- ప్రతి శుక్రవారం ఐదు ప్రదేశాల్లో నిల్వ నీటిని తనిఖీ చేయాలి..
- దోమల నివారణపై విద్యార్థులకు అవగాహన..
- చెక్ 5 పోస్టర్ ఆవిష్కరించిన డిప్యూటీ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్
ఎల్బీనగర్
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దోమల నివారణకు ‘చెక్ 5 – ప్రతి శుక్రవారం’ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దోమలు కుట్టిన తర్వాత వచ్చే వ్యాధుల కంటే, దోమలు వృద్ధి చెందడానికి అనువైన ప్రదేశాలను ముందుగానే గుర్తించి అరికట్టడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ప్రచార పోస్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి శుక్రవారం ఇంటి పరిసరాల్లో ఐదు ప్రదేశాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచిస్తున్నారు. నీటి నిల్వ చేసే బకెట్లు, డ్రమ్ములు, ట్యాంకులు, పూలకుండీల కింద ఉండే నీరు, కూలర్లు మరియు ఫ్రిజ్ ట్రేలు, పాత టైర్లు, ఇతర నీరు నిలిచే వస్తువులపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొంటున్నారు. అదే విధంగా దోమల నివారణకు మూడు ముఖ్యమైన చర్యలను పాటించాలని సూచిస్తున్నారు. నిల్వ ఉన్న నీటిని తొలగించడం (క్లియర్), నీరు నిలిచే ప్రదేశాలను శుభ్రం చేయడం (క్లీన్), నీటి పాత్రలను మూతలతో కప్పి ఉంచడం (కవర్) ద్వారా దోమల వృద్ధిని అరికట్టవచ్చని వివరిస్తున్నారు.ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి ఐదు ప్రదేశాలను తనిఖీ చేసి, మూడు ముఖ్యమైన చర్యలను పాటించడం ద్వారా దోమల వ్యాప్తిని తగ్గించవచ్చని, ప్రజల భాగస్వామ్యంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చని మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రచారం చేస్తోంది. ఈ కార్యక్రమంలో సరూర్నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషన్ సిహెచ్ శ్రీకాంత్, శానిటేషన్ డిఈ చందన, ఎంటమాలజి ఏఈ రాంబాబు, సూపర్ వైజర్ అర్జున్, ఎంటమాలజీ సిబ్బంది పాల్గొన్నారు.


