- జవాబుదారీతనం శూన్యం… దిల్లీలో పాలకుల మౌనమే మృత్యుఘోష!
- ప్రమాదాల పేరుతో ప్రాణాలు హరిస్తున్న నిర్లక్ష్య వైఖరి
- ప్రశ్నించే గొంతులపై వ్యక్తిగత దూషణలే ప్రభుత్వ సమాధానం.
- ఢిల్లీలో ‘ట్రిపుల్ ఇంజిన్’ సర్కార్ ఉనికే ప్రశ్నార్థకం
- న్యూఢిల్లీ:
దేశ రాజధానిలో వరుస విషాదాలు పాలకుల నిర్లక్ష్యానికి, పరిపాలనా వైఫల్యానికి నిలువెత్తు రూపాలుగా మారుతున్నాయి. సత్యనికేతన్లో విద్యార్థులతో కిటకిటలాడుతున్న భవనం కుప్పకూలి అమాయక ప్రాణాలు బలకావడం కేవలం ఒక ఒంటరి ఘటన కాదు. గత నాలుగు నెలల వ్యవధిలో సైదులాజబ్లో జరిగిన భవన కూలిపోవడం వల్ల ఆరుగురు మృత్యువాత పడ్డారు. అలాగే హౌజ్ రాణీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఏకంగా 22 మంది సజీవదహనమయ్యారు. ప్రతిసారీ నిరుపేద విద్యార్థుల కలలు, ఆశయాలు, ఊపిరిలు భవనాల శిథిలాల కింద అణచివేయబడుతున్నాయి. కానీ, పాలకుల నుంచి మాత్రం ఎలాంటి కఠిన చర్యలు కనిపించడం లేదు.
:సిగ్గుచేటైన ధోరణి… చిన్న అధికారులపై నే ప్రతాపం:
ప్రతి దుర్ఘటన జరిగినప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరించే తీరు అత్యంత సిగ్గుచేటుగా ఉంటోంది. ప్రమాదాలు జరగడానికి ముందస్తు నివారణ చర్యలు శూన్యం. ప్రమాదం జరిగిన తర్వాత హడావుడిగా ప్రకటనలు గుప్పించడం, కొంతమంది కిందిస్థాయి అధికారులపై బాధ్యత నెట్టి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. ఈ తతంగంలో అసలైన దోషులు, పాలకులకు కొమ్ముకాసే బడాబాబులు మాత్రం ఎలాంటి జవాబుదారీతనం లేకుండా సులభంగా తప్పించుకుంటున్నారు. వ్యవస్థాగత లోపాలను ప్రశ్నించాల్సిన వ్యవస్థలే నేరస్థులను కాపాడే పనిలో నిమగ్నమయ్యాయి.
*ప్రశ్నిస్తే అవమానాలు… రాహుల్ గాంధీ నిలదీత
ప్రజల ప్రాణాలను హరిస్తున్న ఈ ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేరుగా నిలదీస్తుంటే, పాలకుల నుంచి వస్తున్న స్పందన అత్యంత హేయంగా ఉంది. ప్రజా సమస్యలపై గళమెత్తితే ప్రధానమంతే స్వయంగా అవమానకరమైన బిరుదులతో దాడికి దిగుతున్నారు. ప్రశ్నించే వారిని బద్నామ్ చేయడం, వారి నోరు మూయించడమే ఏకైక అజెండాగా పాలకులు వ్యవహరిస్తున్నారు. దేశ ప్రజల మౌలిక సమస్యలపై మాట్లాడకుండా, బాధ్యుల నుంచి సమాధానం రాబట్టకుండా నిరంతరం తప్పుడు మాటలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. గత పన్నెండు ఏళ్ల కాలంలో ప్రపంచంలోని సకల విషయాల గురించి మాట్లాడిన ఈ ప్రభుత్వం, దేశ ప్రజల ప్రాణాలను బలిగొంటున్న అసలు సమస్యలపై మాత్రం పెదవి విప్పడం లేదు.
*అసమర్థతే ‘ట్రిపుల్ ఇంజిన్’ పరమార్థం
ఢిల్లీలో ‘ట్రిపుల్ ఇంజిన్’ ప్రభుత్వం నడుస్తోందని గొప్పలు చెప్పుకునే పాలకులకు ఈ మరణాలు ఏమాత్రం కనిపించడం లేదా? ఇన్ని అధికారాలు, వ్యవస్థలు చేతిలో ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం ఎందుకు ఇంతగా నిస్సహాయతను ప్రదర్శిస్తోంది? ఈ నిస్సహాయత కేవలం చేతకానితనం కాదు, స్పష్టమైన ఉద్దేశం లోపమే. ఎక్కడైతే పాలకులకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండదో, అక్కడ జవాబుదారీతనం అడ్రస్ లేకుండా పోతుంది. నేడు దిల్లీలో అదే జరుగుతోంది. అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తుంటే, పాలకుల కుర్చీలు మాత్రం భద్రంగా ఉంటున్నాయి. ఈ నిర్లక్ష్య వైఖరి మారనంత వరకు దిల్లీ వీధుల్లో మృత్యుఘోష ఆగదు.


