ఎల్బీనగర్:
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని డిప్యూటీ కలెక్టర్ డి. రాంప్రసాద్ సూచించారు. మంగళవారం సరూర్నగర్‌లో నిర్వహించిన అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు, బూత్ స్థాయి ప్రతినిధులతో సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్, సర్ ప్రోగ్రాం స్పెషల్ ఆఫీసర్ డి.రాంప్రసాద్ మరియు కందుకూరు డివిజన్ ఆర్డీఓ/ఈఆర్ఓ ఎన్.జగదీశ్వర్ రెడ్డి, సరూర్నగర్ తహసీల్దార్ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా ఇంటింటి పరిశీలన, ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల స్వీకరణ, అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చడం, మరణించిన లేదా శాశ్వతంగా వేరే ప్రాంతాలకు మారిన వారి వివరాలను సక్రమంగా పరిశీలించి చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై అధికారులు వివరించారు. కాంగ్రెస్, భారాస, బీజేపీ సీపీఎం రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సూచనలు, అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అర్హత కలిగిన ఓటరుకి ఓటు హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. సర్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ స్టేషన్ స్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్నట్లు ఎన్. జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో రాజకీయ పార్టీలు, బీఎల్ఏలు, కాలనీ సంఘాల ప్రతినిధులు సహకరించాలని అధికారులు కోరారు.


