24 బై 7 మాదిరి పని చేయాలి
ఎంఈటీలకు హైడ్రా కమిషనర్ దిశానిర్దేశం
వర్షాకాలం పని చేసే మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్ లు 24 బై 7 మాదిరి పని చేయడమే కాకుండా అను నిత్యం అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. వాతావరణ హెచ్చరికలను క్షుణ్నంగా పరిశీలించి.. వర్షానికి ముందే సన్నద్ధమవ్వాలన్నారు. జులై 1వ తేదీ నుంచి రంగంలోకి దిగిన మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్‌ల కాంట్రాక్టర్లతో పాటు.. హైడ్రా మార్షల్స్, డీఆర్ ఎఫ్ మేనేజర్లు, సూపర్‌వైజర్లతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో హైడ్రా కమిషనర్ మాట్లాడారు. వర్షం పడితే తలెత్తే సమస్యలపై పూర్తి అవగాహనతో ఉండాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తుతుందో.. అందుకు పరిష్కారం ఏంటో కూడా తెలియాలన్నారు. వర్షం పడినప్పుడు అప్రమత్తంగా ఉండి.. రహదారులను, నివాసాలను వరద ముంచెత్తకుండా జాగ్రత్త పడాలన్నారు. వర్షం లేనప్పుడు సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు.
ప్రజాసమన్యలపై పరిధిలు వద్దు :
వర్షాకాలం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యతను హైడ్రాపై నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందని.. అది వమ్ము కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని కమిషనర్ సూచించారు. ప్రజల విశ్వాసం చూరగొనేలా మన పని విదానం ఉండాలన్నారు. ప్రజలు సమస్యల్లో ఉంటే పరిధిలు గీసుకొని ఉండాల్సిన పని లేదని.. పక్క సర్కిల్‌లో సమస్య ఉంటే వెంటనే అందరూ చేతులు కలపాలని కాంట్రాక్టర్లకు సూచించారు. జీహెచ్ ఎంసీ, జలమండలి, హైడ్రా, ఇరిగేషన్ ఇలా సంబంధిత శాఖలన్నిటితో అధికారులు సమన్వయం ఏర్పాటు చేసి.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడడమే లక్ష్యం కావాలన్నారు. వాహనాలు మొరాయించడం, నీటిని తోడే పంపులు పని చేయడంలేదు ఇలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే.. వెంటనే సంబంధిత అధికారి దృష్టికి తీసుకువస్తే ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘాలు ఫిర్యాదు చేసినప్పడు వాటి పరిష్కారానికి ఎంతో బాధ్యత పడాలన్నారు.