Saturday, September 12, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్అటవీ శాఖ అమరవీరుల సేవలు చిరస్మరణీయం.. డీజీపీ సి. వి ఆనంద్

అటవీ శాఖ అమరవీరుల సేవలు చిరస్మరణీయం.. డీజీపీ సి. వి ఆనంద్

  • అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో 23 మంది అటవీ సిబ్బంది ప్రాణత్యాగం: డిజిపి సి. వి ఆనంద్
  • అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి జూపల్లి
  • అటవీ భూముల ఆక్రమణలను అడ్డుకునేందుకు కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేయాలి
  • అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలి

హైదరాబాద్‌

సహజ వనరులు, అటవీ సంపద, వన్యప్రాణుల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన అటవీశాఖ సిబ్బంది సేవలు చిరస్మరణీయమని డిజిపి సి.వి. ఆనంద్‌ పేర్కొన్నారు. అటవీ శాఖ పోలీసు అమరవీరుల దినోత్సవం (సెప్టెంబర్ 11న) సందర్భంగా శుక్రవారం నెహ్రూ జూలాజికల్‌ పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.

అక్రమ కలప రవాణా, వన్యప్రాణుల వేటను అడ్డుకునే క్రమంలో ప్రాణాలకు ముప్పు.. మంత్రి జూపల్లి కృష్ణారావు

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలా ఆదుకుంటామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
అటవీ సిబ్బంది ఆయుధాలు ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు.
ఎక్సైజ్‌ శాఖ తరఫున డ్రగ్స్‌ నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని జూపల్లి తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగానికి పాల్పడుతున్న వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తున్నామని, అవసరమైన సందర్భాల్లో పీడీ యాక్ట్‌ కింద చర్యలు తీసుకుంటున్నామ న్నారు.
అడవుల నరికివేత, అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం గ్లోబల్‌ వార్మింగ్‌కు ప్రధాన కారణాల్లో ఒకటని మంత్రి పేర్కొన్నారు. కవ్వాల్‌, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులను పర్యాటకంగా ప్రభుత్వం అభివృద్ధి చేసిందన్నారు.

ప్రాణాలకు తెగించి విధులు
: వినయ్‌కుమార్‌, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్

అటవీ సిబ్బంది విధులు అత్యంత ప్రమాదకరమైనవని ఫారెస్ట్ చీఫ్ వినయ్‌కుమార్‌ అన్నారు. పెట్రోలింగ్‌ సమయంలో అక్రమ కలప రవాణాదారులు, వన్యప్రాణుల వేటగాళ్లు, ఇతర దుండగుల నుంచి సిబ్బందికి ప్రమాదం పొంచి ఉంటుందని తెలిపారు. అర్ధరాత్రి వేళల్లో వేటగాళ్లను పట్టుకునే క్రమంలోనూ సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

23 మంది అటవీ సిబ్బంది ప్రాణత్యాగం: డిజిపి

ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ…. ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 11న అటవీ అమరవీరుల దినోత్సవాన్ని రాజస్థాన్‌లోని ఖేజర్లీ ప్రాంతంలో చెట్లను, పర్యావరణాన్ని కాపాడేందుకు1730 సంవత్సరం లో 363 మంది విష్ణోయి తెగ ప్రజలు ప్రాణత్యాగం చేసిన ఘటనకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. పోలీసుశాఖలో అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించినట్లుగానే.. అటవీశాఖ సిబ్బంది త్యాగాలను స్మరించుకునేందుకు ఈ రోజు ప్రత్యేకమని, ఇది భావోద్వేగంతో కూడిన రోజన్నారు.
వన్యప్రాణులు, అడవుల సంరక్షణలో 23 మంది అటవీశాఖ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని డీజీపీ తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 11న పాల్వంచలో ఎఫ్‌బీవో బానోతు నవీన్‌ వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకుని అటవీ, వన్య ప్రాణుల పరిరక్షణలో ప్రాణ త్యాగం నవీన్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చిన్ననాటి నుంచే అటవీశాఖతో అనుబంధం

అటవీశాఖతో తనకు ఉన్న అనుబంధాన్ని డీజీపీ గుర్తు చేసుకున్నారు. తన తండ్రి 1953లో అటవీశాఖలో రేంజ్‌ ఆఫీసర్‌గా చేరి 35 ఏళ్లపాటు సేవలందించి 1988లో డీఎఫ్‌ఓగా పదవీ విరమణ చేశారని తెలిపారు. నక్సల్స్‌ ప్రభావం ఉన్న రోజుల్లో తన తండ్రి అటవీ శాఖలో పనిచేసేవారని, దీంతో ఫారెస్ట్‌ సిబ్బందితో అనుబంధం ఉంది అన్నారు. ఆ తర్వాత 1996లో బెల్లంపల్లిలో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో తల్లిదండ్రులతో కలిసి చెన్నూరు చెక్‌పోస్ట్‌కు వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. దట్టమైన అడవులు పూర్తిగా కనుమరుగవడాన్ని చూసి తన తల్లిదండ్రుల కళ్లలో నీళ్లు తిరిగాయని తెలిపారు.

పర్యావరణ సమతుల్యతను కాపాడాలి

అడవులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డీజీపీ పేర్కొంటూ… మానవ తప్పిదాల కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. హిమాలయాల్లో చోటుచేసుకుంటున్న ప్రకృతి విపత్తులు, యూరప్‌లోని అడవుల్లో సంభవిస్తున్న అగ్నిప్రమాదాలు పర్యావరణ మార్పుల తీవ్రతను తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అటవీ భూముల ఆక్రమణలను అడ్డుకుని అడవులను పరిరక్షించేందుకు కలెక్టర్లు, ఎస్పీలు, అటవీశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మిగిలి ఉన్న చిన్నచిన్న అటవీ ప్రాంతాలను కూడా భవిష్యత్‌ తరాల కోసం కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.

అటవీ సిబ్బందికి ఆయుధాలు

గతంలో నక్సల్స్‌ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహించే సమయంలో అటవీశాఖ సిబ్బంది వద్ద ఆయుధాలు ఉండేవి కావని డీజీపీ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అటవీశాఖ సిబ్బందికి అవసరమైన ఆయుధాలు అందిస్తే వారు మరింత సమర్థంగా విధులు నిర్వర్తించగలరని అన్నారు. పోలీసుశాఖ తరఫున అటవీశాఖకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్‌ ఎక్సైజ్‌, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైరా శాసనసభ సభ్యులు రాందాస్ నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ వినయ్‌కుమార్‌,టీజీఎఫ్‌డీసీ వైస్‌ చైర్మన్‌, ఎండీ సునీత ఎం. భగవత్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రియాంక ఆల, సెక్రటరీ ప్రియాంక వర్గీస్, పోలీసు, అటవీ శాఖ అధికారులు, అమరవీరుల కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments