Wednesday, November 11, 2026
Google search engine
Homeతెలంగాణజలమండలి మీటర్ రీడర్ల బతుకుచిత్రం: మల్లేష్ మృతితో బట్టబయలైన 675 కుటుంబాల గోస!

జలమండలి మీటర్ రీడర్ల బతుకుచిత్రం: మల్లేష్ మృతితో బట్టబయలైన 675 కుటుంబాల గోస!

జీతం తీసుకుంటే ఒక రూల్.. హక్కులకై గొంతెత్తితే మరో రూల్!

జి.ఓ. 60 లేని కొత్త టెండర్లతో అభద్రత..

జలమండలి గల్లా నింపే మీటర్ రీడర్ల చెమటకు బానిస బతుకులే మిగులుతున్నాయా? నగరానికి దాహం తీర్చే కార్మికుడి ప్రాణం గాల్లో కలిసిపోతే… ‘జీతం తీసుకుంటున్నావుగా, ఇంకేం హక్కులు?’ అంటూ అధికారులు మొండిచెయ్యి చూపుతున్నారు! జి.ఓ. 60 జాడలేని కొత్త టెండర్లతో 675 కుటుంబాల పొట్ట కొడుతూ, సెక్రటేరియట్ ఫైళ్లను అటకెక్కించారు. ఆపద వస్తే ఆదుకోని ఈ దొరసాని పాలనలో, సంతాప నాటకాలు ఆపకపోతే జలమండలి ముట్టడితో సింహాసనం కదలడం ఖాయం!

హైదరాబాద్

నగరానికి మంచినీళ్లు అందించి, గడపగడపకూ తిరిగి బిల్లులు వసూలు చేసి జలమండలి గల్లా నింపుతున్న ఔట్‌సోర్సింగ్ మీటర్ రీడర్ల బతుకులు నేడు ప్రశ్నార్థకమయ్యాయి. ఏళ్ల తరబడి సంస్థ కోసం చెమటోడ్చుతున్న 675 మంది కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైంది. నిత్యం ఉరుకులు పరుగులతో గడుపుతున్న ఈ కార్మికుల బతుకుల్లో, మీటర్ రీడర్ మల్లేష్ అకస్మిక మృతి తీరని విషాదాన్ని నింపింది. అభద్రత, పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులే మల్లేష్ ప్రాణాలు తీశాయని కార్మిక లోకం మండిపడుతోంది. కేవలం సంతాపాలతో సరిపెట్టకుండా, ఆయన కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, 675 మంది కార్మికుల బతుకులకు భరోసా కల్పించాలని తెలంగాణ రాష్ట్ర అవుట్‌సోర్సింగ్ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మందాల బాలకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

ఇచ్చిన జీతం తీసుకుంటే ఒక రూల్.. ప్రశ్నిస్తే మరో రూలా?
సంస్థ ఇచ్చే జీతం తీసుకుంటూ మూడేసుకుని పనిచేస్తే ఒక నిబంధన.. అదే కార్మికుడు తన కష్టానికి తగిన న్యాయం కావాలని, హక్కుల కోసం గొంతెత్తితే మరో రూలా? జలమండలి అధికారుల తీరుపై కార్మికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మీటర్ రీడింగులు, వసూళ్ల టార్గెట్ల పేరుతో కార్మికులపై కఠినంగా వ్యవహరించే అధికారులు.. వారి వేతనాలు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య రక్షణ విషయానికి వచ్చేసరికి మొండిచెయ్యి చూపుతున్నారు. సంస్థకు సేవలు అందిస్తున్న కార్మికుడు బానిస కాదని, తన శ్రమకు తగిన గుర్తింపు కోరుకోవడం ప్రతి కార్మికుడి హక్కని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

జి.ఓ. 60 జాడలేని కొత్త టెండర్లు..

ఇప్పటివరకు జి.ఓ. 60 ప్రకారం వేతనాలు పొందుతున్న మీటర్ రీడర్లకు సంబంధించి, కొత్తగా తెచ్చిన టెండర్లలో ఆ జి.ఓ. ప్రస్తావనే లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పాత నిబంధనలకు తిలోదకాలిచ్చి కొత్త షరతులు తెస్తే ప్రస్తుతం పనిచేస్తున్న 675 మంది కార్మికుల పరిస్థితి ఏమిటి? వారి ఉద్యోగాలకు, వేతనాలకు ఎవరు భరోసా ఇస్తారు? ఏళ్ల తరబడి సంస్థను నమ్ముకున్న కార్మికుల పొట్ట కొట్టేలా టెండర్లు మారుస్తుంటే చూస్తూ ఊరుకోబోమని కార్మికులు హెచ్చరిస్తున్నారు. టెండర్ నిబంధనలను బహిర్గతం చేసి, జి.ఓ. 60 రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

సెక్రటేరియట్ నుంచి వచ్చిన ఫైలు ఎక్కడ..?
మీటర్ రీడర్లకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించే దిశగా ప్రభుత్వ సెక్రటేరియట్ నుంచి వచ్చిన సాంక్షన్ పోస్టుల ఫైలు జలమండలి కార్యాలయానికి చేరినా, అక్కడ దానిపై తుది నిర్ణయం తీసుకోకుండా అడుగు ముందుకు పడటం లేదు. ప్రభుత్వ స్థాయిలో కదిలిన ఫైలు స్థానిక అధికారుల వద్ద ఎందుకు పెండింగ్‌లో ఉంది? 675 కుటుంబాల తలరాతను మార్చే ఈ అంశంపై తక్షణమే స్పందించి, ఫైలు స్థితిగతులు బయటపెట్టాలని కార్మికులు కోరుతున్నారు. మరోవైపు ఐ.ఎఫ్.ఎం.ఐ.ఎస్. (IFMIS) పోర్టల్‌లోనూ తమ పేర్లు నమోదు చేయకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ రికార్డుల్లోనే గుర్తింపు లేకపోతే తమ బతుకులకు రక్షణ ఎవరిస్తారని నిలదీస్తున్నారు.

మల్లేష్ కుటుంబానికి న్యాయం చేయాల్సిందే!
కుటుంబ పోషణ కోసం నిత్యం శ్రమించిన మల్లేష్ అకస్మిక మృతి ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఈ మృతికి దారితీసిన పరిస్థితులపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి. మల్లేష్ కుటుంబానికి తక్షణమే నష్టపరిహారం చెల్లించి, కుటుంబంలోని అర్హులైన ఒకరికి జలమండలిలో ఉద్యోగం కల్పించాలి. పిల్లల చదువులకు, కుటుంబ పోషణకు ప్రత్యేక ఆర్థిక భరోసా ఇవ్వాలి. కార్మికుడు బతికినంత కాలం శ్రమను దోచుకుని, ఆపదొస్తే గాలికి వదిలేసే సంస్కృతి పోవాలని, సంస్థ సామాజిక బాధ్యతగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆరోగ్య భద్రత ఏది? ప్రాణాలకు రక్షణ ఎది?

నిత్యం ఎండనకా వాననకా తిరుగుతూ విధులు నిర్వర్తించే ఔట్‌సోర్సింగ్ కార్మికులు గుండెపోట్లు, బ్రెయిన్ స్ట్రోక్‌లు, రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. అనుకోని ప్రమాదం జరిగి కార్మికుడు మంచాన పడితే ఆ కుటుంబం ఆకలితో అల్లాడాల్సి వస్తోంది. ప్రతి కార్మికుడికి ఆరోగ్య బీమా, ప్రమాద బీమా కల్పించి, కుటుంబానికి వైద్య భద్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది.

సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి: జలమండలిని ముట్టడిస్తాం!

జలమండలి చైర్మన్‌గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కార్మికులు వేడుకుంటున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించి 675 మంది మీటర్ రీడర్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

  • సంతాప ప్రకటనలు కాదు.. మల్లేష్ కుటుంబానికి న్యాయం కావాలి!
  • హామీలు కాదు.. 675 మందికి ఉద్యోగ భద్రత కావాలి!
  • కొత్త టెండర్ల పేరుతో అభద్రత కాదు.. జి.ఓ. 60 ప్రకారం హక్కులకు రక్షణ కావాలి!
  • బెదిరింపులు కాదు..
    కార్మికులకు గౌరవం, న్యాయం కావాలి!

ఈ డిమాండ్లు నెరవేరే వరకు, మల్లేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేసి జలమండలిని స్తంభిస్తామని తెలంగాణ రాష్ట్ర అవుట్‌సోర్సింగ్ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మందాల బాలకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments