ఆదికవి రామాయణ బోధనలు నేటికీ ఆదర్శప్రాయం: డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య
బడంగ్‌పేట్
సాహిత్య చరిత్రలో రామాయణ కావ్యంతో మహర్షి వాల్మీకి ఆదికవిగా చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్నారని GHMC బడంగ్‌పేట్ సర్కిల్–16 డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య అన్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా బడంగ్‌పేట్ సర్కిల్-16 కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ధర్మాచరణకు నిదర్శనం రామాయణం:
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య మాట్లాడుతూ, సంస్కృత సాహిత్యంలో తొలి కావ్యంగా గుర్తింపు పొందిన రామాయణం సమాజానికి ధర్మం, సత్యం, నీతి, మానవతా విలువలను అందించిన పరమ పవిత్ర గ్రంథమని కొనియాడారు. వేద ప్రమాణాల ప్రకారం మానవ జీవితంలో ఆచరించాల్సిన ధర్మాచరణను వాల్మీకి మహర్షి తన రచన ద్వారా లోకానికి చాటిచెప్పారని వివరించారు. ఆయన బోధించిన సూక్తులు, చూపిన మార్గం కాలాతీతమైనవని, నేటి ఆధునిక సమాజానికి ఎంతో ఆదర్శప్రాయమని తెలిపారు.
ఈ వేడుకల్లో సూపరింటెండింగ్ ఇంజనీర్ డి. కిష్టప్ప, డిప్యూటీ ఇంజనీరింగ్ అధికారులు కే. హరిణి, బి. రూపతో పాటు కార్యాలయ సిబ్బంది, ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ మహర్షి వాల్మీకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన అందించిన మార్గదర్శకాలను స్మరించుకున్నారు.



