Thursday, August 13, 2026
Google search engine
Homeతెలంగాణఎన్ .ఐ. ఓ .ఎస్ .ద్వారా 78 మంది ఖైదీలకు ఎస్.ఎస్ . సి .ఉత్తీర్ణతఖైదీల...

ఎన్ .ఐ. ఓ .ఎస్ .ద్వారా 78 మంది ఖైదీలకు ఎస్.ఎస్ . సి .ఉత్తీర్ణతఖైదీల విద్య, పునరావాసానికి జైళ్ల శాఖ ప్రోత్సాహం..ఉత్తీర్ణులకు డీజీ ప్రత్యేక రిమిషన్

చర్లపల్లి:

తెలంగాణ జైళ్ల చరిత్రలో తొలిసారిగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఎన్ .ఐ. ఓ. ఎస్. ద్వారా 78 మంది ఖైదీలు పదో తరగతి (ఎస్ .ఎస్. సి .) పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఖైదీల విద్య, స్వీయాభివృద్ధి, పునరావాసాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జైళ్ల శాఖ చేపట్టింది.
ఖైదీలు విద్యను కొనసాగించేలా జైళ్ల శాఖ ఎన్ .ఐ .ఓ .ఎస్. తో అవగాహన ఒప్పందం చేసుకుంది. అనంతరం చర్లపల్లి, నిజామాబాద్ కేంద్ర కారాగారాలతో పాటు హైదరాబాద్ ప్రత్యేక మహిళా కారాగారానికి చెందిన 108 మంది ఖైదీలు SSCలో చేరారు. వారి కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులను కేటాయించడంతో పాటు అవసరమైన చోట ప్రైవేట్ ఉపాధ్యాయులను నియమించి, వారి వేతనాలను జైళ్ల శాఖ భరించింది.
ఏడాది పాటు క్రమబద్ధమైన విద్యా ప్రణాళికలో భాగంగా తరగతులు, మాక్ టెస్టులు, ప్రీ-బోర్డు పరీక్షలు నిర్వహించి ఖైదీలను పరీక్షలకు సిద్ధం చేశారు. ఫలితంగా చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి 56 మంది, నిజామాబాద్ నుంచి 15 మంది, హైదరాబాద్ ప్రత్యేక మహిళా కారాగారం నుంచి ఏడుగురు చొప్పున మొత్తం 78 మంది ఉత్తీర్ణులయ్యారు.


జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్య మిశ్రా, ఐపీఎస్ ఉత్తీర్ణులైన ఖైదీలకు ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు. ఖైదీలు చూపిన పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర శ్రమ, ఆత్మవిశ్వాసాన్ని ఆమె ప్రశంసించారు. విద్య ద్వారా జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలనే సంకల్పానికి ఈ విజయం నిదర్శనమన్నారు.
ఉత్తీర్ణులైన 78 మంది ఖైదీలకు ప్రత్యేక రిమిషన్
విద్యపై ఖైదీలు చూపిన కృషి, క్రమశిక్షణకు గుర్తింపుగా ఎన్. ఐ. ఓ. ఎస్. ద్వారా ఎస్ .ఎస్. సి .ఉత్తీర్ణత సాధించిన 78 మందికి డైరెక్టర్ జనరల్ రిమిషన్‌ను ప్రత్యేక ప్రోత్సాహకంగా ప్రకటించారు. ఇతర ఖైదీలు కూడా విద్య వైపు అడుగులు వేయడానికి ఇది ప్రేరణగా నిలుస్తుందని డీజీ పేర్కొన్నారు.
ఉత్తీర్ణులైన ఖైదీలను ఎన్ . ఐ .ఓ . ఎస్ .ద్వారా సీనియర్ సెకండరీ (10+2) విద్య కొనసాగించేలా ప్రోత్సహించనున్నారు. మరో 47 మంది ఖైదీలు తాజాగా ఎస్. ఎస్. సి .లో నమోదు చేసుకున్నారు. 10+2 పూర్తిచేసిన అనంతరం చర్లపల్లి కేంద్ర కారాగారంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ద్వారా బీఏ కోర్సుల్లో చేరే అవకాశం కల్పించనున్నారు.
అలాగే ఎస్ . ఎస్ . సి .ఉత్తీర్ణులైన 78 మంది ఖైదీలు చర్లపల్లి కేంద్ర కారాగారంలోని ఐటీఐలో వివిధ సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు అభ్యసించేందుకు అర్హులని డీజీ తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని నైపుణ్యాలను పెంపొందించుకుని భవిష్యత్తులో స్వయం ఆధారిత జీవితం వైపు సాగాలని సూచించారు.
కార్యక్రమంలో ఎన్. ఐ. ఓ. ఎస్ జాయింట్ డైరెక్టర్ ఇన్‌చార్జ్ పరంప్రీత్ సింగ్, హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ డా. ప్రవీణ్ చౌహాన్, జైళ్ల శాఖ ఐజీ వై. రాజేష్, డీఐజీలు డా. డి. శ్రీనివాస్, ఎం. సంపత్, పలువురు జైలు సూపరింటెండెంట్లు, అధికారులు, ఎన్. ఐ. ఓ. ఎస్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments