భూ బాధితులకు ప్రజా ప్రభుత్వ విముక్తి!
- అధికార మదంతో అణగదొక్కిన గత పాలకుల నిర్లక్ష్యానికి చరమగీతం..!
- శాసనసభ సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
- 22-ఎ ఉచ్చు నుంచి వేలాది కుటుంబాలకు తక్షణ విముక్తి
- మూడు కీలక నిర్ణయాల తర్వాత తాజాగా యుఎల్సి దరఖాస్తుల పరిష్కారానికి స్పష్టమైన ఉత్తర్వులు
- ప్రజా సంక్షేమమే ధ్యేయంగా దూసుకుపోతున్న రెవెన్యూ శాఖ
హైదరాబాద్
దశాబ్దాలుగా ప్రజల నెత్తిన కత్తిలా వేలాడుతున్న భూ సమస్యల పీడను విదిలించే దిశగా ప్రజా ప్రభుత్వం మరో చారిత్రక అడుగు వేసింది. ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోక, నిరుపేద, మధ్యతరగతి ప్రజలను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిన అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యుఎల్సి) దరఖాస్తులకు మోక్షం కల్పిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజల భూ హక్కులను కాలరాస్తూ, లావాదేవీలకు అడ్డుతగులుతున్న ఆంక్షలను ఒక్కొక్కటిగా బద్దలు కొడుతూ రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో విప్లవాత్మక చర్యలు ఊపందుకున్నాయి.
కాలయాపనకు చరమగీతం: గత పాలకుల మోసపూరిత వైఖరి
గత పాలకులు ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా 2016లోనే యుఎల్సి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి జీవోలు జారీ చేసినప్పటికీ, వాటిని అమలు చేసే చిత్తశుద్ధి చూపలేదు. కేవలం కాగితాలకే పరిమితం చేసిన ఆ జీవోల వల్ల వేలాది దరఖాస్తులు ఏళ్ల తరబడి మూలనపడ్డాయి. ఫలితంగా ఇళ్లు నిర్మించుకున్న ప్రజలు తమ సొంత భూములపై హక్కులు కోల్పోయి, అక్రమదారుల బెదిరింపులకు బలవుతూ నానా తంటాలు పడ్డారు. గత పాలకుల ఆరాచక, నిర్లక్ష్య వైఖరి కారణంగా లక్షలాది కుటుంబాలు దశాబ్దాలుగా నరకం అనుభవించాల్సి వచ్చింది.
*ముఖ్యమంత్రి సంకల్పం – కార్యరూపం దాల్చిన హామీలు:
ప్రజల కష్టాలను కళ్లారా చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీ వేదికగా ఇచ్చిన ప్రతి మాటనూ అక్షరాలా అమలు చేసి చూపుతున్నారు. ఈ నెల 16న శాసనసభలో ఆయన ప్రకటించిన విధంగా, సెక్షన్ 22-ఎతో ముడిపడి ఉన్న సంక్లిష్ట సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరిస్తామన్న హామీకి ఇప్పుడే కార్యాచరణ రూపు వచ్చింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు, జీవో 118, జీవో 76లకు అనుగుణంగా మెమోల జారీ వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మున్సిపల్, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఎ, డిటిసిపి అనుమతులు ఉన్నప్పటికీ 22-ఎ చిక్కుల్లో మగ్గుతున్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకుంది.
*తాజా యుఎల్సి ఉత్తర్వుల విశేషాలు:
తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, తెలంగాణ పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం (యుఎల్సి) కింద పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీల దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిశీలించి అర్హత ఉన్న కేసులను తక్షణమే క్లియర్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గడచిన కాలంలో జారీ చేసిన జీవో నంబర్లు 455, 456, 747, 92ల కింద అప్పట్లో దాఖలైన పెండింగ్ దరఖాస్తులను దుమ్ముదులిపి పరిష్కరించేలా ఆదివారం నాడు అధికారికంగా మెమో.నెం.48062/యుఎల్సి/ఎ1/2026-1ని జారీ చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరిగేలా తక్షణమే క్షేత్రస్థాయి ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ అయ్యాయి.
*ప్రజా ప్రభుత్వ ధ్యేయం – శాశ్వత విముక్తి
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల సంక్షేమమే పరమావధిగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దశాబ్దాల తరబడి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న ప్రతి ఒక్క భూ సమస్యను వేర్లతో పెకళించి, చట్టబద్ధమైన శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తేల్చిచెప్పారు. ప్రజలను ముంచేసే ఏ ఒక్క సమస్యనూ వదిలిపెట్టబోమని, అన్ని చిక్కుముడులను తొలగించి బాధితులకు పూర్తి హక్కులు కట్టబెట్టే వరకు విశ్రమించేది లేదని ఈ నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి.


