- *జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.
- *అక్రెడిటేషన్ల నిరాకరణ, రైల్వే రాయితీ రద్దుపై పోరు బాట.
- *కూకట్ పల్లి వేదికగా సమర శంఖం పూరించిన టీడబ్ల్యూజేఎఫ్.
ఉద్యమ సమయాన ఊరడించి, అధికార పీఠమెక్కాక ఈగలా తీసిపారేసే రాజకీయ వ్యాపారులకు ‘కలం’ బలం రుచి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది! ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమని సభల్లో ఉచిత సలహాలిచ్చే ఉద్దండులు.. తీరా అక్రెడిటేషన్ కార్డు ఇవ్వడానికీ, రైల్వే రాయితీ పునరుద్ధరించడానికీ చేతులెత్తేస్తున్నారు. ప్రజాసమస్యల నివేదనలో విలేకరుల శ్రమను వాడుకుని, వారి కనీస హక్కులను కాలరాస్తున్న పాలకుల కాపట్యానికి నిరసనల నిప్పులతోనే సమాధానం చెప్పాలి….మీ..వి.జి..
హైదరాబాద్:
తెలంగాణ మలిదశ పోరాటంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిలిచిన పాత్రికేయ లోకంపై నేటి పాలకులు తీవ్ర వివక్ష చూపుతున్నారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని పక్కనబెట్టి, వారి ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న పాలకుల నిరంకుశ వైఖరిపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మౌలిక హక్కుల సాధన కోసం పాత్రికేయులు మరొక పోరాటానికి సిద్ధం కాక తప్పని పరిస్తితిని ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి.
కూకట్ పల్లి నియోజకవర్గ మహాసభ శుక్రవారం ఏఎస్ రాజు నగర్ కమ్యూనిటీ హాల్ లో ఉద్విగ్న వాతావరణంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రతిధ్వనించిన ప్రధాన అంశాలు, తీర్మానాలు పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టాయి.

*అక్రెడిటేషన్ల నిరాకరణ: హక్కుల భంగం: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం: క్షేత్రస్థాయిలో అహోరాత్రులు శ్రమించే విలేకరులకు కనీస చట్టబద్ధమైన అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
*రోడ్డెక్కిన కలం యోధులు: హక్కుగా రావలసిన గుర్తింపు కార్డుల కోసం జర్నలిస్టులు ధర్నాలు, ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడటం తీవ్ర విచారకరం.
*కేంద్రం వైఖరి – రాయితీల కోత
“రైల్వే చార్జీలలో దశాబ్దాలుగా అమల్లో ఉన్న 50 శాతం రాయితీని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయడం పాత్రికేయ వ్యవస్థపై దాడి చేయడమే.”
*ఛలో పార్లమెంట్ పిలుపు: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిలదీసేందుకు ఈనెల 27న “ఛలో పార్లమెంట్” ఆందోళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు.
*స్వతంత్ర పోరాట పంథా:
ఏకపక్ష రాజకీయాలకు దూరం: టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పక్షానికి గానీ, యాజమాన్యాల ప్రయోజనాలకు గానీ కొమ్ముకాయదు.
*ఐక్య పోరాటమే శరణ్యం: భ్రమలను తొలగించుకుని, హక్కుల సాధన కోసం జర్నలిస్టులందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాటాలను తీవ్రతరం చేయడమే ఏకైక మార్గం.


