- నేరస్థుడు ఆర్ఫాజ్ను హతమార్చేందుకు పథకం..ఐదుగురి అరెస్ట్
- రెండు నాటు తుపాకులు, 8 తూటాలు, మూడు కత్తులు స్వాధీనం…మల్కాజ్గిరి సీపీ సుమతి
హైదరాబాద్
పాత కక్షలు.. ప్రతీకారేచ్ఛ.. హత్యకు కుట్ర! ఓ వ్యక్తిని హతమార్చేందుకు పథకం సిద్ధం చేసుకున్న ఐదుగురిని మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ పోలీసులతో కలిసి ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ కుట్ర వెలుగుచూసింది.నిందితుల నుంచి రెండు నాటు తుపాకులు, 8 తూటాలు, మూడు కత్తులు, రెండు ద్విచక్ర వాహనాలు, ఆటోతో పాటు నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మూసీ పరివాహక ప్రాంతంలో అనుమానాస్పదంగా..
నవంబర్ 2న ఉదయం ఉప్పల్ శిల్పారామం వెనుక మూసీ నది సమీపంలోని ఖాళీ ప్రదేశంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలు, ఓ ఆటోతో ఐదుగురు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. ఇద్దరి వద్ద రెండు నాటు తుపాకులు, 8 తూటాలు, మూడు కత్తులు లభించాయి. విచారణలో ఆర్ఫాజ్ అనే వ్యక్తిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు.
పాత హత్యలకు ప్రతీకారంగా మరో హత్యకు కుట్ర..
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. దాసరి సురేందర్ అలియాస్ సూరి తన భార్య షబాపై అనుమానంతో ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. అనంతరం 2024లో షబా సోదరుడు సల్మాన్‌ను కూడా హత్య చేసినట్లు కేసులున్నాయి. ఈ క్రమంలో షబా మరో సోదరుడు ఆర్ఫాజ్.. జులై 2026లో సురేందర్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో జైలుకు వెళ్లిన ఆర్ఫాజ్ ఇటీవల విడుదలయ్యాడు. దీంతో సురేందర్ అనుచరులుగా ఉన్న ఐదుగురు అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని హత్యకు కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైంది.
బీహార్ నుంచి తుపాకుల కొనుగోలు..
కుట్రలో భాగంగా తనయ్ కుమార్ అలియాస్ కన్నా, షేక్ అక్బర్ కలిసి ఆదిత్య కుమార్ ఠాకూర్‌కు ఫోన్‌పే ద్వారా రూ.35 వేల నగదు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఆదిత్య బీహార్‌లోని భాగల్పూర్ జిల్లా సైద్పూర్ దబ్రా ప్రాంతానికి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తి నుంచి రూ.30 వేలకు రెండు నాటు తుపాకులు, ఆరు తూటాలు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. మూడు కత్తులను కూడా కొనుగోలు చేసినట్లు తెలిపారు.
పోలీసుల అప్రమత్తతతో తప్పిన ఘోరం..
ఆర్ఫాజ్ను హతమార్చే పథకాన్ని అమలు చేసేందుకు ఐదుగురు నవంబర్ 2న ఉదయం మూసీ నది సమీపంలో సమావేశమయ్యారు. అయితే ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతో హత్య కుట్ర భగ్నమైందని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు.
నిందితుల వివరాలు..
- తొకట తనయ్ కుమార్ అలియాస్ కన్నా (26) – లోన్ రికవరీ ఏజెంట్, ఉప్పల్.
- షేక్ అక్బర్ (26) – ఆటో డ్రైవర్, మీర్‌పేట.
- ఆదిత్య కుమార్ ఠాకూర్ (33) – సెక్యూరిటీ గార్డు, ఉప్పల్.
- దుడాని లక్ష్మణ్ సింగ్ అలియాస్ సోను (27) – వెల్డింగ్ కార్మికుడు, కొత్తపేట.
- వడ్త్యా వెంకటేశ్ అలియాస్ నాని (22) – ఆటో డ్రైవర్, అల్మాస్గూడ.
వీరిలో లక్ష్మణ్ సింగ్ చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌గా ఉన్నట్లు, అతడిపై గతంలో 30 క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అందులో రెండు హత్య కేసులు కూడా ఉన్నాయని వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు ..
- రెండు నాటు తుపాకులు
- 8 తూటాలు (6 KF 7.65, 2 KF 8 MM)
- మూడు కత్తులు
- రెండు హోండా యాక్టివా వాహనాలు
- ఒక ఆటో
- నాలుగు సెల్ఫోన్లు
అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం, వ్యక్తిగత కక్షలతో హత్యలకు కుట్ర పన్నడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మల్కాజిగిరి పోలీసులు హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం ఉంటే సమీప పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన పోలీస్ కమిషనర్ సుమతి.


