మూడు జోన్ల పరిధిలో అనధికార నిర్మాణాలు, రహదారులు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపు
ఎల్బీనగర్
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాలు, ప్రజా రహదారులు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపునకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్ ఆదేశాల మేరకు మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్ల పరిధిలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే అనధికార నిర్మాణాలు, ఆక్రమణలను తొలగిస్తున్నారు.
మల్కాజిగిరి జోన్ లో బోయిన్ పల్లి సర్కిల్ ఫతేనగర్‌లోని ప్రైవేట్ భవనం వద్ద అనధికారంగా ఏర్పాటు చేసిన సెంటరింగ్ను తొలగించారు. ఫతేనగర్ నుంచి గౌతమ్ నగర్ వరకు ఆక్రమణల తొలగింపు డ్రైవ్ నిర్వహించారు. యోగేంద్ర పార్థి ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన గదులను కూల్చివేసారు.
ఉప్పల్ జోన్ లో ఘట్కేసర్ పరిధిలో ఎస్వీ నగర్ నుంచి రాంపల్లి X రోడ్, నాగారం డివిజన్ వరకు రహదారి, ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. కాచవాని సింగారంలో అక్రమంగా నిర్మించిన 8 ర్యాంపులను తొలగించారు. ఉప్పల్ X రోడ్ నుంచి నాగోల్ వైపు, ఉప్పల్ భగాయత్ ఫేజ్-2లోని డీ-మార్ట్ ప్రాంతం వరకు రహదారి ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టి అక్రమంగా ఏర్పాటు చేసిన గుడిసెలను తొలగించారు. బోడుప్పల్ పరిధిలోని పీర్జాదిగూడ సర్కిల్-10, శంకర్ నగర్లో రహదారిని ఆక్రమించి నిర్మించిన ర్యాంపులను తొలగించారు.
ఎల్బీనగర్ జోన్ లో నాగోల్ పరిధిలోని బండ్లగూడ, నాగోల్ డివిజన్, అప్కో కాలనీలో అనధికారంగా నిర్మించిన పెంట్‌హౌస్, గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ గోడలు, రెండవ అంతస్తుకు పైన నిర్మించిన పిల్లర్లను తొలగించారు.
సరూర్ నగర్ పరిధిలోని అష్టలక్ష్మి కమాన్ నుంచి డీవీఎం కాలేజ్, సిరీస్ రోడ్ వరకు ఆక్రమణల తొలగింపు డ్రైవ్ నిర్వహించారు. ఈ ప్రాంతంలో సుమారు 1.5 మీటర్ల మేర ఆక్రమణల తొలగింపు చేపట్టి 15 ఆక్రమణలను తొలగించారు. ఎల్బీనగర్ పరిధిలోని కర్మన్‌ఘాట్ గ్రీన్ పార్క్ కాలనీలో కూడా ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టారు.ప్రజా రహదారులు, ఫుట్‌పాత్‌లు మరియు ఇతర ప్రజా వినియోగ ప్రాంతాలను ఆక్రమించడం వల్ల పాదచారుల రాకపోకలకు, ట్రాఫిక్ నిర్వహణకు ఇబ్బందులు కలగడంతో పాటు ప్రజా సౌకర్యాలకు ఆటంకం ఏర్పడుతుందని కమిషనర్ తెలిపారు. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం, రహదారులు మరియు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం వంటి చర్యలను సహించబోమని స్పష్టం చేశారు.ఆక్రమణల తొలగింపు అనంతరం ఆయా ప్రాంతాల్లో తిరిగి ఆక్రమణలు ఏర్పడకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, రెవెన్యూ తదితర విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ ఆదేశించారు.ప్రజా ఆస్తుల పరిరక్షణ, రహదారులపై సాఫీగా రాకపోకలు, పాదచారుల భద్రత, క్రమబద్ధమైన పట్టణ అభివృద్ధి ఎంఎంసీ ప్రధాన లక్ష్యాలని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలు మున్సిపల్ నిబంధనలను పాటిస్తూ, ప్రజా స్థలాలను ఆక్రమించకుండా సహకరించాలని కోరారు.



