ఎల్బీనగర్:
గణేష్ నిమజ్జనోత్సవానికి అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. నిమజ్జన ప్రాంతంలో భారీ విగ్రహాలను నీటిలోకి దించేందుకు క్రేన్లు, ఎక్స్కవేటర్లను ఏర్పాటు చేసి పనులు చేపడుతున్నారు. చెరువు పరిసరాలను చదును చేయడంతో పాటు అవసరమైన మట్టి, రాళ్లను తరలిస్తూ నిమజ్జనానికి అనువుగా తీర్చిదిద్దుతున్నారు.అయితే నిమజ్జనం జరగనున్న చెరువు పరిసరాల్లో పరిస్థితి మరోలా కనిపిస్తోంది. చెరువు ఒడ్డున పూలు, ఆకులు, పూజా సామగ్రి, ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిళ్లు తదితర వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయి. కొన్ని చోట్ల ఈ వ్యర్థాలు నీటిలోకి చేరడంతో చెరువు కలుషితమవుతోంది.నిమజ్జనానికి ముందే చెరువు పరిసరాలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయడంతో పాటు నిమజ్జనం సందర్భంగా వెలువడే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. నిమజ్జన ఏర్పాట్లపై అధికారులు చూపుతున్న శ్రద్ధ.. చెరువు పరిశుభ్రతపైనా కనిపించాలని స్థానికులు కోరుతున్నారు.నిమజ్జనం పూర్తయ్యాక చెరువులో పేరుకుపోయే పూజా సామగ్రి, ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను వెంటనే తొలగించి నీటి కాలుష్యాన్ని నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
జీహెచ్ఎంసి డిప్యూటీ కమీషనర్ బోనగిరి శ్రీనివాస్ వివరణ
సరూర్ నగర్ చెరువు కట్టపై వంతెన నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లకు తగిన సమయం లేకున్నా, ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో త్వరితగతిన చెరువు కట్టపై గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, రాజకీయ అధికార ప్రతినిధులు, ప్రజలు నిమజ్జన ఏర్పాట్లపై సహకరించాలని కోరారు. శానిటేషన్ సిబ్బంది, ఎంటమాలజీ సిబ్బంది గత వారం నుండి రాత్రనకా, పగలనకా నిమజ్జన ఏర్పాట్లపై కష్ట పడుతున్నారని, నేటి సాయంత్రం వరకల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ప్రజలకు చెరువు కట్టపై గణేష్ నిమజ్జన కార్యక్రమానికి, క్రేన్లు, విద్యుత్, శానిటేషన్, పోలీస్ బందోబస్తీ అందుబాటులో ఉంచుతామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు.ఈ సందర్భంగా శానిటేషన్ డిఈ చందన, ఎంటమాలజీ ఏఈ రాంబాబు జిహెచ్ఎంసి సిబ్బంది పాల్గొన్నారు.



