Wednesday, November 25, 2026
Google search engine
Homeతెలంగాణకూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో అవినీతి బాగోతం..

కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో అవినీతి బాగోతం..

కార్మికుల పొట్ట కొడుతున్న క్షేత్రస్థాయి సిబ్బంది

  • పని చేయకుండానే హాజరు వేస్తూ లక్షల రూపాయల వసూళ్లు
  • వారసత్వ ఉద్యోగాలకు రూ. లక్ష, కొత్త నియామకాలకు రూ. 2.5 లక్షల బేరం
  • పారిశుద్ధ్య పర్యవేక్షకుడు ముక్క ఎస్.ఎఫ్.ఏ శివ అక్రమాలపై కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు
  • ఉన్నతాధికారుల అండదండలతోనే దందా సాగుతోందని కార్మికుల ఆరోపణ.

హైదరాబాద్:

కూకట్‌పల్లి జోనల్ కార్యాలయ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుల శ్రమను క్షేత్రస్థాయి సిబ్బంది అక్రమ సంపాదనకు వనరుగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కార్మికుల కష్టార్జితాన్ని లంచాల రూపంలో దోచుకుంటున్న పారిశుద్ధ్య క్షేత్ర సహాయకులను తక్షణమే విధుల నుండి తొలగించాలని బాధితులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. పని చేయకుండానే హాజరు నమోదు చేసి ఇంటికి పంపించేందుకు కొందరు క్షేత్ర సహాయకులు నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారని, తద్వారా నగరపాలక సంస్థ ఖజానాకు భారీగా గండి పడుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ హాజరు నమోదులో పారదర్శకత ఉండాల్సి ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ అక్రమాలు వ్యవస్థ పనితీరుపై అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.

ఉద్యోగ నియామకాలు, వారసత్వ బదిలీల విషయంలోనూ భారీ స్థాయిలో నగదు చేతులు మారుతున్నట్లు బాధితులు ఆధారాలతో సహా వెల్లడిస్తున్నారు. అరవై సంవత్సరాలు నిండిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించేందుకు రూ. 60 వేల నుండి రూ. 1 లక్ష వరకు లంచం డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా, కొత్తగా పనుల్లోకి చేర్చుకోవడానికి ఒక్కొక్కరి నుండి ఏకంగా రూ. 2.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారని, ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని ప్రశ్నిస్తే పైస్థాయి అధికారులకు కూడా వాటాలు ఇవ్వాల్సి ఉంటుందని క్షేత్ర సహాయకులు బహిరంగంగానే చెబుతున్నట్లు కార్మికులు వాపోతున్నారు.

ఈ అక్రమాల పరంపరలో పారిశుద్ధ్య పర్యవేక్షకుడు ఎస్.ఎఫ్.ఏ ముక్క శివ వ్యవహారశైలిపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కమిషనర్ కార్యాలయంలో లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. గతంలో వేలిముద్రల హాజరు విధానం అమలులో ఉన్న సమయంలో, కార్మికులకు తెలియకుండానే వారి వేలిముద్రలను దొంగతనంగా సేకరించి నకిలీ హాజరుతో వేతనాలను కాజేసిన చరిత్ర ఇతనికి ఉందని కార్మికులు ఆరోపిస్తున్నారు. అక్కడితో ఆగకుండా, రెండు పడకల గదుల ఇళ్లు ఇప్పిస్తానని నమ్మబలికి ఒకరి వద్ద రూ. 30 వేలు, మరొకరి వద్ద రూ. 20 వేలు వసూలు చేసి మోసగించాడని బాధితులు పేర్కొంటున్నారు. ముక్క శివ సాగిస్తున్న ఈ అక్రమ దందాల వల్ల కూకట్‌పల్లి జోనల్ కార్యాలయ ప్రతిష్ట మసకబారుతోందని, అతడిని తక్షణమే ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించాలని కార్మికులు పట్టుబడుతున్నారు.

క్షేత్రస్థాయిలో ఇంతటి భారీ అవినీతి యథేచ్ఛగా సాగడం వెనుక ఉన్నతాధికారుల హస్తం ఉందన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. పారిశుద్ధ్య పర్యవేక్షకుడు ముక్క శివకు అండగా ఉప కమిషనర్ ఆంజనేయులు, ఇతర పర్యవేక్షక అధికారుల సహకారం ఉండబట్టే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా చర్యలు తీసుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ కమిషనర్ స్పందించి, వేలిముద్రల హాజరు చిట్టా, వేతన చెల్లింపుల రికార్డులపై లోతైన సాంకేతిక విచారణ జరిపించాలని, అవినీతికి పాల్పడిన క్షేత్ర సహాయకులను, వారికి సహకరిస్తున్న అధికారులను విధుల నుండి తొలగించి కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments