Monday, October 12, 2026
Google search engine
Homeతెలంగాణకుత్బుల్లాపూర్ లో 'థీము కింగ్స్ కోర్ట్’ అక్రమ నిర్మాణాల దందా..!

కుత్బుల్లాపూర్ లో ‘థీము కింగ్స్ కోర్ట్’ అక్రమ నిర్మాణాల దందా..!

  • బరితెగించిన టౌన్ ప్లానింగ్ అధికారులు.. బిల్డ్ నౌ పోర్టల్ సాక్షిగా కోట్ల రూపాయల అక్రమ అనుమతుల కుంభకోణం!
  • నిబంధనలను పాతిపెట్టి భవన నిర్మాణ అనుమతులు మంజూరు.. ఆధారాలతో ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు..
  • నాలా కన్వర్షన్ లేదు, లేఅవుట్ అనుమతులు లేవు, కోట్ల రూపాయల ప్రజాధనం డ్యూటీ చేస్తున్న అవినీతి అధికారులు..
  • బిల్డ్ నౌ , కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, దేవేందర్ రెడ్డి వెబ్సైట్ పారదర్శకత పై దృష్టి సారించాలి..
  • సి.ఎం.సి కమిషనర్ సృజన, మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్, మున్సిపల్ శాఖ సెక్రటరీ, సీఎం రేవంత్ రెడ్డి, దృష్టి సారించాలి.

ఖజానాకు కన్నం వేస్తూ, నిబంధనలను నాలాలో కలిపేస్తూ కుత్బుల్లాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారులు ‘బిల్డ్ నౌ’ పోర్టల్‌ను అవినీతికి వేదికగా మార్చేశారు. LRS కటాఫ్ తేదీ దాటినా మార్ఫింగ్ పత్రాలతో ‘థీము కింగ్స్ కోర్ట్’ అక్రమ నిర్మాణాలకు పచ్చజెండా ఊపి కోట్ల రూపాయల మేత మేశారు. ఆధారాలతో ఫిర్యాదు చేసి ఆరు నెలలైనా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి, మున్సిపల్ శాఖ తక్షణమే సీరియస్ అయి, ఈ ఘరానా కుంభకోణంపై ఏసీబీ విచారణకు ఆదేశించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది!
(పరిశోధనాత్మక పాత్రికేయులు మీ. వి.జీ అందిస్తున్న పరిశోధనాత్మక కథనం.)

కుత్బుల్లాపూర్

రాష్ట్రంలో పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాణ్యమైన విధానాలను కొందరు అవినీతి అధికారులు తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో తిష్టవేసిన కొందరు అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి ‘బిల్డ్ నౌ’ వెబ్‌సైట్ పోర్టల్‌ను వేదికగా చేసుకుని అక్రమ అనుమతుల పర్వానికి తెరలేపారు. పారదర్శకత లోపించడాన్ని ఆసరాగా చేసుకుని, మార్ఫింగ్ చేసిన ఎల్ఆర్ఎస్ పత్రాలు, తప్పుడు ఆధారాలతో ఎలాంటి నాలా కన్వర్షన్, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి లేఅవుట్ అనుమతులు లేకపోయినా బరితెగించి భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేస్తున్నారు.

ఎల్.ఆర్.ఎస్-2020 నిబంధనలకు పాతర: కటాఫ్ తేదీ దాటినా అక్రమ అనుమతులు!
రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 131 (తేదీ: 31-08-2020) ద్వారా ప్రవేశపెట్టిన LRS-2020 నిబంధనల ప్రకారం, 26-08-2020 నాటికి నమోదైన హక్కులు/టైటిల్ కలిగిన ప్లాట్లకే క్రమబద్ధీకరణ మరియు భవన నిర్మాణ అనుమతులకు అర్హత ఉంటుంది. కానీ, కాజీగూడ గ్రామంలోని సర్వే నంబర్లు 10 మరియు 13లలో ఈ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి అనుమతులు మంజూరు చేశారు.

  • విక్రయ పత్రం (Sale Deed No.): 12957/2024 (లింక్డ్ AGPA నంబర్: 8159/2024, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం)
  • విక్రయ పత్రం (Sale Deed No.): 8251/2025
    కటాఫ్ తేదీ 26-08-2020 తర్వాత రిజిస్టర్ అయిన ఈ పత్రాల ఆధారంగా భవన నిర్మాణ అనుమతి ఏ విధంగా ఇచ్చారనేది ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది.

*థీము కింగ్స్ కోర్ట్ పేరుతో దందా.. ఖజానాకు కోట్లలో గండి!
కాజీగూడలోని సర్వే నంబర్లు 10, 13లలో ‘థీము కింగ్స్ కోర్ట్’ పేరుతో 6 అంతస్తులు, 8 టవర్లలో 100కు పైగా ఫ్లాట్లను అక్రమ పద్ధతిలో అనుమతులు పొంది నిర్మిస్తున్నారు. తప్పుడు పత్రాలతో అనుమతులు తెచ్చుకుని, అమాయక ప్రజలకు ఫ్లాట్లు అమ్మి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ ఖజానాకు చెల్లించాల్సిన ఫీజులు ఎగ్గొట్టి, మున్సిపల్ ఆదాయానికి కోట్లాది రూపాయల గండి కొడుతున్నారు.

*ఆరు నెలలు గడిచినా నిశ్శబ్దం.. అమ్ముడుపోయిన ఉన్నతాధికారులు?
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కుత్బుల్లాపూర్ జోన్, సర్కిల్ 60 పరిధిలోని సంబంధిత అధికారులకు పక్కా ఆధారాలతో వ్రాతపూర్వక ఫిర్యాదులు చేసి ఆరు నెలలు దాటినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆధారాలు కళ్లముందు ఉన్నా చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే ఉన్నత స్థాయి అధికారులు సైతం అక్రమార్కులతో చేతులు కలిపి కోట్లు మూటగట్టుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులపై స్పందించకపోవడం వల్ల ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకం సడలిపోయే ప్రమాదం ఏర్పడింది.

*సీఎం రేవంత్ రెడ్డి, మున్సిపల్ కార్యదర్శి తక్షణమే జోక్యం చేసుకోవాలి!
ఈ భారీ అవినీతి కుంభకోణంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మున్సిపల్ శాఖ కార్యదర్శి తక్షణమే దృష్టి సారించాలని బాధితులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

స్థానికులు మరియు బాధితుల ప్రధాన డిమాండ్లు:

  • వివాదాస్పద భవన నిర్మాణ అనుమతి చట్టబద్ధతను తక్షణమే పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే రద్దు చేయాలి.
  • విచారణ పూర్తయ్యే వరకు స్థలంలో జరుగుతున్న నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలి (స్టాప్ వర్క్ నోటీసు ఇవ్వాలి).
  • బిల్డ్ నౌ వెబ్‌సైట్ ద్వారా జరిగిన అక్రమాలు, సంబంధిత ఫైలు, ఎల్ఆర్ఎస్ రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలను సమగ్రంగా విచారించాలి.
  • ఆధారాలు ఇచ్చినా ఆరు నెలలుగా చర్యలు తీసుకోకుండా అక్రమార్కులకు సహకరించిన అధికారులపై నిఘా విభాగం (ఏసీబీ) చేత విచారణ జరిపించి శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
  • గత కొన్ని సంవత్సరాలలో కటాఫ్ తేదీ తర్వాత నమోదైన పత్రాల ఆధారంగా మంజూరు చేసిన భవన నిర్మాణ అనుమతులన్నింటినీ పునఃపరిశీలించాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments