Thursday, September 3, 2026
Google search engine
Homeతెలంగాణసబ్ రిజిస్టర్ రెహ్మాన్ నకిలీ రిజిస్ట్రేషన్ల మాయ:

సబ్ రిజిస్టర్ రెహ్మాన్ నకిలీ రిజిస్ట్రేషన్ల మాయ:

  • రూ.4.11 కోట్ల కుంభకోణంలో చంపాపేట సబ్-రిజిస్ట్రార్ అరెస్ట్.
  • బాలాపూర్, నాదర్‌గుల్, మీర్‌పేట్ ప్రాంతాలలో యథేచ్ఛగా వందల సంఖ్యలో అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ల దందా..
  • శాస్త్రీయ ఆధారాలతో బట్టబయలైన అవినీతి లీలలు

కాసుల కక్కుర్తి కోసం చట్టాలను తుంగలో తొక్కే అవినీతి అధికారుల అక్రమ దందాలు మరోసారి నిలువునా దొరికిపోయాయి. లేని ఆస్తులను ఉన్నట్లుగా సృష్టించి, ప్రభుత్వ నిబంధనలను కాలరాస్తూ కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను లూటీ చేస్తున్న బరితెగించిన మోసగాళ్ల ముఠా గుట్టును కీసర పోలీసులు రట్టు చేశారు. ఈ భారీ కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా ఉన్న చంపాపేట సబ్-రిజిస్ట్రార్ మహ్మద్ యూసుఫ్ ఉర్ రెహ్మాన్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

*నకిలీ పత్రాల సృష్టి – కోట్లలో రుణాలు
హైదరాబాద్‌కు చెందిన రియాల్టర్ వల్లభనేని శ్రీనివాసరావు నేతృత్వంలో ఓ ముఠా తేలికగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా భారీ మోసానికి తెరతీసింది. బోడుప్పల్‌కు చెందిన బుర్ర మహేష్‌యాదవ్ పేరిట ఎలాంటి స్థిరాస్తులు లేనప్పటికీ, నాగారం సర్వే నంబర్లు 400, 401లలో ఆయనకు మరియు ఆయన భార్యకు విలువైన ఆస్తులు ఉన్నట్లు అత్యంత చాకచక్యంగా నకిలీ పత్రాలను సృష్టించారు.
ఈ నకిలీ దస్తావేజులకు చట్టబద్ధత కల్పించే బాధ్యతను అప్పట్లో కీసర సబ్-రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న యూసుఫ్ ఉర్ రెహ్మాన్ తన భుజాన వేసుకున్నారు. ఎలాంటి క్షేత్రస్థాయి పరిశీలనలు చేయకుండా, అసలు ఆస్తుల జాడే లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ నకిలీ కాగితాల ఆధారంగా వివిధ బ్యాంకులను ఆశ్రయించి ఏకంగా రూ.4.11 కోట్ల భారీ రుణాలు కాజేశారు. కొద్ది నెలలపాటు నామమాత్రంగా వాయిదాలు చెల్లించి, ఆ తర్వాత ఎగ్గొట్టడంతో బ్యాంకర్లకు అనుమానం వచ్చి లోతుగా పరిశీలించగా ఈ అక్రమాల బాగోతం వెలుగు చూసింది.

*వేల కోట్ల అక్రమాలు – శాస్త్రీయ ఆధారాల లభ్యం
బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ (సాంకేతిక ఆధారాలు), కాల్ డేటా రికార్డులు (సీడీఆర్), మరియు ఫోరెన్సిక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో దిగ్భ్రాంతికరమైన నిజాలు బయటపడ్డాయి. 2015 నుంచి 2018 మధ్య కీసరలో పనిచేసిన కాలంలో యూసుఫ్ ఉర్ రెహ్మాన్ వందల సంఖ్యలో అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు శాస్త్రీయ ఆధారాలు లభించాయి. ఇప్పటికే ఆయనపై ఐదు వేర్వేరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

*బాలాపూర్, నాదర్‌గుల్ ప్రాంతాలలో విలయం
కేవలం కీసరకే పరిమితం కాకుండా, ప్రస్తుత చంపాపేట సబ్-రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న రెహ్మాన్.. బాలాపూర్, నాదర్‌గుల్, మీర్‌పేట్, బడంగ్‌పేట్, జలపల్లి తదితర ప్రాంతాలలోనూ తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు విచారణలో తేలింది. ముడుపులు ముట్టజెబితే చాలు, నిషేధిత జాబితా (ప్రోహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్) లోని భూములకు సైతం కంటికి రెప్పపాటులో మోక్షం కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేయడం ఈయన నైజంగా మారింది. నాలా కన్వర్షన్ (వ్యవసాయ భూమిని వాణిజ్య/నివాస భూమిగా మార్పిడి) లేని స్థలాలను సైతం అక్రమ పద్ధతిలో రిజిస్టర్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను అవినీతి కూపంగా మార్చేశారు.
ప్రశ్నార్థకంగా మారిన ఉన్నత అధికారుల మౌనం
ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ, అమాయక ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి కేటుగాళ్లపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలోని ఉన్నత స్థాయి అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. శాఖలో కూరుకుపోయిన వేళ్లూనుకున్న అవినీతిని ప్రక్షాళన చేయాల్సిన పెద్దలే చోద్యం చూస్తుండటం పట్ల స్థానికులు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనాన్ని దోచుకుంటున్న ఇలాంటి మోసగాళ్లపై, వారికి కొమ్ముకాస్తున్న అవినీతి అధికారులపై ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని, దోషుల ఆస్తులను జప్తు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments