధాన్యత:
సెక్షన్ 9(2) కింద నోటీసులు జారీ చేసిన అనంతరం విజ్ఞప్తి వ్యవధిలో అదనపు కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు స్వయంగా గ్రామాలను సందర్శించాలి. రైతులు సమర్పించిన అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవాల ఆధారంగా పరిష్కరించాలి. రైతులకు తమ వాదనలు వినిపించుకునే అవకాశం కల్పించాలి. అభ్యంతరాల పరిష్కారంలో ఎలాంటి జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. అన్ని అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించిన తర్వాతే రెవెన్యూ డివిజనల్ అధికారి ఆమోదంతో సెక్షన్ 13 కింద తుది రాజపత్ర ప్రకటన విడుదల చేయాలి. తుది ప్రకటన అనంతరం భూ భారతి చట్టం ప్రకారం తహసీల్దార్లు హక్కుల రికార్డులో, భూ భారతి వేదికలో అవసరమైన సవరణలను పూర్తి చేయాలి. రీసర్వే ద్వారా రూపొందే తుది రికార్డులు చట్టబద్ధంగా, పారదర్శకంగా, భవిష్యత్తులో వివాదాలకు తావులేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
“రైతులకు భరోసా కల్పించడమే రీసర్వే లక్ష్యం:
భూ రీసర్వే కార్యక్రమం ద్వారా కేవలం భూముల కొలతలు నిర్వహించడం మాత్రమే ప్రభుత్వ లక్ష్యం కాదని, దశాబ్దాలుగా పరిష్కారం కాని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం, భూముల సరిహద్దులను నిర్ధారించడం, రెవెన్యూ రికార్డులను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సరిచేయడం, రైతుల భూ హక్కులకు మరింత భద్రత కల్పించడమే ప్రధాన ఉద్దేశమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఒక్క రైతు కూడా అన్యాయానికి గురికాకూడదని, సర్వే ప్రక్రియలో చిన్నపాటి పొరపాట్లకు సైతం అవకాశం ఇవ్వకూడదని అధికారులకు సూచించారు. నిబంధనల అమలులో ఎక్కడా రాజీ పడకుండా, రైతుల విశ్వాసాన్ని చూరగొంటూ, పూర్తి బాధ్యతతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.



