Wednesday, September 23, 2026
Google search engine
Homeతెలంగాణఎల్బీనగర్ జోన్ సర్కిల్ 13లో అడ్డగోలుగా అక్రమ గోదాముల నిర్మాణాలు..

ఎల్బీనగర్ జోన్ సర్కిల్ 13లో అడ్డగోలుగా అక్రమ గోదాముల నిర్మాణాలు..

  • ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.. గల్లీ లీడర్ల వసూళ్ల దందా!
  • ముడుపులే ముఖ్యం: అక్రమ నిర్మాణాల వైపు కన్నెత్తి చూడని అధికార ఘనం..
  • ఎల్బీనగర్ సర్కిల్ 13 మున్సిపల్ అధికారులు, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో దృష్టి సారించాలంటూ స్థానిక ప్రజల డిమాండ్..

ఎల్బీనగర్ :

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని ఎల్బీనగర్ జోన్ సర్కిల్-13లో అధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా భారీ కమర్షియల్ గోదాముల నిర్మల యదేచ్ఛగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన లక్షలాది రూపాయల పన్ను రాబడి గండిపడుతోంది. స్థానిక గల్లీ లీడర్ల అండదండలతో సాగుతున్న ఈ అక్రమ నిర్మాణాల పర్వంపై ప్రత్యేక కథనం.

*అనుమతులు శూన్యం.. అధికారిక పన్నులకు ఎస్కేప్!
ప్రధాన రహదారులు, హైవేలను ఆనుకుని నిబంధనలకు విరుద్ధంగా భారీ వాణిజ్య గోదాముల (కమర్షియల్ షెడ్స్) నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. మున్సిపల్ శాఖ నుంచి ఎలాంటి భవన నిర్మాణ అనుమతులు పొందకుండానే కోట్లాది రూపాయల విలువైన ప్రాజెక్టులను అక్రమార్కులు చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం వాణిజ్య నిర్మాణాలు చేపట్టాలంటే భారీగా అనుమతి రుసుములు, పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ భారాన్ని తప్పించుకోవడానికి యజమానులు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

*’మాకు ముట్టజెప్పండి.. మేము చూసుకుంటాం’:
ఈ అక్రమ నిర్మాణాల వెనుక స్థానిక గల్లీ లీడర్ల ప్రమేయం తారాస్థాయికి చేరింది. సుభానీ గ్యాంగ్‌గా పేరుపడిన కొందరు స్థానిక నాయకులు రంగంలోకి దిగి అక్రమార్కులతో కుమ్మక్కవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. “అధికారులకు అనుమతులు తీసుకుని పన్నులు కట్టడం ఎందుకు? అందులో సగం మాకు ముట్టజెప్పండి.. అధికారుల సంగతి మేం చూసుకుంటాం” అంటూ బహిరంగంగానే వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఈ అడ్డగోలు వసూళ్ల కారణంగా మున్సిపల్ శాఖకు చేరవలసిన లక్షలాది రూపాయల ఆదాయం లీడర్ల జేబుల్లోకి వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది.

*నిబంధనలకు తిలోదకాలు.. భద్రత గాలికి!
ఫైర్ సేఫ్టీ (అగ్నిమాపక భద్రతా) నిబంధనలను తుంగలో తొక్కి ఈ భారీ గోదావులను నిర్మిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, ప్రధాన రహదారులను ఆనుకుని ఎలాంటి పార్కింగ్ స్థలాలు, అగ్నిమాపక వాహనాలు వెళ్లేందుకు దారులు లేకుండా ఇష్టానుసారంగా షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. రేపటి రోజున ఏ చిన్న ప్రమాదం జరిగినా ప్రాణనష్టం భారీగా సంభవించే ప్రమాదం ఉంది. అయినా సరే సంబంధిత సర్కిల్ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

*అక్రమ నిర్మాణాలు: అధికారుల స్పందన కరువు:

  • కర్మన్‌ఘాట్ – మందమల్లమ్మ మార్గం: సంతోష్‌నగర్ వెళ్లే ప్రధాన రహదారి మార్గంలో ఎలాంటి అనుమతులు లేకుండా భారీ అక్రమ షెడ్ నిర్మాణం వేగంగా సాగుతోంది.
  • కర్మన్‌ఘాట్ లోటస్ లాంప్ స్కూల్ ప్రాంతం: సాయిరాం నగర్ కాలనీ కమాన్ పక్కనే నిబంధనలకు విరుద్ధంగా మరొక భారీ అక్రమ షెడ్డును నిర్మించారు.
  • లింగోజిగూడ డివిజన్ (అర్బన్ బీట్స్ బార్ ఎదురుగా): బరమలగూడ ప్రధాన రహదారిని ఆనుకుని కమర్షియల్ గిడ్డంగి (గోదాం) అక్రమ నిర్మాణం జోరుగా కొనసాగుతోంది.
  • సరూర్‌నగర్ – అవేర్ హాస్పిటల్ దారి: లింగోజిగూడ డివిజన్ పరిధిలోని ఈ రద్దీ మార్గంలోనూ పెద్ద ఎత్తున కమర్షియల్ గోదాం అక్రమ నిర్మాణం వెలిసింది.

అధికారులు స్పందించేనా?
క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యవేక్షణ లోపించడం, అధికారుల ఉదాసీన వైఖరి కారణంగానే అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, పైన పేర్కొన్న అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేనియెడల ప్రజా ఆగ్రహానికి, తీవ్ర అపశ్రుతులకు అధికారులు బాధ్యత వహించక తప్పదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments