- హైదరాబాద్‌లో వైభవంగా సాంస్కృతిక వేడుకలు
- యుసఫ్‌గూడ వేదికగా ఘనంగా ప్రారంభం.. తరలిరానున్న ప్రముఖులు, విద్యార్థులు..
హైదరాబాద్:
మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గణేశోత్సవాన్ని “రాజ్య మహోత్సవం”గా ప్రకటించిన నేపథ్యంలో, ఆ రాష్ట్ర ఘనమైన సాంస్కృతిక, సంప్రదాయ వేడుకలకు సాంస్కృతిక క్యాలెండర్‌లో ప్రత్యేక స్థానం లభించింది. ఈ చారిత్రాత్మక వేడుకలను భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించాలనే లక్ష్యంతో మహారాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ‘మహారాష్ట్ర గణేష్ మహోత్సవం’ నిర్వహణకు రంగం సిద్ధమైంది.
*యుసఫ్‌గూడలో నేడు అట్టహాసంగా ప్రారంభం
హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (నిస్మిడ్) ప్రాంగణంలో బుధవారం (సెప్టెంబర్ 24వ తేదీ) ఉదయం 10:00 గంటలకు ఈ మహోత్సవం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ వేడుకల్లో భాగంగా వివిధ మరాఠీ సాంస్కృతిక, సాంప్రదాయ నృత్యాలు, జానపద కళారూపాలతో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రతినిధులు, తెలంగాణలోని మరాఠా అసోసియేషన్ ప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్దఎత్తున హాజరుకానున్నారు. మహారాష్ట్ర కీర్తి ప్రతిష్టలను, సంస్కృతిని, గొప్ప వారసత్వాన్ని భావితరాలకు చాటిచెప్పే ఈ మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
*తెలుగు-మహారాష్ట్ర బంధానికి ప్రతీక:
మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి అడ్వకేట్ ఆశిష్ షెలార్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి నిఖిల్ సాయి కోనేటి మాట్లాడుతూ.. మహారాష్ట్ర తెలుగు నాయకులు అశోక్ కంటె నిరంతర కృషి, చొరవ మరియు సమన్వయం ద్వారానే ఈ రాజ్య మహోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించే సువర్ణావకాశం లభించిందని, ఇది ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.
*సమన్వయకర్తగా డాక్టర్ సి.హెచ్. భద్ర:
ఈ చారిత్రాత్మక సాంస్కృతిక వేడుకను విజయవంతం చేయడంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రపంచ పర్యావరణ సంస్థ (డబ్ల్యూఈఓ) అధ్యక్షులు డాక్టర్ సి.హెచ్. భద్ర నాయకత్వాన్ని జాతీయ కార్యవర్గం ప్రత్యేకంగా అభినందించింది. ఆయన సమన్వయకర్తగా వ్యవహరించడం పట్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ వేడుకలను విజయవంతం చేయడానికి ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ సీనియర్ ఉపాధ్యక్షులు నడిగోట్టి సంతోష్ కుమార్ నగర ప్రజలకు, సాంస్కృతిక ప్రేమికులకు ఘనంగా ఆహ్వానం పలికారు.
మహారాష్ట్ర సంస్కృతి, తెలుగు-మహారాష్ట్ర ఐక్యతను చాటే ఈ మహోత్సవాన్ని చిరస్మరణీయంగా నిలపాలని నిర్వాహకులు కోరారు.


