- నిజాంపేట్, పేట్ బషీరాబాద్ జాగలు ఇయ్యండి JNJHS..
- అమరుల ఆత్మలకు శాంతి కలిగించండి సారూ
హైదరాబాద్
“సలహాలిచ్చే కోటరీ మాటలు నమ్మి గోతిల పడకురి సీఎం సార్! నాడు బీఆర్ఎస్ సర్కారును నిండా ముంచింది ఈ కోటరీ సలహాగాళ్లే. ఇయ్యాల మిమ్మల్ని కూడా అట్లే అభాసుపాలు చేసేటట్టు ఉన్నారు” అని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల సొసైటీ (JNJHS) సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, రెండు దశాబ్దాలుగా నలిగిపోతున్న పత్రికా విలేకరుల మనోవేదనను తీర్చాలని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వేదికగా టీమ్ JNJ నిర్వహించిన మహాధర్నా ఉద్విగ్న భరితంగా సాగింది.
నిజాంపేట్, పేట్ బషీరాబాద్ జాగాలే కావాలి!
సొసైటీ సభ్యులు స్వయంగా రూపాయి రూపాయి కూడబెట్టి డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన నిజాంపేట్, పేట్ బషీరాబాద్ భూములను మాత్రమే తమకు కేటాయించాలని మహాధర్నాలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ రెండు ప్రాంతాల్లో న్యాయపరమైన చిక్కులు లేవని, ప్రభుత్వానికి పూర్తి వెసులుబాటు ఉన్నందున పాత నిర్ణయాన్ని పునరాలోచించి కొత్త ఉత్తర్వులు విడుదల చేయాలని స్పష్టం చేశారు.
సొసైటీ డైరెక్టర్లు పి.వి.రమణారావు, కె.అశోక్ రెడ్డి మాట్లాడుతూ— “ఈ పోరాటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నది కాదు. తమకు జరిగిన అన్యాయాన్ని, బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికే ధర్నా చేపట్టాం. ముఖ్యమంత్రి సూచన మేరకే న్యాయ సలహాలు తీసుకొని ప్రభుత్వానికి అందజేశాం. సొసైటీ మీద కొందరు గిట్టనివాళ్లు చేసే దుష్ప్రచారాన్ని సీఎం నమ్మొద్దు. ప్రజాస్వామ్యంలో ఒత్తిడి తేవడం సహజం, మా జాగాల కోసం ఒత్తిడి తెస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు” అని స్పష్టం చేశారు.
వీధుల పాలు చేయడం సిగ్గుచేటు:ఎం.వి.ఆర్.శాస్త్రి
“అన్ని అర్హతలు ఉండి, సొంత డబ్బులు చెల్లించి 20 ఏళ్లుగా నిరీక్షిస్తున్న జర్నలిస్టులను ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి చివరికి వీధుల పాలు చేయడం ప్రభుత్వానికి తీవ్ర సిగ్గుచేటు” అని ఆంధ్రభూమి మాజీ సంపాదకులు ఎం.వి.ఆర్.శాస్త్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వయోభారంతో అవసాన దశలో ఉన్న విలేకరులు అల్లాడిపోతున్నారని, జర్నలిస్టుల సంక్షేమం చూడాల్సిన బాధ్యత సర్కారుపైనే ఉందన్నారు. జే.ఎన్.జే.హెచ్.ఎస్ సభ్యుల పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.
కలసికట్టుగా కొట్లాడుదాం:
తెలంగాణ హౌస్ ఫెడ్ ఉపాధ్యక్షులు గోపరాజు బ్రహ్మానందబేరి మాట్లాడుతూ జే.ఎన్.జే సభ్యులకు స్థలాలు దక్కితేనే మిగిలిన సొసైటీల బాధితులకు ఆశలు చిగురిస్తాయని, విలేకరులకు ఇంటి రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య ఐక్య పోరాటానికి పిలుపునివ్వగా, ఉపాధ్యక్షులు రాజశేఖర్ JNJ సభ్యులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రక్షణ సేన మీడియా విభాగం అధ్యక్షుడు మహేంద్ర రెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. జర్నలిస్టులకు కనీసం 150 గజాల స్థలం కూడా ఇవ్వకపోవడం దారుణమని మామిడి సోమయ్య మండిపడ్డారు.
ముండ మోసినాక ఇచ్చే స్థలాలు మాకొద్దు!
ధర్నాలో పాల్గొన్న ఒక సభ్యుడి సతీమణి రమ పడ్డ కడుపుకోత సభను కంటినీరు పెట్టించింది. “ముండ మోసిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే స్థలాలు మాకేం అవసరం? పాతికేళ్ల నుంచి కుటుంబ సభ్యులం ఎంత నరకం చూస్తున్నామో సర్కారుకు తెలుసా?” అని ఆమె తెలంగాణ యాసలో నిలదీశారు.
సభలో తాత శ్రీనివాసరావు, రామచంద్రరావు, అస్మా అంజుం, శివరామకృష్ణ, డి.వెంకటేశ్వర్లు, సముద్రాల సురేందర్, శ్రీదేవి తదితరులు ప్రసంగించారు.
ఇందిరా పార్క్ వద్ద మిన్నంటిన నినాదాలు:
- “మాట తప్పకురి.. మడమ తిప్పకురి.. మా జాగలు మాకియ్యురి!”
- “మాది ఆశ కాదు.. రెండు దశాబ్దాల ఆక్రోశం!”
- “ముఖ్యమంత్రి గారు.. ప్రాణం పోశారు, వాటిని తీయకురి!”
- “మేము డబ్బులు కట్టిన నిజాంపేట్, పేట్ బషీరాబాద్ జాగాలే మాకు కావాలి!”
- “చనిపోయిన సభ్యుల ఆత్మలకు శాంతి చేకూర్చాలి.. 1000 మంది జర్నలిస్టుల కుటుంబాల ఘోష వినాలి!”



