Monday, September 28, 2026
Google search engine
Homeతెలంగాణవనస్థలిపురంలో నిబంధనలకు తిలోదకాలు: అడ్డగోలుగా భారీ కమర్షియల్ నిర్మాణాలు

వనస్థలిపురంలో నిబంధనలకు తిలోదకాలు: అడ్డగోలుగా భారీ కమర్షియల్ నిర్మాణాలు

  • సెట్ బ్యాక్ నిబంధనలు గాలికి.. ట్రాఫిక్ ముప్పులో స్థానికులు
  • ‘బిల్డ్ నౌ’ పోర్టల్‌లో పారదర్శకత లోపం.. అధికారుల మౌనమే అక్రమాలకు శ్రీరామరక్ష?
  • అక్రమ నిర్మాణాలపై వ్రాతపూర్వక ఫిర్యాదులు ఇచ్చి నెలలు గడిచినా చర్యలు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్న స్థానిక జనం..!
  • ఎల్బీనగర్ జోన్ హయత్ నగర్ సర్కిల్ 14 డిప్యూటీ కమిషనర్ అజ్మీర స్వామి ఏం చేస్తున్నట్లు..!
  • మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో దృష్టి సాధించాలంటూ స్థానిక ప్రజల డిమాండ్.

ఎల్బీనగర్:

మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎల్బీనగర్ జోన్, హయత్ నగర్ సర్కిల్-14 పరిధిలోని వనస్థలిపురంలో అక్రమ నిర్మాణాలు హద్దుమీరుతున్నాయి. స్థానిక నిబంధనలను, భద్రతా ప్రమాణాలను తుంగలో తొక్కి సాగుతున్న ఈ అక్రమ కట్టడాల పట్ల స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

*గృహ నివాస అనుమతులతో వాణిజ్య కట్టడాలు:
స్థానిక వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న ప్లాట్ నంబర్లు 28, 29లలో నిబంధనలకు విరుద్ధంగా భారీ కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారు. కేవలం రెసిడెన్షియల్ (నివాస) అనుమతులు మాత్రమే తీసుకొని, క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తిగా వాణిజ్య పరమైన భారీ భవనాలను నిర్మిస్తున్నారు. కనీసం నిబంధనల ప్రకారం వదలవలసిన సెట్ బ్యాక్‌లను, రోడ్డు వైశాల్యాన్ని సైతం పూర్తిగా ఆక్రమిస్తూ ఈ నిర్మాణాలు సాగుతున్నాయి.

*ముప్పు ముంగిట రద్దీ ప్రాంతం:
రద్దీగా ఉండే మెయిన్ రోడ్డును ఆనుకుని, ఎలాంటి సెట్ బ్యాక్ స్థలం వదలకుండా చేపడుతున్న ఈ భారీ నిర్మాణాల వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. అగ్నిమాపక భద్రతా (ఫైర్ సేఫ్టీ) నిబంధనలను పూర్తిగా విస్మరించడంతో, భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే అగ్నిమాపక వాహనాలు లోపలికి వెళ్లేందుకు కూడా దారిలేని దుస్థితి నెలకొంది.

*’బిల్డ్ నౌ’ వెబ్సైట్లో పారదర్శకత శూన్యం:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘బిల్డ్ నౌ’ వెబ్‌సైట్ పోర్టల్‌లో తీవ్రమైన పారదర్శకత లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏ అధికారి అనుమతులు ఇచ్చారు, భవనానికి సంబంధించిన వాస్తవ అనుమతుల వివరాలు ఏమిటి, అక్రమ నిర్మాణాల ప్రస్తుత స్టేటస్ ఏంటనే సమాచారం ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. ఈ సాంకేతిక లోపాలు, అధికారుల ఉదాసీనత అక్రమార్కులకు వరంలా మారుతున్నాయి.

*అధికారుల లోపాయికారి ఒప్పందాలు..
నెలలు గడుస్తున్నా చర్యలు శూన్యం
ఈ అక్రమ నిర్మాణాలపై స్థానికులు ఇప్పటికే అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసి నెలలు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. అధికారుల లోపాయికారి ఒప్పందాల వల్లే అక్రమ కట్టడాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

*ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని డిమాండ్:
సర్కిల్-14 పరిధిలో జరుగుతున్న ఈ అక్రమాలపై డిప్యూటీ కమిషనర్ అజ్మీర స్వామి మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే ఈ వ్యవహారంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో ప్రత్యేక దృష్టి సారించి, అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ అక్రమ నిర్మాణాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అధికారుల ఉదాసీన వైఖరిపై ఉన్నతాధికారులు ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడతారనేది వేచి చూడాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments