Wednesday, May 13, 2026
Google search engine
Homeతెలంగాణ'జైలు' శిక్షకే కాదు.. సంస్కరణకూ వేదిక కావాలి

‘జైలు’ శిక్షకే కాదు.. సంస్కరణకూ వేదిక కావాలి

చంచల్‌గూడలో ‘ఫీల్ ది జైల్’, మ్యూజియం ప్రారంభం
పరివర్తన దిశగా అడుగులు పడాలి: గవర్నర్ శివప్రతాప్ శుక్లా

హైదరాబాద్:

సమాజ అభ్యున్నతిలో శిక్షతో పాటు సంస్కరణ కూడా అంతే ముఖ్యమని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభిప్రాయపడ్డారు. జైళ్లు కేవలం నేరస్థులను బంధించే గదులు కాకుండా.. ఆత్మపరిశీలన, వ్యక్తిత్వ వికాసం, నూతన జీవితానికి నాంది పలికే పునరావాస కేంద్రాలుగా రూపాంతరం చెందాలని ఆయన ఆకాంక్షించారు. మంగళవారం హైదరాబాద్‌ చంచల్‌గూడలోని రాష్ట్ర కారాగార శిక్షణ సంస్థలో ‘ఫీల్ ది జైల్’ (జైలు అనుభవం) కార్యక్రమంతో పాటు ‘జైలు మ్యూజియం’ను ఆయన ప్రారంభించారు.

గతాన్ని తలపిస్తూ.. మార్పును చూపిస్తూ..
ప్రారంభోత్సవం అనంతరం గవర్నర్ మ్యూజియంలోని పలు విభాగాలను సందర్శించారు. నిజాం కాలం నాటి జైలు వ్యవస్థ, నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణంలో ఖైదీలు అందించిన శ్రమశక్తి, చారిత్రక నేపథ్యం ఉన్న దాశరథి, రామదాసులను బంధించిన జైలు గదుల నమూనాలను ఆయన ఆసక్తిగా తిలకించారు. ఖైదీల నైపుణ్యంతో తయారైన ఉత్పత్తులను, జైలు అభివృద్ధి పథాన్ని వివరించే ప్రదర్శనను పరిశీలించారు. ఖైదీల్లో సత్ప్రవర్తన పెంపొందించేందుకు రూపొందించిన ‘వాల్మీకి’ డాక్యుమెంటరీని ఈ సందర్భంగా ప్రదర్శించారు.

ప్రతీకారం నుంచి పరివర్తన వైపు..
సభలో గవర్నర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:

నైతిక బాధ్యత: తప్పు చేసిన వారిలో మార్పు తీసుకురావడం సమాజం యొక్క బాధ్యత. గతంలో తాను ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

కీలక అడుగు: మ్యూజియంలోని పాత సంకెళ్లు గత కఠిన వ్యవస్థకు గుర్తులైతే.. ఖైదీల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ‘ప్రతీకారం నుంచి పరివర్తన’ దిశగా సాగుతున్న మార్పుకు నిదర్శనాలని పేర్కొన్నారు.

యువతకు పాఠం: ‘ఫీల్ ది జైల్’ ద్వారా స్వేచ్ఛ విలువను, చట్టం పట్ల గౌరవాన్ని యువత తెలుసుకోవచ్చని, ఇది ఒక వినూత్న విద్యా కార్యక్రమమని కొనియాడారు.

కొత్త అధ్యాయం: సౌమ్య మిశ్రా
తెలంగాణ కారాగార శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. రాష్ట్ర కారాగార శాఖలో ఈ ప్రయోగాత్మక కార్యక్రమాలు ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయని పేర్కొన్నారు. శిక్షతో పాటు ఖైదీల పునర్నిర్మాణానికి తమ శాఖ అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రిజన్స్ ఐజీ ఎన్. మురళి బాబు, డి.ఐ.జి.లు డాక్టర్ డి. శ్రీనివాస్, ఎం. సంపత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments