Wednesday, November 25, 2026
Google search engine
Homeతెలంగాణఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఆయన పి.ఆర్వో బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే!

ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఆయన పి.ఆర్వో బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే!

  • పాత్రికేయుల ఆత్మగౌరవాన్ని
    కించపరిస్తే సహించేది లేదు.. ఐక్య పోరాటంతో తగిన సమాధానం చెబుతాం!
  • ఒక్క పాత్రికేయుడిపై అవమానకర వ్యాఖ్యలు.. యావత్ పాత్రికేయ సమాజంపై దాడిగా పరిగణిస్తాం!
  • మునుగనూరు ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో పాత్రికేయులకు అన్యాయం జరిగిందెందుకు..?
  • ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులకు, ఆయన డ్రైవర్లకు జర్నలిస్టుల ఇళ్లస్థలాలు అక్రమంగా కేటాయించారు ..
  • అర్హులైన పాత్రికేయులకు మొండిచేయా…?
  • పాత్రికేయుల సంక్షేమం పట్టదా? ప్రజాప్రతినిధుల బాధ్యత ఇదేనా?
  • క్షమాపణ చెప్పకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం.. ఐక్య కార్యాచరణ సమితి నాయకుల హెచ్చరిక

ఎల్బీనగర్:

పాత్రికేయుల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ప్రజా సమస్యలను ప్రశ్నించే ప్రసార మాధ్యమాల గొంతుకలను అవమానిస్తే ఐక్య పోరాటంతో తగిన సమాధానం చెబుతామని ఎల్బీనగర్ పనిచేస్తున్న పాత్రికేయుల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు సమరభేరి మోగించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పత్రికా రంగానికి రాజ్యాంగంలోని అధికరణం 19(1)(ఎ) భావప్రకటనా స్వేచ్ఛను ప్రసాదించిందని, పాలకుల తప్పిదాలను ఎత్తిచూపే హక్కును సుప్రీంకోర్టు సైతం అనేక తీర్పులలో స్పష్టం చేసిందని వారు గుర్తుచేశారు. ‘దిశ’ పాత్రికేయుడు రాజుపై శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి వీఆర్వో హరికృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సోమవారం ఎల్బీనగర్‌లోని శ్రీకాంతాచారి కూడలిలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. శాసనసభ్యుడు సుధీర్‌రెడ్డి, హరికృష్ణ తక్షణమే తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని పాత్రికేయ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాత్రికేయులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని అవమానించడం, ప్రజా సమస్యలపై వార్తలు రాస్తే కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని మండిపడ్డారు. ప్రసార మాధ్యమాలు తమకు అనుకూలంగా ఉన్నంతకాలం ఒకలా, ప్రశ్నించినప్పుడు మరోలా వ్యవహరిస్తారా? అని నిలదీశారు.
ప్రశ్నించడం నేరమా? ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు రాజు నిలదీత
ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు, ‘దిశ’ పాత్రికేయుడు రాజు మాట్లాడుతూ.. పాత్రికేయులు ఉన్నది ఉన్నట్లుగా వార్తలు రాస్తే కొందరికి మింగుడు పడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం పాత్రికేయులు చేసిన నేరమా? ప్రజల తరఫున ప్రశ్నించే హక్కును కాలరాసే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. మునుగనూరు ఇళ్ల స్థలాల కేటాయింపుల వ్యవహారంపై వాస్తవ ఆధారాలతో వార్తలు రాసినందుకే తనను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. శాసనసభ్యుడి అనుచరులు, వాహన చోదకులు, అనధికారిక వ్యక్తులకు స్థలాలు కేటాయించారనే ఆరోపణలపై ప్రశ్నిస్తే పాత్రికేయులను కించపరిచేలా మాట్లాడటం వెనుక ఆంతర్యమేమిటని నిలదీశారు. ఒక పాత్రికేయుడిని అవమానిస్తే అది ఒక్క వ్యక్తికి సంబంధించిన సమస్యగా చూడబోమని, యావత్ పాత్రికేయ సమాజ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా పరిగణించి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

పక్క నియోజకవర్గాల్లో న్యాయం.. ఎల్బీనగర్‌లో అన్యాయమా?
ఐక్య కార్యాచరణ సమితి అధికార ప్రతినిధి, ముద్రణ మరియు అంతర్జాల ప్రసార మాధ్యమాల సంఘం అధ్యక్షుడు, ప్రత్యేక సంచిక తెలుగు దినపత్రిక సంపాదకుడు ఎస్‌బీఎన్ చారి మాట్లాడుతూ.. పాత్రికేయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెనకేసుకొచ్చే ధోరణిని శాసనసభ్యుడు సుధీర్‌రెడ్డి మానుకోవాలని హితవు పలికారు. పాత్రికేయుల ఇళ్ల స్థలాల కోసం గతంలో తాము చేసిన పోరాటాలు శాసనసభ్యుడికి తెలియవా? అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలను నిరంతరం ప్రభుత్వానికి చేరవేస్తూ, ఎండనకా వాననకా విధులు నిర్వహించే పాత్రికేయులకు కనీసం సొంత గూడు కల్పించాలనే బాధ్యత ప్రజాప్రతినిధులకు లేదా? అని నిలదీశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అప్పటి శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గంలో అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. పక్క నియోజకవర్గాల్లో పాత్రికేయులకు స్థలాలు కేటాయించినప్పుడు ఎల్బీనగర్ నియోజకవర్గంలో మాత్రం ఎందుకు అన్యాయం జరిగిందని ప్రశ్నించారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే శాసనసభ్యుడి సొంత ఆస్తులు ఏమైనా కరిగిపోతాయా? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

సర్వే సంఖ్య 90 కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపించాలి:
మునుగనూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే సంఖ్య 90లో ఇళ్ల స్థలాల కేటాయింపుల వ్యవహారం అనేక అనుమానాలకు తావిస్తోందని ఐక్య కార్యాచరణ సమితి నాయకులు పేర్కొన్నారు. అర్హులైన పాత్రికేయులను పక్కనపెట్టి శాసనసభ్యుడి అనుచరులు, వాహన చోదకులు, అనధికారిక ప్రజాసంబంధాల అధికారికి స్థలాలు కేటాయించారనే ఆరోపణలపై రెవెన్యూ రికార్డులు, లబ్ధిదారుల జాబితా ఆధారంగా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల కేటాయింపుల్లో పారదర్శకత పాటించాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారికే దక్కాలని స్పష్టం చేశారు. అసలు స్థలాల కేటాయింపులకు ప్రాతిపదిక ఏమిటి? అర్హతలు ఎలా నిర్ణయించారు? పాత్రికేయులను ఎందుకు విస్మరించారు? అనే అంశాలపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పష్టమైన సమాధానం చెప్పాలని కోరారు. పాత్రికేయుల సంక్షేమం కోసం కృషి చేయాల్సిన ప్రజాప్రతినిధులే వారి హక్కులను విస్మరిస్తే ఎవరిని ఆశ్రయించాలని ప్రశ్నించారు.

కూడు, గుడ్డతో పాటు గూడు కూడా అత్యవసరం: కడారి శ్రీనివాస్
ఐక్య కార్యాచరణ సమితి కళా సాంస్కృతిక సారథి కడారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తమ పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదని, పాత్రికేయులకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసమేనని స్పష్టం చేశారు. పాత్రికేయులకు కూడు, గుడ్డతోపాటు గూడు కూడా అత్యవసరమని పేర్కొన్నారు. నిత్యం ప్రజల సమస్యల కోసం పనిచేసే పాత్రికేయుల కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. మునుగనూరు భూముల కేటాయింపులపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. ఇప్పటికైనా శాసనసభ్యుడు స్పందించి పాత్రికేయులతో స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగించాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి వెనుకాడబోం.. నాయకుల హెచ్చరిక
ప్రజాస్వామ్యంలో ప్రసార మాధ్యమాల పాత్ర అత్యంత కీలకమని, ప్రజల సమస్యలను ప్రశ్నించే పాత్రికేయులను గౌరవించడం ప్రజాప్రతినిధుల కనీస బాధ్యతని ఐక్య కార్యాచరణ సమితి నాయకులు స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడం, పాలనలోని లోపాలను ఎత్తిచూపడం పాత్రికేయుల విధి అని పేర్కొన్నారు. వార్తలు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు పాత్రికేయులను ప్రోత్సహించి, వ్యతిరేకంగా వచ్చినప్పుడు వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతమాత్రం సహించబోమన్నారు. ఒకరిపై జరిగిన అవమానాన్ని మరో పాత్రికేయుడికి జరిగిన అవమానంగా భావించి ఐక్యంగా నిలబడతామని ప్రకటించారు. శాసనసభ్యుడు సుధీర్‌రెడ్డి, హరికృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్త పాత్రికేయ సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో వార్తాపత్రికల సంపాదకుల హక్కుల సంఘం (నెరా) అధ్యక్షుడు కట్టా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి లింగాల నరేందర్ గౌడ్, ‘శనార్తి తెలంగాణ’ సంపాదకుడు పంతంగి భిక్షం గౌడ్, ‘యువనేత పిలుపు’ సంపాదకుడు శ్రీను, ‘నిమిషానికో వార్త’ సంపాదకుడు సతీష్ కుమార్, ‘ఆదర్శ సమాచారం’ తెలుగు దినపత్రిక సంపాదకుడు వెంకటరెడ్డి, ‘ప్రసార చిత్ర వార్తల’ అధినేత వరప్రసాద్, ‘నవతెలంగాణ’ పాత్రికేయుడు దుర్గేష్, ‘విజయక్రాంతి’ పాత్రికేయుడు ఆంజనేయులు, పాత్రికేయులు శ్రీనివాస్, ముత్తయ్య ముదిరాజ్, పాపారావు, సకృ నాయక్, చంటి, భద్రయ్య, శ్రీకాంత్, శంకు యాదవ్, తదితర ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు, పాత్రికేయులు పాల్గొని నిరసనకు సంఘీభావం తెలిపారు. పాత్రికేయుల ఆత్మగౌరవం, హక్కులు, సంక్షేమం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments