ఎల్బీనగర్
మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకుని ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని ఎల్బీనగర్ జోన్ డిసిపి డా. బి.అనూరాధ అన్నారు. చైతన్యపురిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా న్యాయ కళాశాల, ఇబ్రహీంపట్నం డిగ్రీ కళాశాల సంయుక్తంగా ధీరా – మహిళా భద్రత ఆత్మరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ హాజరై విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. భయం వద్దని ధైర్యంగా ఉండాలన్నారు. ప్రతి అమ్మాయి ధీరా కావాలన్నారు. ఆపదలో ఉంటే వెంటనే 100,112, షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490617444 కు ఫిర్యాదు చేయాలన్నారు. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో పరిచయాలు, ఫోటోలు షేర్ చేయడం ప్రమాదకరమని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు,ఈవ్ టీజింగ్ జరిగితే ధైర్యంగా పోలీసులకు చెప్పాలని మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ డీసీపీ టి. ఉషారాణి షీ టీమ్స్ పనితీరు భరోసా కేంద్రాల సేవల గురించి వివరించారు. అనంతరం ఇంటర్నేషనల్ కోచ్ హన్షి వసంత్ కుమార్ చేత విద్యార్థినులకు ప్రత్యక్షంగా కరాటే మెళకువలు, సులభమైన ఆత్మరక్షణ పద్ధతులు నేర్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాలల ప్రిన్సిపాల్స్ డా. ఎం.మానస, డా.హెచ్. రాధిక అతిథులకు స్వాగతం పలికి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



