Wednesday, November 4, 2026
Google search engine
Homeతెలంగాణనకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు.. రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం.

నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు.. రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం.

  • కుంట్లూరులో తయారీ కేంద్రం..
  • పోలీసులమంటూ బెదిరింపులు.

ఎల్బీనగర్,

నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తున్న ముఠా గుట్టును అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు రట్టు చేశారు. నలుగురు వ్యక్తులు కలిసి నిర్వహిస్తున్న నకిలీ నోట్ల తయారీ, పంపిణీ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ ముఠా నుంచి మొత్తం రూ.6.78 కోట్ల విలువైన నకిలీ 500 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పోలీసు గుర్తింపు కార్డులు, డమ్మీ పిస్టల్, వాకీటాకీలు, మొబైల్ ఫోన్లు కారు, నకిలీ నోట్ల తయారీ పరికరాలను సీజ్ చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన టీఎస్ 04 ఈవై 7291 నంబర్ గల మారుతి డిజైర్ కారును అడ్డగించి తనిఖీ చేయగా, కారు డిక్కీలోని బూడిద రంగు బ్యాగులో 16 కట్టల నకిలీ రూ.500 నోట్లు లభించాయి. వీటి విలువ రూ.8 లక్షలుగా గుర్తించారు. అదేవిధంగా డమ్మీ పిస్టల్, రెండు వాకీటాకీలు, మూడు నకిలీ పోలీసు ఐడీ కార్డులు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

కుంట్లూరులో నకిలీ నోట్ల తయారీ

నిందితులను విచారించగా హయత్నగర్ మండలం కుంట్లూరులోని ఓ అద్దె ఇంట్లో నకిలీ కరెన్సీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. అసలు కరెన్సీ నోట్ల చిత్రాలను కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా రూపొందించి కలర్ ప్రింటర్లు, లేజర్ ప్రింటర్, ఎప్సన్ ప్రింటర్ కమ్ స్కానర్, ల్యాప్టాప్, లామినేషన్ యంత్రం, కరెన్సీ కటింగ్ మెషీన్, ఏ4 సైజు కాగితాలతో నకిలీ నోట్లను ముద్రిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

రూ.6.70 కోట్ల నకిలీ నోట్లు పట్టివేత

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 1న రాత్రి 8 గంటల సమయంలో మారుతి డిజైర్ కారులో నలుగురు వ్యక్తులు నకిలీ కరెన్సీ నోట్లను విజయవాడకు తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన ఎస్ఐ, పోలీసు సిబ్బంది, పంచులు, క్లూస్ టీమ్ తో కలిసి రాత్రి 10.15 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీ ప్రధాన గేటు ఎదురుగా ఉన్న బాలాజీ డాబా సమీపంలో జాతీయ రహదారి 65పై వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో దొరికిన నిందితులు ఇచ్చిన సమాచారంతో కుంట్లూరులోని అద్దె ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.6.70 కోట్ల విలువైన 134 కట్టల నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ తయారీకి ఉపయోగించిన ప్రింటర్లు, ల్యాప్టాప్, లామినేషన్, కటింగ్ యంత్రాలు, ఇతర సామగ్రిని సీజ్ చేశారు. వాహనంలో పట్టుబడిన రూ.8 లక్షలతో కలిపి మొత్తం రూ.6.78 కోట్ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

పోలీసులుగా నటిస్తూ బెదిరింపులు

నిందితులు నకిలీ పోలీసు గుర్తింపు కార్డులు, డమ్మీ పిస్టల్, వాకీటాకీలను ఉపయోగించి పోలీసు సిబ్బందిగా నటిస్తూ కొనుగోలుదారులను, ఇతర వ్యక్తులను బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ ముఠా వెనుక ఉన్న నకిలీ కరెన్సీ తయారీ, పంపిణీ నెట్ వర్క్ ను గుర్తించడంతో పాటు ఇతర సహచరుల ప్రమేయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నిందితుల నేర చరిత్ర.

కేసు (క్రైమ్ నంబర్ 89/2016) ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో నిందితుడు మడుపోజు A-1 కరుణాకర్ పై తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో 2024లో ఐపీసీ 420, ఐటీ చట్టంలోని 66(సి), 66(డి) సెక్షన్ల కింద కేసు నమోదైంది. A-2 చిన్నోళ్ల మాణిక్య రెడ్డిపై ఎస్ఆర్ నగర్ పోలీస్టేషన్లో 2016లో హత్య అలాగే 2026లో నంబర్ 236/2026 కింద మరో కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ లోని ముడివీడు పోలీస్టేషన్లోనూ క్రైమ్ నంబర్ 03/2026 కింద కేసు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments