- ప్రేమ, కరుణ, నిస్వార్థ సేవతో కోట్లాది మందికి అమ్మ ఆత్మీయత,ఓదార్పు
- రాజకీయ బాధ్యతలతోపాటు సమాజ సేవకూ ప్రాధాన్యమివ్వాలి
- అమృత విద్యాలయం రజతోత్సవ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా సందేశం
హైదరాబాద్
ప్రేమ, కరుణ, నిస్వార్థ సేవలకు ప్రతిరూపంగా నిలిచిన మాతా అమృతానందమయి (అమ్మ) జీవితం యావత్ సమాజానికి ఆదర్శమని తెలంగాణ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా అన్నారు.
మానవత్వానికి సేవ చేయడాన్ని మించిన గొప్ప కార్యం మరొకటి లేదని పేర్కొన్నారు.
సికింద్రాబాద్లోని ఈస్ట్ మారేడుపల్లిలో మంగళవారం మాతా అమృతానందమయి ఆధ్వర్యంలో మాతా అమృతానందమయి మఠం, అమృత విద్యాలయం రజతోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా మఠం విద్య, వైద్యం, సేవా రంగాల్లో అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.
కేంద్ర ప్రభుత్వ నమామి గంగే, స్వచ్ఛభారత్ కార్యక్రమాల కోసం మాత అమృతానందమయి మఠం 100 కోట్లు విరాళంగా అందించిన విషయాన్ని గవర్నర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గత ఐదు దశాబ్దాల్లో దాదాపు నాలుగు కోట్ల మందిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ప్రేమాభిమానాలు పంచిన అమ్మ, ‘వసుధైక కుటుంబకం’ స్ఫూర్తితో ప్రపంచానికి శాంతి, ఐక్యత సందేశాన్ని అందిస్తున్నారని కొనియాడారు.
పేదలకు నాణ్యమైన వైద్యం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, గ్రామాల దత్తత, నిరుపేదలకు పింఛన్లు, వస్త్రాల పంపిణీ వంటి కార్యక్రమాలు మఠం మానవతా దృక్పథానికి నిదర్శనమన్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలతోపాటు సమాజ సేవకులుగా కూడా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించేవారని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవరచుకోవాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు విద్యతోపాటు క్రమశిక్షణ, కరుణ, సామాజిక బాధ్యత, దేశసేవా భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. రజతోత్సవం జరుపుకుంటున్న మఠం, విద్యాలయం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మకు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని, ఆమె సేవా సందేశం భావితరాలకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మాతా అమృతానందమయి రాష్ట్రంలో దత్తత తీసుకున్న గ్రామాలకు చెందిన మహిళలకు మఠం ఆధ్వర్యంలో
మాతా అమృతానందమయి, గవర్నర్, కేంద్ర మంత్రి చీరలు, చెక్కులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో గవర్నర్ సతీమణి శ్రీమతి జానకి శుక్లా, కేంద్ర మంత్రి శ్రీకిషన్ రెడ్డి, ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్, MLC శ్రీ ఎం కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.



