Friday, November 27, 2026
Google search engine
Homeతెలంగాణకృత్రిమ మేధతో గ్రంథాలయ సేవల్లో విప్లవాత్మక మార్పులు రావాలి: గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

కృత్రిమ మేధతో గ్రంథాలయ సేవల్లో విప్లవాత్మక మార్పులు రావాలి: గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

  • డిజిటల్ పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి రావాలి
  • ఆర్థిక, భౌగోళిక పరిమితులతో విద్యార్థులకు నాణ్యమైన సమాచారం దూరం కాకూడదు

హైదరాబాద్:

కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్ సాంకేతికతను వినియోగించుకుని గ్రంథాలయ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు. ఆధునిక గ్రంథాలయాలు కేవలం పుస్తకాల భాండాగారాలుగా కాకుండా జ్ఞాన సృష్టికి, పరిశోధనలకు, నూతన ఆవిష్కరణలకు, సామాజిక మార్పునకు కేంద్రాలుగా ఎదగాలని సూచించారు. ప్రతి విద్యార్థి, పరిశోధకుడికి నాణ్యమైన సమాచారం, విద్యావకాశాలు సమానంగా అందేలా చూడాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని హోటల్ ద పార్క్‌లో డెల్‌నెట్ (DELNET – Developing Library Network), న్యూఢిల్లీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన 29వ జాతీయ జ్ఞాన, గ్రంథాలయ, సమాచార నెట్‌వర్కింగ్ సదస్సు (NACLIN–2026) ప్రారంభోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
జ్ఞాన ఆధారిత సమాజ నిర్మాణంలో గ్రంథాలయాల పాత్ర అత్యంత కీలకమని గవర్నర్ పేర్కొన్నారు. విద్య, పరిశోధన, మేధో వికాసానికి గ్రంథాలయాలు ప్రధాన కేంద్రాలని అన్నారు. డిజిటల్ సాంకేతికత, నెట్‌వర్కింగ్, కృత్రిమ మేధ ద్వారా జ్ఞాన సృష్టి, భద్రపరచడం, విస్తృతంగా ప్రజలకు చేరవేయడంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అయితే ఈ సాంకేతికతలను విశ్వసనీయ సమాచారం, సమాన జ్ఞాన అవకాశాల కల్పనకు ఉపయోగించాలన్నారు.
వివిధ విద్యాసంస్థలను అనుసంధానిస్తూ వనరుల భాగస్వామ్యం, పరిశోధన సహకారం, జ్ఞాన వ్యాప్తికి డెల్‌నెట్ చేస్తున్న కృషిని గవర్నర్ అభినందించారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని గ్రంథాలయాలకు కూడా డిజిటల్ వనరులు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక పరిమితుల కారణంగా ఏ విద్యార్థి, పరిశోధకుడూ నాణ్యమైన సమాచారానికి దూరం కాకూడదన్నారు.

‘ఏఐ ఆధారిత గ్రంథాలయాలు: అందుబాటు, సేవలు, అభ్యసనం, పరిశోధన’ అనే ఈ సదస్సు ఇతివృత్తం ప్రస్తుత అవసరాలకు, భవిష్యత్తు అవకాశాలకు అద్దం పడుతోందన్నారు. ఏఐ వినియోగంలో నైతిక విలువలు, సమాచార భద్రత, బాధ్యతాయుత సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. పరిశోధన నాణ్యతను పెంచడం, పాఠకులకు మెరుగైన గ్రంథాలయ సేవలు అందించడం, మానవ సామర్థ్యాలను విస్తరించడం కోసం ఏఐని వినియోగించుకోవాలని సూచించారు.
డిజిటల్ అక్షరాస్యత, వినియోగదారులకు అనుకూలమైన సేవలు, అందరికీ సమానంగా జ్ఞానం అందించే వ్యవస్థల అభివృద్ధిపై నిపుణులు దృష్టి సారించాలని కోరారు. విద్యార్థుల్లో పఠనాసక్తి, జిజ్ఞాస, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో గ్రంథాలయాధికారులు కీలక మార్గదర్శకులని పేర్కొన్నారు.
ఈ సదస్సులో జరిగే చర్చలు, అనుభవాల పరస్పర మార్పిడి, నిపుణుల సూచనలు భవిష్యత్తు గ్రంథాలయ వ్యవస్థలకు కొత్త దిశానిర్దేశం చేస్తాయని గవర్నర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో జ్ఞాన ప్రజాస్వామ్యీకరణ, పరిశోధన సహకారం, సాంకేతిక ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
కార్యక్రమంలో డెల్‌నెట్ అధ్యక్షుడు శ్రీ కె. జయకుమార్, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎస్. మూర్తి, డైరెక్టర్ డాక్టర్ సంగీత కౌల్, కోశాధికారి డాక్టర్ పి.ఆర్. గోస్వామి, నిర్వాహకులు, నిపుణులు, ప్రతినిధులు పాల్గొన్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments