మధు యాష్కి x సుధీర్ రెడ్డి ఫైట్..!
- ఎల్బీనగర్ చంపాపేటలో చేయూత పింఛన్ల పంపిణీ సభ రసాభాస
- నిబంధనలు గాలికొదిలేసిన యంత్రాంగం.. వేదికపైనే నేతల తోపులాట.
- అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ వర్గాల నినాదాలతో దద్దరిల్లిన ప్రాంగణం
- పోలీసుల తీరుపై రాష్ట్ర డీజీపీకి సుధీర్‌రెడ్డి ఫిర్యాదు
ఎల్బీనగర్
పేదోళ్లకు ఆసరాగా నిలవాల్సిన చేయూత పింఛన్ల పంపిణీ సభ కాస్తా.. అధికారుల ముందుచూపు లేమి, నిబంధనల ఉల్లంఘన కారణంగా రణరంగాన్ని తలపించింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చంపాపేట బహుళ ప్రయోజన వేడుకల మందిరంలో బుధవారం జరిగిన ఈ సభలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి సభ రసాభాసగా మారింది.
అధికారుల వైఫల్యమే అసలు కారణం..?
ప్రభుత్వ అధికారిక కార్యక్రమం జరిగేటప్పుడు సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన నియమావళి ప్రకారం వేదికపై ఎవరు ఉండాలనే దానిపై స్పష్టమైన ఆదేశాలు ఉంటాయి. కేవలం పదవిలో ఉన్న, గెలిచిన ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు మాత్రమే వేదికను పంచుకోవాలి. కానీ, చంపాపేట సభలో ఎల్బీనగర్ జోన్ మున్సిపల్ అధికారులు ఈ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోలేదు. శాసనమండలి సభ్యుడు పట్నం మహేందర్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ మాజీ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్, మాజీ నగరపాలక సంస్థ సభ్యులు, ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో వేదికపై ప్రోటోకాల్ పాటించకుండా కూర్చోవడాన్ని అధికారులు నిలువరించలేకపోయారు.

వేదికపై మొదలైన రభస..
ఆలస్యంగా సభకు చేరుకున్న స్థానిక శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి వేదికపై కాంగ్రెస్ నాయకులు ఉండటాన్ని చూసి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. “ఇది ప్రభుత్వ సభా లేక పార్టీ సభా? నిబంధనలు ఏమయ్యాయి?” అంటూ ఉప కమిషనర్, మండల కమిషనర్లను నిలదీశారు. అధికారుల వద్ద సమాధానం లేక నీళ్లు నమలగా, ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. శాసనమండలి సభ్యుడు పట్నం మహేందర్‌రెడ్డి మౌనంగా ఉండిపోగా, సుధీర్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్ మధ్య నేరుగా మాటల తూటాలు పేలాయి. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో రక్షకభటులు జోక్యం చేసుకుని సుధీర్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ శ్రేణులను వేదిక కిందికి, ఆపై బయటకు పంపించారు.
గోస పడ్డ లబ్ధిదారులు.. బైఠాయించిన ఎమ్మెల్యే:
అధికారులు, నాయకుల తీరుతో పింఛన్ల కోసం పొద్దున్నుంచే పడిగాపులు కాస్తున్న వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లొల్లి ముదరడంతో నగరపాలక సంస్థ సిబ్బంది తలోదిక్కుకు వెళ్లిపోవడంతో లబ్ధిదారులు అయోమయానికి గురయ్యారు. మరోవైపు, తమను బయటకు పంపడాన్ని నిరసిస్తూ సుధీర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి ప్రాంగణంలోనే బైఠాయించి ఆందోళన చేపట్టారు.
పోలీస్ బాస్ డీ.జీ.పీ కీ ఫిర్యాదు..!
ఘటనపై సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ, “లబ్ధిదారులకు ఇబ్బంది కలగొద్దని మేము 200 మంది కార్యకర్తలతో రెండు గంటల పాటు బయటే ఉన్నాము. కానీ, కాంగ్రెస్ నాయకులు వందలాది మందితో లోపలికి వెళ్లి వేదిక ఎక్కినా రక్షకభటులు ఆపలేదు. నన్ను మాత్రం ఒక్కడినే లోపలికి వెళ్లమన్నారు” అని ఆరోపించారు.తోపులాటలో తన చేతికి గాయమైందని, పదిమంది కార్యకర్తలు గాయపడ్డారని, ఒక యువ నాయకుడిని వేదిక పైనుంచి కిందకు తోశారని ఆయన పేర్కొన్నారు. సరూర్‌నగర్, చైతన్యపురి పోలీస్ అధికారులు, ఎల్బీనగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసిపి ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తూ, గురువారం రాష్ట్ర డిజిపి సి.వి. ఆనంద్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు సుధీర్‌రెడ్డి తెలిపారు. మరోవైపు, అధికారిక కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నాయకులే కావాలని గొడవకు దిగారని కాంగ్రెస్ వర్గాలు ప్రత్యారోపణలు చేశాయి.



