Tuesday, October 27, 2026
Google search engine
Homeతెలంగాణజలమండలి @ ప్రైవేట్ లిమిటెడ్..

జలమండలి @ ప్రైవేట్ లిమిటెడ్..

  • జలమండలి ఎండి ఇష్టారాజ్య
    అవినీతికి పెద్ద పీట.. విచారణల ఊసేలేదు
  • చాలీచాలని జీతాలతో చాకిరీ.. అధికారుల ఇండ్లల్ల పాపాల సొమ్ముల కట్టలు
  • ​కాడి మోసేటోళ్ల కడుపుకొట్టి.. కూడబెట్టిన పాపాల సొమ్ము!
  • ​ఖైరతాబాద్‌ ఆఫీసల్ల ఏసీబీ దెబ్బకు.. బయటపడ్డ బండారం!
  • ​న్యాయం అడిగితే ఎస్మా అస్త్రం.. సిట్టింగ్ జడ్జితోని తేల్చాల్సిందే!
  • మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రెటరీ జయేష్ రంజన్ మున్సిపల్ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి…!

జలమండలిట్ల పెద్దోళ్ల పైసల వేట బాగనే సాగుతంది. రోజంతా రెక్కలాడితేగాని డొక్కాడని ఔట్‌సోర్సింగ్ కార్మికులకు చాలీచాలని కూలీ ఇచ్చి, సమాధానం అడిగితే ఎస్మా అస్త్రంతో గొంతు నొక్కుతున్నరు. ఆరుగురు పేదోళ్లు చచ్చిపోయినా ఏడ్చే దిక్కు లేదు కానీ, అధికారుల ఇండ్లల్ల మాత్రం లంచాల నోట్ల కట్టలు మూలుగుతున్నయి. ఖైరతాబాద్ ఆఫీసుల ఏసీబీకి దొరికిన సొమ్మే దీనికి అచ్చమైన సాక్ష్యం! టెండర్ల గోల్‌మాల్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి, ఆ లంచగొండుల చొక్కా పట్టుకోకపోతే పేదోళ్ల కన్నీళ్లే ఈ పాలకవర్గాన్ని ముంచెత్తడం ఖాయం!

హైదరాబాద్

హైదరాబాద్‌ నగరంల ప్రజలకు దప్పిక తీర్చే జలమండలి నిలువెల్లా అవినీతి కూపంలో కూరుకుపోయింది. ఒకపక్క రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసే ఔట్‌సోర్సింగ్ కార్మికులకు పొట్ట నిండేంత కూలి దక్కక, ఇండ్లు గడవక కన్నీళ్లు పెడుతుంటే.. ఇంకోపక్క పైస్థాయి అధికారులు మాత్రం కోట్ల రూపాయల అక్రమ సొమ్మును జేబుల్లో వేసుకుంటున్నారు. కంటిమీద కునుకు లేకుండా నగరానికి నీళ్లందించే పేద ఉద్యోగులు చచ్చిపోతున్నా పట్టించుకోని ఈ యాజమాన్యం, లంచాల రూపంలో వచ్చిన పాపాల సొమ్మును లెక్కలేకుండా దాచుకోవడంలో మునిగిపోయింది.

జలమండలి ఖైరతాబాద్ ఆఫీసుల ఏసీబీ దాడి.. బయటపడ్డ అసలు రంగు:
ఇటీవల ఖైరతాబాద్‌లోని జలమండలి ఆఫీసులో జాయింట్ డైరెక్టర్ ఏ. శ్రీనివాస్ వద్ద రూ.2.40 లక్షల లెక్కలు లేని నగదు లభించడం ఈ దోపిడీకి నిలువెత్తు నిదర్శనం. రాజ్‌భవన్ రోడ్డులో ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ సొమ్ము పట్టుబడింది. ఆ నగదుకు సరైన ఆధారాలు చూపలేక సదరు అధికారి నీళ్లు నమలడంతో ఏసీబీ దాన్ని స్వాధీనం చేసుకుంది. అధికారులు కాంట్రాక్టర్ల నుంచి, టెండర్ల పేరిట ఎంతెంత నొక్కుతున్నారో ఈ ఒక్క సంఘటనతో స్పష్టమవుతోంది. కిందిస్థాయి సిబ్బందికి ఇవ్వడానికి జీతాలు లేవనే పాలకులు, అధికారుల జేబులు నింపడానికి మాత్రం ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు.

ఆరుగురు కార్మికుల బలులు.. ఎస్మా అస్త్రంతో అణచివేత:
జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళన బాట పట్టిన కార్మికులపై ‘ఎస్మా’ చట్టాన్ని ప్రయోగించి అణచివేయడం యాజమాన్యం క్రూరత్వానికి పరాకాష్ఠ. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తూ, తీవ్ర మానసిక ఆందోళనతో ఆరుగురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. విధులు నిర్వహిస్తూ చనిపోయినవారి కుటుంబాలకు కనీస పరిహారం ఇవ్వడానికి మనస్సు రాని యాజమాన్యం, అవినీతి అధికారులను మాత్రం కాపాడుతూ వస్తోంది.

సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరపాల్సిందే!
జలమండలిలో జరుగుతున్న ఔట్‌సోర్సింగ్ నియామకాలు, కాంట్రాక్టు ఏజెన్సీల ఎంపిక, టెండర్ల కేటాయింపుల్లో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరుగుతున్నాయని స్పష్టమవుతోంది. ఈ దోపిడీ దందాపై వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.

  • టెండర్లలో గోల్‌మాల్: కాంట్రాక్టు ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేందుకు నిబంధనలను ఎలా నీరుగారుస్తున్నారో తేల్చాలి.
  • అధికారుల ఆస్తులపై నిఘా: అవినీతి అధికారుల ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, అక్రమాస్తులపై సమగ్ర దర్యాప్తు జరిపి వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలి.
  • కార్మికులకు న్యాయం: చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం అందించి, కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు చెల్లించాలి.

పాలనలో పారదర్శకత లేకపోతే, పేద కార్మికుల కన్నీటి చుక్కలే ఈ అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చేస్తాయి. జలమండలి ఉన్నతాధికారులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments