Tuesday, September 29, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్ప్ర‌హ‌రీల‌తో దారులు మూసేస్తున్నారుదారి చూపాలంటూ హైడ్రాను కోరిన నివాసితులు

ప్ర‌హ‌రీల‌తో దారులు మూసేస్తున్నారుదారి చూపాలంటూ హైడ్రాను కోరిన నివాసితులు

హైడ్రా ప్ర‌జావాణికి 42 ఫిర్యాదులు

హైద‌రాబాద్‌

న‌గ‌ర శివార్ల‌లో ముందుగా వెలసిన కాల‌నీల‌కు ర‌క్ష‌ణ కోసం నిర్మించుకున్న ప్ర‌హ‌రీలు ఇప్పుడు ప‌క్క‌న కొత్త‌గా వ‌చ్చిన కాల‌నీల‌కు, నివాస ప్రాంతాల‌కు దారి లేకుండా చేస్తున్నాయ‌ని సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణిలో ప‌లువురు ఫిర్యాదు చేశారు. గ‌తంలో చుట్టుప‌క్క‌ల కాల‌నీలు, నివాస ప్రాంతాలు లేన‌ప్పుడు ప్ర‌హ‌రీ ఉన్నా అభ్యంత‌రాలు ఉండేవి కాద‌ని.. ఇప్పుడు త‌మ‌కు దారి ఇవ్వ‌క పోతే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు. దారులు మూయ‌కూడ‌ద‌ని నిబంధ‌న‌లు స్ప‌ష్టంగా ఉన్నా.. ప్ర‌హ‌రీల‌ను తొల‌గించ‌డానికి అక్క‌డి నివాసితులు ఇష్ట‌ప‌డ‌డంలేద‌ని.. ఇప్పుడ‌వే ఇబ్బందిగా ప‌రిణ‌మిస్తున్నాయ‌ని చుట్టుప‌క్క‌ల ఉన్న కాల‌నీల వారు వాపోతున్నారు. రంగారెడ్డి జిల్లా హ‌య‌త్‌న‌గ‌ర్ మండ‌లం కుంట్లూరు విలేజ్‌లోని ప్ర‌జ‌య్ గుల్‌మొహ‌ర్ కాల‌నీ వారు ప్ర‌హ‌రీలు తొల‌గించ‌క‌పోవ‌డంతో ప‌క్క‌నే ఉన్న త‌మ ప్లాట్ల‌కు వెళ్ల‌లేక‌పోతున్నామ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా, రామ‌చంద్రాపురం మండ‌లం.. 85.20 ఎక‌రాల‌లో 596 ప్లాట్ల‌తో లే ఔట్ వేశారు. ఇందులో 11 ఎక‌రాల మేర ఉన్న లే ఔట్‌లో ర‌హ‌దారులు, పార్కులు క‌బ్జా చేసి.. త‌మ‌కు దారి లేకుండా చేస్తున్నార‌ని తెల్లాపూర్ జి. బ్లాక్ ప్లాట్ ఓన‌ర్ల సంఘం ప్ర‌తినిధులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేసి.. త‌మ‌కు దారి చూపించాల‌ని కోరారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం శ్రీ‌రాంన‌గ‌ర్ కాల‌నీలో విల్లాలు నిర్మించిన వారు త‌మ ప్లాట్‌కు దారి లేకుండా ర‌హ‌దారిని క‌బ్జా చేసేశార‌ని అక్క‌డి స్థానికుడు ఫిర్యాదు చేశారు. మేడ్చ‌ల్ లోని ఏజీఎస్ లే ఔట్‌లోకి కెమిక‌ల్ వాట‌ర్ వ‌చ్చేస్తోంది.. సాఫీగా సాగే నాలాలో ఆటంకాలు సృష్టించ‌డంతో త‌మ ప‌రిస‌రాల‌ను పారిశ్రామిక వ్య‌ర్థ జ‌లాలు వ‌చ్చి ముంచెత్తుతున్నాయ‌ని హైడ్రా ప్ర‌జావాణిలో వాపోయారు. ఇలా సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 42 ఫిర్యాదులందాయి. వీటిని హైడ్రా అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ డి. ఆనంద్‌కుమార్ గారు ప‌రిశీలించి.. ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments