- హైడ్రా కమిషనర్‌కు వినతి తెలిపిన స్థానికులు, మత్స్యకారులు
- క్షేత్రస్థాయిలో చెరువుల అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్ ఏవీ రంగనాథ్
ఘట్కేసర్:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండల పరిధిలోని ఏదులాబాద్ గ్రామంలో చారిత్రక ప్రాధాన్యం కలిగిన లక్ష్మీనారాయణ చెరువును కాలుష్యం బారి నుంచి రక్షించాలని స్థానికులు, మత్స్యకారులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కోరారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా గురువారం ఆయన ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్త, హైడ్రా అడిషనల్ కమిషనర్ డి. ఆనంద్ కుమార్‌తో కలిసి ఆ చెరువును సందర్శించారు. అక్కడ గణేష్ నిమజ్జనానికి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో కమిషనర్‌ను కలిసి చెరువు పూర్వ వైభవాన్ని, ప్రస్తుత దుస్థితిని వివరించారు. ఆరు వందల ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ జలాశయం గతంలో తాగు, సాగునీటి అవసరాలను తీర్చేదని, నేడు పూర్తిగా కలుషితమైందని వాపోయారు. నగరంలోని ఇతర చెరువులను హైడ్రా ఆధ్వర్యంలో తీర్చిదిద్దిన విధంగానే, ఏదులాబాద్ చెరువును కూడా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.
*కాలుష్యంతో ప్రజల ఆరోగ్యం అతలాకుతలం
చెరువు నీరు చేతులకు తాకితే జిగురులా అంటుకుంటోందని, తీవ్రమైన కాలుష్యం కారణంగా జలచరాలు, చేపలు మృత్యువాత పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో బోర్ల నీరు కలుషితం కావడంతో ప్రజలు బీపీ, థైరాయిడ్, క్యాన్సర్, సంతానోత్పత్తి సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలిపారు. పైన ఉన్న జవహర్‌నగర్ డంప్ యార్డ్ వ్యర్థాలు, మురుగునీరు నేరుగా చెరువులో కలవడమే ఈ దుస్థితికి కారణమని చెప్పారు. జవహర్‌నగర్ నుంచి వచ్చే మురుగునీటి ప్రవాహాన్ని వేరే నాలాలోకి మళ్లిస్తే (డైవర్ట్ చేస్తే) సమస్య చాలావరకు పరిష్కారమవుతుందని సూచించారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ జలాశయాన్ని పరిరక్షించేందుకు త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, తగిన కార్యాచరణతో ముందుకు వెళ్తామని హైడ్రా కమిషనర్ స్థానికులకు భరోసానిచ్చారు.
*చెరువుల పునరుద్ధరణ వేగవంతం కావాలి
ఉప్పల్ నల్లచెరువు, నాచారం చెరువు, రామంతాపూర్ పెద్ద చెరువుల పునరుద్ధరణ పనులు శరవేగంగా పూర్తి కావాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఉప్పల్ నల్లచెరువును నవంబరులో ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో, అప్పటివరకు పనులను సవరించాలని సూచించారు. ఈ పర్యటనలో భాగంగా చెరువు వద్ద సెడిమెంటేషన్ ట్యాంకులు, చెరువు కట్ట, ఇన్లెట్లు, అవుట్లెట్లను ఆయన పరిశీలించారు.
ఉప్పల్ నల్లచెరువు సమీపంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 155లోని తాత్కాలిక షెడ్లను ఖాళీ చేయించి, వెండర్లకు అక్కడ అవకాశం కల్పించేందుకు సహకరించాలని జోనల్ కమిషనర్ రాధిక గుప్త కోరారు. చెరువుల అభివృద్ధికి సంబంధించిన ముసాయిదాను విమోస్ టెక్నోక్రాట్స్ డైరెక్టర్ యూనస్ కమిషనర్‌కు వివరించారు. ఉప్పల్ నల్లచెరువు చుట్టూ పచ్చదనాన్ని, జీవవైవిధ్యాన్ని పెంపొందించాలని సూచించారు.
నాచారం చెరువు చుట్టూ ఉన్న వాకింగ్ పాత్పైకి వాహనాల రాకపోకలు సాగుతుండటంతో భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని కోరగా, ఈ అంశంపై పూర్తి స్థాయి అధ్యయనం చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. చెరువులో దశాబ్దాలుగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను, పూడికను అవసరమైన లోతు వరకు పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. అనంతర రామంతాపూర్ పెద్ద చెరువును పరిశీలించారు. లక్షలాది మంది నివాసాల మధ్య ఉన్న ఈ చెరువు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతుందని, దీనిని త్వరితగతిన అభివృద్ధి చేయాలని సూచించారు. గతంలో గూడు కోల్పోయిన నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరిలో తమ పేర్లు చేర్చినందుకు వారు కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.



