- జీహెచ్ఎంసిలో నకిలీ ఉద్యోగి కలకలం!
- డిజిటల్ దగా: నిబంధనలకు పాతర వేస్తూ ఆన్లైన్లో అక్రమ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల (OC) చలామణి.
- టీడీఆర్ బాండ్ల మాఫియా: నకిలీ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.
- ఫైళ్ల అక్రమ నిలుపుదల: సాఫ్ట్వేర్ లొసుగులను ఆసరాగా చేసుకుని, లంచాల కోసం దరఖాస్తుదారులను తిప్పుతున్న వైనం.
- నకిలీ బిల్డింగ్ ఆక్యూ పెన్సీ సర్టిఫికెట్లతో, కోట్లు కొల్లగొడుతున్న , విద్యుత్, వాటర్ వర్క్స్, బ్యాంకు ,టౌన్ ప్లానింగ్ అధికారులు,
- అజాంపురా సబ్-కార్యాలయంలో బట్టబయలు: నకిలీ ఐడీలు, ఫోర్జరీ స్టాంపులతో కోట్లను కొల్లగొడుతున్న ఘరానా మోసగాడి బాగోతం!

టౌన్ ప్లానింగ్ వ్యవస్థలో ‘బిల్డ్ నౌ’ వెబ్సైట్ పోర్టల్ పారదర్శకత లోపంతో అస్తవ్యస్తంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా దొంగ టి.డి.ఆర్ లు, నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (OC) యథేచ్ఛగా చలామణి అవుతున్నాయి.
ఈ అక్రమ దందాల వెనుక టౌన్ ప్లానింగ్, విద్యుత్, వాటర్ వర్క్స్ మరియు బ్యాంక్ అధికారుల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ఎలాంటి అనుమతులు లేకపోయినా, అక్రమ కట్టడాలకు నకిలీ OCల ఆధారంగా కోట్లు కొల్లగొడుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు.
శాస్త్రీయ ఆధారాలతో, జియో-ట్యాగింగ్ లొకేషన్లు మరియు ఆన్లైన్ రికార్డులను సరిపోలిస్తే ఈ బాగోతం బట్టబయలవుతుంది. ఈ కుంభకోణంపై ఉన్నత స్థాయి సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
(సాంకేతిక పారదర్శకతకు తూట్లు, ట్రేడింగ్ మాఫియా ప్రమేయం, ఫైళ్ల ట్యాంపరింగ్, నకిలీ సర్టిఫికెట్ల దందాపై పరిశోధనాత్మక పాత్రికేయులు ఎం.వేణుగోపాల్ పరిశోధనాత్మక ప్రత్యేక కథనం)
హైదరాబాద్
నగరాభివృద్ధి మరియు పట్టణాభివృద్ధి శాఖల పరిధిలో భవన నిర్మాణ అనుమతులను పూర్తిగా సరళీకరించి, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘BuildNow’ (బిల్డ్ నౌ) ఆన్లైన్ వెబ్సైట్ మరియు పోర్టల్ లక్ష్యం పూర్తిగా నీరుగారిపోతోంది. సాంకేతిక సౌలభ్యం ముసుగులో ప్రారంభమైన ఈ విధానం, ప్రస్తుతం కొందరు అవినీతి అధికారులు, దళారులు, మాఫియా చేతుల్లో కీలుబొమ్మగా మారుతోంది. ముఖ్యంగా భవనాల పూర్తి తర్వాత జారీ చేసే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (OC), ప్లాన్ల ఆమోదంలో అత్యంత కీలకమైన టీడీఆర్ (TDR) సర్టిఫికెట్ల విషయంలో సాగుతున్న అక్రమాలు అంతులేకుండా పోతున్నాయి. మరోవైపు, ఇదే అదునుగా భావించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో సాగుతున్న నకిలీల దందా ప్రభుత్వ మూలాలను కుదిపేస్తోంది.

1.అక్రమ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల (OC) చలామణి
నిబంధనల ప్రకారం భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత, ఆమోదిత ప్లాన్ ప్రకారం సెట్బ్యాక్లు, పార్కింగ్ స్థలాలు, అదనపు అంతస్తుల ఉల్లంఘనలు లేకుండా నిర్మించబడిందా లేదా అని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే ‘ఆక్యుపెన్సీ సర్టిఫికెట్’ జారీ చేయాలి. అయితే, ‘బిల్డ్ నౌ’ పోర్టల్‌లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలకు సైతం ఔట్సోర్సింగ్ సిబ్బంది కుమ్మక్కై అనధికారికంగా ‘ఓసీ’లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. సెల్లార్లు, అదనపు అంతస్తుల ఉల్లంఘనలకూ లంచాలు దండుకుని ఆన్లైన్లో ఆమోద ముద్ర వేయించుకుంటున్న వైనం విస్మయానికి గురిచేస్తోంది.
- అక్రమ టీడీఆర్ (TDR) సర్టిఫికెట్ల దందా
రోడ్ల విస్తరణలో భూములు కోల్పోయిన వారికి జారీ చేసే టీడీఆర్ సర్టిఫికెట్లు ప్రస్తుతం పెద్ద కుంభకోణానికి కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ‘బిల్డ్ నౌ’ పోర్టళ్లలో ఈ టీడీఆర్ బాండ్ల చలామణిపై కఠినమైన డిజిటల్ ట్రాకింగ్ లేకపోవడంతో, నకిలీ టీడీఆర్ సర్టిఫికెట్లను సృష్టించి వాణిజ్య భవనాల నిర్మాణ అనుమతులకు అక్రమంగా వాడుకుంటున్నారు. అధికారుల అండదండలతో ఒకే టీడీఆర్ బాండ్‌ను పలుమార్లు వేర్వేరు దరఖాస్తులకు ఉపయోగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. - ఫైళ్ల ట్యాంపరింగ్ మరియు అనధికారిక చలామణి:
నిర్ణీత గడువులోగా దరఖాస్తులను పరిశీలించాలన్న నిబంధనలను గాలికొదిలేశారు. ‘బిల్డ్ నౌ’ పోర్టల్‌లో ఎలాంటి స్పష్టమైన కారణాలు చూపకుండానే ఫైళ్లను రోజుల తరబడి ‘పెండింగ్’ లేదా ‘క్వరీ’ దశలో నిలిపివేస్తున్నారు. దరఖాస్తుదారు నేరుగా దరఖాస్తు చేస్తే చిన్నపాటి సాంకేతిక లోపాలు చూపుతూ తిరస్కరించే యంత్రాంగం, అనధికారిక మధ్యవర్తులు లేదా లైసెన్డ్ సర్వేయర్ల ద్వారా వస్తే మాత్రం నిమిషాల వ్యవధిలో క్లియర్ చేస్తుండటం సిబ్బంది లాలూచీకి నిదర్శనం. పోర్టల్‌లో రిజెక్ట్ అయిన లేదా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై పౌరులు సమాచారం కోరినా ‘లాగ్ రికార్డులు’ పూర్తి పారదర్శకంగా కనిపించకపోవడం అధికారుల అక్రమాలకు పెద్ద పీట వేస్తోంది.

జీహెచ్ఎంసిలో నకిలీ ఉద్యోగి కలకలం.. కోట్లు కొల్లగొడుతున్న ఘరానా మోసగాడు!
అజాంపురా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దొరికిపోయిన వైనం.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రతిష్టను మంటగలుపుతూ, ప్రభుత్వ నిధులకు కోట్లకు కోట్లు గండికొడుతున్న ఒక నకిలీ ఉద్యోగి బాగోతం బట్టబయలైంది. టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన అసలు ఉద్యోగి ఐడీ కార్డును, నకిలీ స్టాంపులను ఉపయోగించి.. దర్జాగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (OC), మార్టిగేజ్ విడుదల పత్రాలు జారీ చేస్తున్న చీదేళ్ల శివనాగేశ్వర రావు అనే మోసగాడి బండారం రట్టయింది.
సబ్ రిజిస్ట్రార్ అప్రమత్తతతో ఈ భారీ మోసం వెలుగులోకి రాగా, నిందితుడిపై మలక్‌పేట్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఎఫ్ఐఆర్ నంబర్ 369/2026 నమోదైంది.
*ఘటన వివరాలు:
అక్టోబర్ 1, 2026న మధ్యాహ్నం 1:00 నుండి సాయంత్రం 6:30 గంటల మధ్య అజాంపురా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ నాటకీయ ఘటన చోటుచేసుకుంది. మూసారాంబగ్ సర్కిల్ పరిధిలోని ఒక ఆస్తికి సంబంధించిన మోర్గాజ్ (తనఖా) విడుదలకు కొందరు పత్రాలు సమర్పించారు. సమర్పించిన పత్రాలపై అనుమానం వచ్చిన సబ్ రిజిస్ట్రార్ వెంటనే జీహెచ్ఎంసి అధికారులకు సమాచారం అందించారు.
జీహెచ్ఎంసి జంగంపేట్ సర్కిల్లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న పి. జోసెఫ్ ప్రేమ్ కుమార్ (ఉద్యోగ ఐడీ నంబర్: 17618) అక్కడికి చేరుకుని పరిశీలించగా అసలు నిజం బయటపడింది. ఆ పత్రాలు సమర్పించిన వ్యక్తి అసలు జీహెచ్ఎంసి ఉద్యోగే కాదని, తన పేరుతో ఉన్న ఐడీ కార్డును మార్ఫింగ్ చేసి నకిలీ ఉద్యోగిగా చలామణి అవుతున్న చీదేళ్ల శివనాగేశ్వర రావుగా గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సబ్ రిజిస్ట్రార్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా, ప్రధాన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
నకిలీ డాక్యుమెంట్లు.. భారీ స్థాయిలో మోసాలు:
- నకిలీ ఐడీల వాడకం: జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్నట్లు నమ్మించేందుకు జీహెచ్ఎంసి చార్మినార్ జోన్ సిటీ ప్లానర్ శ్రీ డి. గగనంద్ పేరు మీద ఉన్న ఫోర్జరీ (నకిలీ) అధికారిక లేఖలను, నకిలీ స్టాంపులను ఈ నిందితుడు విరివిగా ఉపయోగించాడు.
- గత మోసాలు వెలుగులోకి: ఇదే నిందితుడు గతంలో కూడా సలీంనగర్ కాలనీ కాలనీ నెం. 3 లోని హెచ్.నెం. 16-11-20/5/3/1 ఆస్తికి సంబంధించిన మోర్గాజ్ విడుదలలో నకిలీ పత్రాలను (డాక్యుమెంట్ నెం. 7947/2025, తేది: 03.11.2025) సృష్టించి ప్రభుత్వానికి భారీ మోసానికి పాల్పడినట్లు తేలింది.
- పోలీసుల కేసు నమోదు: బాధితుడు పి. జోసెఫ్ ప్రేమ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మలక్‌పేట్ ఇన్స్పెక్టర్ కె. వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో, ఎస్.ఐ.పి. తేజానాయక్ నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలోని సెక్షన్లు 318(4), 336(3), 338, 340(2) r/w 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
అధికారుల పాత్రపై తీవ్ర అనుమానాలు:
పరిపాలనను పారదర్శకంగా మారుస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఒక సాధారణ వ్యక్తి అసలు ఉద్యోగి కాకపోయినా, ప్రభుత్వ కార్యాలయాల ముద్రలు, ఉన్నతాధికారుల పేరిట నకిలీ లేఖలు సృష్టిస్తూ రిజిస్ట్రార్ కార్యాలయాల వరకు దర్జాగా వెళ్లి పనులు చేయించుకుంటున్నాడంటే.. దీని వెనుక కొందరి అధికారుల లాలూచీ, ముడుపుల మత్తు స్పష్టంగా కనిపిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అక్రమ సంపాదనలో ఎవరి వాటా ఎంత ఉందనే దానిపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తాయి. ప్రభుత్వ ఖజానాకు కోట్లకు గండి కొడుతున్న ఈ ఘరానా మోసంపై ఉక్కుపాదం మోపి, బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



