- గ్రేటర్ లో నీరుగారుతున్న ప్రజావాణి .
- అధికారుల ఏసీ గదుల సమీక్షలకే పరిమితం… క్షేత్రస్థాయిలో గాలికి వదిలేసిన యంత్రాంగం.
- జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లలో పూజకు నోచుకోని ఫిర్యాదులు.
- గల్లీ లీడర్లతో కుమ్మక్కై అక్రమ దందాలకు పాల్పడుతున్న క్రింది స్థాయి సిబ్బంది.
- జిహెచ్ఎంసి ప్రజావాణి కార్యక్రమం విఫలం – బల్దియా బాస్ కర్ణన్ నిర్లక్ష్యమే కారణం..?
- మున్సిపల్ కార్పొరేషన్లలో పడకేసిన ప్రజావాణి…
- మున్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, మున్సిపల్ శాఖ మంత్రి సీ.ఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి…
గ్రేటర్లో ప్రజావాణి అంటే సమస్యల పరిష్కార వేదిక అనుకుంటే పొరపాటే! ఇది కేవలం అధికారుల ఏసీ రూమ్ కబుర్లకు, ప్రచార ఆర్భాటాలకు వేదికగా మారింది. బాధితులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
ప్రజావాణికి జనం సున్నా చుట్టారంటే ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం ఏ స్థాయిలో సన్నగిల్లిందో అర్థం చేసుకోవచ్చు. కాగితాల మీద హామీలు, ఏసీ గదుల్లో సమీక్షలు తప్ప క్షేత్రస్థాయిలో ఒరిగిందేమీ లేదు. ఇకనైనా అధికారులు మొద్దునిద్ర వీడి క్షేత్రంలోకి వస్తారా, లేక ప్రజల తిరస్కారంతో ఈ కుర్చీలే గాలికి పోవాలా?
హైదరాబాద్
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ప్రజావాణి’ కార్యక్రమంపై ప్రజల్లో తీవ్ర నిరాసక్తత వ్యక్తమవుతోంది. బాధితులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి, ఫిర్యాదులు సమర్పించినా అవి బుట్టదాఖలు అవుతుండటంతో, అధికారుల ముందు గోడు వెళ్లబోసుకోవడం దండగ అనే అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు.
పరిపాలనలో లోపించిన జవాబుదారితనం, పారదర్శకత కొరవడటం, విధుల్లో తీవ్రమైన నిర్లక్ష్యం, అడుగడుగునా వేళ్లూనుకున్న అవినీతి, విపరీతంగా పెరిగిపోయిన రెడ్టేపిజం వంటి కారణాలతో ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌తో పాటు చార్మినార్ జోన్ మరియు ఇతర జోనల్ కార్యాలయాలలో నిర్వహిస్తున్న ప్రజావాణికి అధికారుల హాజరు పూర్తిస్థాయిలో ఉంటున్నా, ఫిర్యాదుదారులు మాత్రం నిల్ సంఖ్యలో ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. జోనల్ కమిషనర్లకు ఒక్క ఫిర్యాదు కూడా అందడం లేదంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

క్షేత్రస్థాయిలో తాండవిస్తున్న మౌలిక సమస్యలు:
నగరంలో పేరుకుపోతున్న చెత్తాచెదారం, గుంతలమయంగా మారుతున్న రోడ్లు, తూతూమంత్రంగా మారుతున్న ఇంటింటి చెత్త సేకరణ, ఫుట్పాట్ల అక్రమణలు, వెలగని వీధి దీపాలు, ఎక్కడా కనిపించని రోడ్ల ఊడ్పు (స్వీపింగ్) ప్రక్రియ, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు లేని చిత్తశుద్ధి… ఇలా అన్ని వైపుల నుంచీ ప్రజలను సమస్యలు చుట్టుముడుతున్నాయి.
ఈ క్రమంలో క్యూర్ పరిధిలోని మున్సిపల్ కమిషనర్లు కేవలం ఏసీ గదుల్లో జరిగే సమీక్షలు, సమావేశాలకే పరిమితం కావడం వల్ల క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన సిబ్బందిపై పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఫలితంగా అధికారుల్లో జవాబుదారితనం పూర్తిగా మాయమైంది.
అవినీతి అక్రమాల మయం… నాయకుల కనుసన్నల్లో యంత్రాంగం:
ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిశీలనపై లోతుగా పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. అధికారులు స్థానిక గల్లీ నాయకులతో కుమ్మక్కై అక్రమ దందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బలపడుతున్నాయి. ‘ప్రజావాణికి వెళ్తే న్యాయం జరగదు… అదే స్థానిక నాయకుడిని ఆశ్రయిస్తేనే సమస్య పరిష్కారమవుతుంది’ అనే దుస్థితి ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.
కేవలం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మాత్రమే కాకుండా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ ఫిర్యాదుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడం గమనార్హం. ప్రజా సమస్యలపై వచ్చే ఫిర్యాదులను కొందరు అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుని (క్యాష్ చేసుకుని) కేవలం నామమాత్రపు చర్యలకే పరిమితమవుతున్నారు. నగరంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన కమిషనర్లు తమ బాధ్యతలను విస్మరించడంతో ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత ప్రశ్నార్థకంగా మారుతోంది.
ప్రజల ఆశలతో ప్రారంభమైన ఈ వేదికలు నేడు కేవలం అధికారుల ప్రచార ఆర్భాటాలకే పరిమితం కావడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలుగుతుంది.



