ఆందోళన వ్యక్తం చేసిన మిషెల్ ఒబామా..
కమలా హారీష్ గెలిస్తే ఒక అసాధారణ గెలుపు అవుతుంది..
ట్రంప్ గెలుస్తాడని సర్వేలన్నీ చెబుతున్నాయి..
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో 10 రోజుల్లో అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దాంతో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి మిషెల్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తారేమోనని తనకు భయంగా ఉందని అన్నారు.
‘కమలా హారిస్ ఎన్నికల్లో విజయం సాధిస్తే దేశానికి ఓ అసాధారణ అధ్యక్షురాలు అవుతారు. కానీ హారిస్ కంటే ట్రంప్‌నకే అధికంగా విజయావకాశాలు ఉన్నట్లు తాజా సర్వేలు వెల్లడించాయి. ఇది హారిస్ మద్దతుదారుల్లో ఆందోళన, భయం పెంచుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ పాలనలో నెలకొన్న అస్థిరతను, ఆయన మానసిక పరిస్థితి, దుందుడుకు ఆలోచనలను మనం చూశాం. అయినా ఆయనకు ప్రజలు మద్దతివ్వడం నాలో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. అదే నిజమవుతుందేమో అని భయమవుతోంది’ అని మిషెల్ అన్నారు
అబార్షన్ హక్కుపై చట్టం చేయాలని అమెరికా కాంగ్రెస్‌ను హారిస్ కోరడాన్ని తాను సమర్థిస్తున్నానని మిషెల్ తెలిపారు. మహిళల ఆరోగ్య సంరక్షణకు ఆమె కృషి చేస్తున్నారన్నారు. అందుకు వ్యతిరేకంగా ఉన్న ట్రంప్ లాంటి వారికి అధికారం కట్టబెట్టి తనలాంటి ఎందరో స్త్రీల జీవితాలను కష్టాల్లోకి నెట్టొద్దని ఆమె కోరారు. మరోవైపు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో భాగంగా తన ప్రత్యర్థి కమలా హారిస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అమెరికాలో ఓపెన్ బోర్డర్ పాలసీని ముందుకు తీసుకురావడానికి హారిస్ ప్రయత్ని్స్తోందని ఆరోపించారు.