- సర్ ప్రక్రియ పూర్తికాకుండా పదవుల భర్తీ లేదు!
- దక్షిణ భారతదేశంలో పట్టు నిలుపుకోవడమే లక్ష్యంగా ముందస్తు వ్యూహాలు.
- నామినేటెడ్ పదవుల ఆశావహులకు గట్టి షాకిచ్చిన అధిష్టానం.. ఓటర్ల నమోదుపైనే పూర్తి దృష్టి సారించాలని స్పష్టీకరణ
*హైదరాబాద్:
దక్షిణాది రాష్ట్రాలపై పట్టు సడలకుండా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కా వ్యూహాలతో ముందుకు వెళుతోంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ, కేరళలో అధికారంలో ఉండగా, తమిళనాడు ప్రభుత్వంలోనూ భాగస్వామ్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశమూ ఇవ్వకూడదని గట్టి పట్టుదలతో ఉంది. రాష్ట్రంలో ప్రతి రాజకీయ పరిణామాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలిస్తున్న అధిష్టానం, పార్టీ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసింది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలతో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు.
*కేసీ వేణుగోపాల్‌తో ముఖ్య నేతల భేటీ..
ఢిల్లీలో జరిగిన ఈ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, సమన్వయం, నిర్దేశిత లక్ష్యాల సాధనపై ఈ భేటీలో కూలంకషంగా చర్చించారు.
*’సర్’ ప్రక్రియే ప్రథమ ప్రాధాన్యం..
ఈ సమావేశంలో రాష్ట్రంలో కొనసాగుతున్న ‘సర్’ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ / సమగ్ర పరిశీలన) ప్రక్రియపైనే ప్రధానంగా చర్చ జరిగింది. సర్ ప్రక్రియ పట్ల కొందరు స్థానిక నాయకులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు అందిన ఫిర్యాదులపై కేసీ వేణుగోపాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ ఒక్క ఓటు కూడా నష్టపోకూడదని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంపైనే పూర్తి దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే వారి విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.
*నామినేటెడ్ పదవులపై స్పష్టత..
పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తున్న నామినేటెడ్ పదవులు మరియు పీసీసీ భర్తీ అంశంపై హైకమాండ్ తన వైఖరిని కుండబద్దలు కొట్టింది. రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాతే నామినేటెడ్ పదవుల భర్తీపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అప్పటి వరకు పదవుల ఆశావహులు కేవలం ఓటర్ల నమోదు మరియు పార్టీ బలోపేతంపైనే దృష్టి పెట్టాలని తేల్చిచెప్పారు.
*సంస్థాగత కార్యక్రమాలపై సమీక్ష..
తెలంగాణలో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేపట్టిన ‘సంఘటన్ సృజన్ అభియాన్’ (ఎస్ఎస్ఏ) కార్యక్రమాల పురోగతిని అధిష్టానం సమీక్షించింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ), మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల పనితీరు, పార్టీ విస్తరణ కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో సమన్వయ లోపాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రతిపక్షాల విమర్శలు, ఎదురవుతున్న న్యాయపరమైన సవాళ్లు, క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును మరింత పటిష్టం చేసుకోవడంపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. రాబోయే రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే పకడ్బందీ వ్యూహాలతో ముందుకు సాగుతోంది.



