*హైఫీజ్‌పేటలో విషాదం.. రాత్రి నుంచి కొనసాగుతున్న రెస్పాన్స్ ఆపరేషన్
**హైదరాబాద్:
నగరంలోని హఫీజ్‌పేట డివిజన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో వరద కాలువలో పడి గల్లంతైన వృద్ధుడి జాడ కోసం హైడ్రా ఆధ్వర్యంలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టినప్పటికీ, రాత్రి నుంచి విస్తృతంగా గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు.
*ప్రమాదం జరిగిందిలా..
మదీనాగూడ వైశాలినగర్ రైల్వే అండర్ పాస్ వద్ద రోడ్డు దాటుతున్న సుమారు 70 ఏళ్ల వృద్ధుడు ప్రమాదవశాత్తు వరద కాలువలో పడిపోయినట్లు స్థానికులు గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
*రంగంలోకి హైడ్రా, విపత్తు నిర్వహణ బృందాలు
సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్), మాన్సూన్ రెస్పాన్స్ టీమ్‌లు, స్థానిక పోలీసులు మరియు మున్సిపల్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
- ఈ వరద కాలువ మదీనాగూడలోని ఈర్ల చెరువులోకి, అక్కడి నుంచి గంగారం పెద్ద చెరువులోకి కలుస్తుంది.
- ప్రస్తుతం ఈర్ల చెరువు అభివృద్ధి పనులు జరుగుతుండటంతో, కాలువ నీటిని నేరుగా గంగారం పెద్ద చెరువుకు డైవర్ట్ చేశారు. ఇదే మార్గంలో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
*3 కిలోమీటర్ల మేర జల్లెడ
మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం సాయంత్రం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర పైపులైన్లు మరియు బాక్స్ డ్రైన్లలోకి సిబ్బంది స్వయంగా దిగి గాలించినప్పటికీ వృద్ధుడి ఆచూకీ లభించలేదు.
ఈ సహాయక చర్యలను హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ స్వయంగా సంఘటన స్థలంలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. చీకటిని లెక్కచేయకుండా రాత్రంతా శ్రమించిన సిబ్బంది, బాధితుడి కోసం అన్వేషణను కొనసాగిస్తున్నారు.



