మీరు కూల్ డ్రింక్స్‌ను తరచూ తాగుతున్నారా.. వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు ఈ డ్రింక్స్‌ను తాగుతుంటారా.. అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే. అవును, ఎందుకంటే ఇలా కూల్ డ్రింక్స్‌ను తరచూ తాగడం వల్ల ఎముకల సాంద్రత తగ్గిపోతుందని, ఎముకలు బలహీనంగా మారి విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. కూల్ డ్రింక్స్ మనకు అనేక విధాలుగా హాని చేస్తాయని, ముఖ్యంగా వీటి వల్ల ఎముకలు బలహీనంగా మారిపోతాయని సైంటిస్టులు అంటున్నారు.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌కు చెంఎదిన పరిశోధకులు 7 ఏళ్ల పాటు అధ్యయనం చేసి ఈ వివరాలను వెల్లడించారు. తరచూ కూల్ డ్రింక్స్ తాగేవారి ఎముకలు త్వరగా విరిగిపోయే అవకాశాలు ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లోనూ ఈ వివరాలను ప్రచురించారు. అయితే ఈ సమస్య మహిళల్లో మరింత ఎక్కువగా ఉంటుందని వారు అంటున్నారు. కనుక మహిళలు అసలు కూల్ డ్రింక్స్‌ను తాగకపోవడమే మంచిదని వారు సూచిస్తున్నారు.
ఇక కూల్ డ్రింక్స్‌లో చక్కెర కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల కూల్ డ్రింక్స్‌ను తాగితే శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. ఫలితంగా ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఈ మూత్రంతోపాటు క్యాల్షియం కూడా బయటకు పోతుంది. దీంతో శరీరానికి క్యాల్షియం లభించక ఎముకలు బలహీనంగా మారుతాయి. కనుక ఎలా చూసినా కూడా కూల్ డ్రింక్స్ వల్ల మనకు నష్టమే తప్ప అసలు ఏమాత్రం లాభం ఉండదు. కాబట్టి కూల్ డ్రింక్స్‌ను తరచూ తాగుతున్నవారు ఇకనైనా జాగ్రత్త పడాల్సిందేనని డాక్టర్లు సైతం సూచిస్తున్నారు.
క్యాల్షియం తక్కువగా ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు క్యాల్షియం ట్యాబ్లెట్లను వాడవచ్చు. అలాగే పాలు, గుడ్లు, జీడిపప్పు, బాదం వంటి ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల కూడా క్యాల్షియం లభిస్తుంది. వారంలో రెండు సార్లు నువ్వులతో చేసిన చిక్కిలను తినాలి. దీంతో కూడా క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. దీంతో ఎముకలు బలంగా తయారవుతాయి.


