Friday, November 27, 2026
Google search engine
Homeతెలంగాణవరుసగా నాలుగోసారి ఆల్‌ ఇండియా పోలీస్‌ డ్యూటీ మీట్‌ ఛాంపియన్‌షిప్‌ లక్ష్యం

వరుసగా నాలుగోసారి ఆల్‌ ఇండియా పోలీస్‌ డ్యూటీ మీట్‌ ఛాంపియన్‌షిప్‌ లక్ష్యం

  • పోలీసుల వృత్తి నైపుణ్యాలకు డ్యూటీ మీట్‌ వేదిక
  • తెలంగాణ పోలీసు అకాడమీలో నాలుగు రోజులపాటు 3వ రాష్ట్రస్థాయి పోటీలు
  • 16 జోనల్‌, ప్రత్యేక విభాగాల నుంచి 421 మంది పోలీసుల ప్రతిభ
  • రెండో ఏడాది కూడా ఆల్‌రౌండర్‌ ఛాంపియన్‌షిప్‌ కైవసం చేసుకున్న సైబరాబాద్‌ కమిషనరేట్‌
  • ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో మూడు విజయాలు.. నాలుగోసారి లక్ష్యం!
  • క్రీడల్లో రాణించిన విజేతలకు ఇంక్రిమెంట్లు, అవార్డులు : డిజిపి
  • విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన డిజిపి

హైదరాబాద్‌:

పోలీసు డ్యూటీ మీట్‌లు, క్రీడలు, బ్రాస్‌ బ్యాండ్‌ వంటి కార్యక్రమాలు సిబ్బందిలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమష్టి భావనను పెంపొందిస్తాయని డిజిపి సి వి ఆనంద్‌ అన్నారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణతో సమయం వృథా అవుతుందనే భావన సరికాదని, ఇవి పోలీసు శాఖ ప్రతిష్ఠను పెంచే అంశాలని స్పష్టం చేశారు. ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రోత్సాహకంగా ఇంక్రిమెంట్లు, అవార్డులు అందించే అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.

తెలంగాణ పోలీసు అకాడమీలో నవంబరు 23 నుంచి 26 వరకు నాలుగు రోజులపాటు నిర్వహించిన 3వ తెలంగాణ పోలీసు డ్యూటీ మీట్‌ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తక్కువ సమయంలోనే సమర్థంగా పోటీలను నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలతోపాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

క్షేత్రస్థాయి విధులకు ఎంతో ఉపయోగం

రాష్ట్రంలోని 16 జోనల్‌, ప్రత్యేక విభాగాలకు చెందిన 421 మంది అధికారులు, సిబ్బంది ఆరు విభాగాల్లో 21 ఈవెంట్లలో పాల్గొన్నారని డిజిపి వివరించారు. శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులు, యాంటీ సబోటేజ్‌ తనిఖీలు, డాగ్‌ స్క్వాడ్‌, ఐటీ నైపుణ్యాలు, పోలీసు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంశాల్లో నిర్వహించిన పోటీలు పోలీసుల వృత్తి నైపుణ్యాలను వెలికితీసేందుకు దోహదపడ్డాయన్నారు.

పోలీసు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ విభాగాల్లో నేర్చుకున్న నైపుణ్యాలు నిత్యం నిర్వహించే విధుల్లో, ముఖ్యంగా నేర దర్యాప్తు, కీలక ఆధారాల సేకరణలో ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయా విభాగాల్లో మరింత నైపుణ్యం సాధించాలని సూచించారు. మొత్తం 63 మంది విజేతలకు 21 స్వర్ణ, 21 రజత, 21 కాంస్య పతకాలను అందజేసి అభినందించారు.

ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించిన సైబరాబాద్‌ కమిషనరేట్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు. శాస్త్రీయ దర్యాప్తు విభాగంలో వ్యక్తిగత ఛాంపియన్‌షిప్‌ సాధించిన సైబరాబాద్‌కు చెందిన ఎస్‌ఐ ఆర్‌.ప్రేమ్‌సాగర్‌ను అభినందించారు.

మూడు విజయాలు.. నాలుగోసారి లక్ష్యం!

గత మూడేళ్లుగా ఆల్‌ ఇండియా ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ను సాధించిన తెలంగాణ పోలీసు.. ఈసారి కూడా అదే విజయపరంపరను కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రస్థాయి డ్యూటీ మీట్‌లో ప్రతిభ చాటిన విజేతలతో పాటు అన్ని బృందాలు సమష్టిగా కృషి చేసి ముంబయిలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో మరోసారి ఛాంపియన్‌షిప్‌ సాధించాలని డీజీపీ ఆకాంక్షించారు.

డ్యూటీ మీట్‌లపై ఆసక్తి తగ్గడం బాధాకరం

గతంతో పోలిస్తే పోలీసు డ్యూటీ మీట్‌లపై సిబ్బందిలో ఆసక్తి తగ్గుతోందని డిజిపి ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు శాఖాపరంగా తగిన ప్రోత్సాహం లేకపోవడం, పోటీలకు సిద్ధమయ్యే సమయంలో కుటుంబాలకు దూరంగా ఉండాల్సి రావడం, విజేతలకు తగిన గుర్తింపు లభించకపోవడం వంటి కారణాలున్నాయని పేర్కొన్నారు.

పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి శాఖ తరఫున సరైన గుర్తింపు, ప్రోత్సాహకాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విజేతలకు ఇంక్రిమెంట్లు, అవార్డులు అందించే అంశాన్ని పరిశీలిస్తానని తెలిపారు. చిన్నచిన్న యూనిట్లు విడివిడిగా కాకుండా పెద్ద బృందాలుగా ఏర్పడి పోటీల్లో పాల్గొంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు.

బ్రాస్‌ బ్యాండ్‌లోనూ తెలంగాణ ప్రతిభ

ఆల్‌ ఇండియా పోలీస్‌ బ్రాస్‌ బ్యాండ్‌ పోటీల్లో తెలంగాణ పోలీసు రెండో స్థానం సాధించడం గర్వకారణమని డీజీపీ పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో దేశంలోని పలు పోలీసు బలగాలు పాల్గొన్నాయని, తెలంగాణ నుంచి తక్కువ సంఖ్యలో సిబ్బంది పాల్గొన్నప్పటికీ రజత పతకం సాధించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పోలీసు శాఖ ప్రతిష్ఠను పెంచుతాయని, వాటికి తప్పనిసరిగా ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

క్రీడలకు ముందస్తు ప్రణాళిక అవసరం

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న 5వ తెలంగాణ పోలీసు స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ను ఈసారి క్లస్టర్లుగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. దీనివల్ల వివిధ ప్రాంతాల్లోని పోలీసు క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభిస్తోందన్నారు. క్రికెట్‌లో 21 జట్లు పాల్గొంటున్నాయని వివరించారు. ఈ నెల 28న నిజామాబాద్‌లో ముగింపు వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆల్‌ ఇండియా పోలీసు క్రీడల క్యాలెండర్‌కు ముందుగానే రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహిస్తే ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి జాతీయస్థాయి పోటీలకు సిద్ధం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. క్రీడల నిర్వహణతోపాటు అవసరమైన వనరులను సమీకరించి భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.

పోలీసు శాఖలో నిర్వహించే డ్యూటీ మీట్‌లు, క్రీడలు, బ్రాస్‌ బ్యాండ్‌ వంటి కార్యక్రమాలన్నీ సిబ్బందిలో ప్రతిభను వెలికితీయడంతోపాటు శాఖకు గర్వకారణంగా నిలుస్తాయని డిజిపి పేర్కొన్నారు. వీటి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని, నిరంతరం ప్రోత్సాహం అందిస్తూ ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు.

డ్యూటీ మీట్‌ చైర్మన్ హైదరాబాద్ సిపి మహేశ్‌ భగవత్‌…

డ్యూటీ మీట్‌కు మహేశ్‌ భగవత్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని 16 జోనల్‌, ప్రత్యేక విభాగాల బృందాలకు చెందిన 421 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. ఆరు విభాగాల్లో మొత్తం 21 ఈవెంట్లు నిర్వహించినట్లు వివరించారు. శాస్త్రీయ దర్యాప్తు, యాంటీ సబోటేజ్‌ తనిఖీలు, డాగ్‌ స్క్వాడ్‌, ఐటీ నైపుణ్యాలు, పోలీసు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంశాల్లో పోటీలు నిర్వహించామన్నారు. తక్కువ సమయంలో సమర్థవంతమైన సమన్వయంతో పోటీలను నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేశారని అభినందించారు.
విశ్రాంతి లేకుండా నిరంతరం కష్టపడే వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అన్నారు

ఆరు విభాగాల్లో పోటీలు….

తెలంగాణ పోలీసు అకాడమీలో నవంబరు 23 నుంచి 26 వరకు నాలుగు రోజులపాటు నిర్వహించిన 3వ తెలంగాణ పోలీసు డ్యూటీ మీట్‌–2026 గురువారం ముగిసింది. రాష్ట్రంలోని 16 జోనల్‌, ప్రత్యేక విభాగాలకు చెందిన 421 మంది అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. ఆరు విభాగాల్లో మొత్తం 21 పోటీలు నిర్వహించారు. శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులు, విధ్వంస నిరోధక తనిఖీలు, డాగ్‌ స్క్వాడ్‌, ఐటీ నైపుణ్య పరీక్ష, పోలీసు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ విభాగాల్లో పోటీలు జరిగాయి.

63 మందికి పతకాలు..

వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి మొత్తం 63 పతకాలు అందజేశారు. 21 స్వర్ణం, 21 రజతం, 21 కాంస్య పతకాలు విజేతలు సాధించారు. పతకాలు సాధించిన వారితోపాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ డీజీపీ పథకాలు అందించి అభినందించారు. పతకం సాధించడం గొప్ప విజయమే అయినప్పటికీ, పోటీల్లో పాల్గొనడం ద్వారా లభించే అనుభవం, నేర్చుకునే నైపుణ్యాలు కూడా ఎంతో విలువైనవని పేర్కొన్నారు. వివిధ కమిషనరేట్లు, జిల్లాలు, ప్రత్యేక విభాగాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందిస్తుందన్నారు.

పోలీసు డ్యూటీ మీట్‌లో సైబరాబాద్‌ కమిషనరేట్‌ కు ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీ

3వ తెలంగాణ పోలీసు డ్యూటీ మీట్‌–2026లో సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ సత్తాచాటింది. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచి ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. వరుసగా రెండో ఏడాది ఆల్‌రౌండర్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించి తన ఆధిపత్యాన్ని చాటింది.

విభాగాల వారీగా విజేతలు

  • శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులు: విజేత – సైబరాబాద్‌; ద్వితీయ స్థానం – హైదరాబాద్‌; హార్డ్‌లైనర్‌ ట్రోఫీ – సైబరాబాద్‌.
  • యాంటీ సబోటేజ్‌ తనిఖీలు: విజేత – ఐఎస్‌డబ్ల్యూ; ద్వితీయ స్థానం – సైబరాబాద్‌.
  • ఐటీ నైపుణ్య పోటీలు: విజేత – టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో; ద్వితీయ స్థానం – హైదరాబాద్‌.
  • డాగ్‌ స్క్వాడ్‌ పోటీలు: విజేత – సీఐడీ; ద్వితీయ స్థానం – యాదాద్రి.
  • పోలీసు వీడియోగ్రఫీ: విజేత – రాజన్న సిరిసిల్ల (జోన్‌–3); ద్వితీయ స్థానం – సీఐడీ.
  • పోలీసు ఫొటోగ్రఫీ: విజేత – సైబరాబాద్‌; ద్వితీయ స్థానం – మల్కాజిగిరి.

వ్యక్తిగత ఛాంపియన్‌షిప్‌ లో
శాస్త్రీయ దర్యాప్తు పద్ధతుల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సైబరాబాద్‌ కమిషనరేట్‌కు చెందిన ఎస్‌ఐ ఆర్‌.ప్రేమ్‌సాగర్‌ వ్యక్తిగత ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీని అందుకున్నారు.

ముంబయి జాతీయ పోటీలకు సన్నద్ధత

డిసెంబరు 15 నుంచి 20 వరకు ముంబయిలో రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) ఆధ్వర్యంలో ఆల్‌ ఇండియా పోలీస్‌ డ్యూటీ మీట్‌ జరగనుంది. గత మూడేళ్లుగా వరుసగా ఆల్‌ ఇండియా ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ను తెలంగాణ పోలీసు కైవసం చేసుకోవడం గర్వకారణమని డీజీపీ పేర్కొన్నారు. ఈ విజయపరంపరను కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ను తెలంగాణకు తీసుకురావాలని ఆకాంక్షించారు.

న్యాయనిర్ణేతలు, నిర్వాహకులకు అభినందనలు

పోటీలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించి విజేతలను ఎంపిక చేసిన 15 మంది న్యాయనిర్ణేతలను డీజీపీ అభినందించారు. డ్యూటీ మీట్‌ ఛైర్మన్‌, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, సీఐడీ డీజీ చారుసిన్హా, నోడల్‌ అధికారి, హైదరాబాద్‌ క్రైమ్స్‌ అండ్‌ ఎస్‌ఐటీ అదనపు కమిషనర్‌ ఎం.శ్రీనివాసులు, సమన్వయకర్తలు, నిర్వాహక బృందం నాలుగు రోజులపాటు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రశంసించారు.

ఈ ముగింపు కార్యక్రమంలో టీజీపీఏ డైరెక్టర్ శ్రీమతి అభిలాష బిష్త్, ఐపిఎస్, డీజీ (సీఐడీ) శ్రీమతి చారు సిన్హా,ఐపిఎస్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. రమేష్, ఐపీఎస్; శ్రీ యం.శ్రీనివాసులు,ఐపిఎస్ అడిషినల్ సిపి క్రైం ఆండ్ సెట్, అడిషనల్ సీపీ (లా అండ్ ఆర్డర్) శ్రీ తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్; డీఐజీ (సీఐడీ) శ్రీ నారాయణ నాయక్, ఐపీఎస్; డీసీపీలు శ్రీ ఆర్. వెంకటేశ్వర్లు, ఐపీఎస్ (సీఏఆర్), శ్రీ కిరణ్ ఖారే, ఐపీఎస్ (చార్మినార్ జోన్), శ్రీ శ్రీనివాస్, ఐపీఎస్ (రాజేంద్రనగర్ జోన్),, శ్రీ అరవింద్ బాబు, ఐపీఎస్ (ఎస్‌ఎంఐటీ – SMIT), శ్రీ చైతన్య కుమార్, ఐపీఎస్ (డీడీ), శ్రీమతి లావణ్య నాయక్, ఐపీఎస్ (ఉమెన్ సేఫ్టీ వింగ్), మరియు శ్రీమతి కె. వెంకటలక్ష్మి (అడ్మిన్); శ్రీ. ఎ.రమణా రెడ్డి డిసిపి జూబిలీహిల్స్, శ్రీమతి పుష్ప డిసిపి, 1వ మరియు 8వ బెటాలియన్ కమాండెంట్లు; విశ్రాంత పోలీసు అధికారులు శ్రీ ప్రతాప్, శ్రీ రామకృష్ణ, మరియు శ్రీ పుర్ణచందర్,; ఇతర సీనియర్ పోలీసు అధికారులు, న్యాయనిర్ణేతలు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments