- జలమండలి సిబ్బంది తీరే సపరేటు
- వారిని కలిస్తే ఒక రేటు… కలవకుంటే మరో రేటు
- కొత్తగా నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తుదారులు గగ్గోలు
- డిజీఎంపై సీజీఎంకు ప్రజావాణిలో పిర్యాదు
ఎల్బీనగర్:
ఎల్బీనగర్ నియోజకవర్గంలో జలమండలి అధికారుల తీరు అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది చెప్పిందే వేదం అన్నట్లుగా ఉంది. అధికారులు ఫీల్డ్ కు వెళ్లి నిశితంగా పరిశీలించకుండానే కార్యాలయంలో కూర్చుని దరఖాస్తులు తిరస్కరిస్తున్నారు. జలమండలి నిబంధనల ప్రకారం జీఎం పరిశీలించి దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా కూడా డిజీఎం ఏది చూడకుండా దరఖాస్తును తిరస్కరిస్తున్నారు.కొత్త నల్లా కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేస్తే అనుమతుల మంజూరులో అధికారులను కలిస్తే ఒక రేటు, లేకుంటే మరో రేటు అన్న చందంగా ఉంది అధికారుల తీరు. దీంతో వినియోగదారులు అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిబంధలనకు విరుద్ధంగా అడ్డగోలుగా కొత్తగా కనెక్షన్ల కోసం అప్లై చేసే దరఖాస్తుదారుపై, తికమక లెక్కలు వేసీ అదనపు భారం మెపుతున్నారని పలువురు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో అధికారులు కీలు బొమ్మలుగా మారారని, వాళ్ళు ఏది చెప్పినా, చేసినా అడ్డూ అదుపు లేకుండా పోతుందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని జలమండలి 5 వ డివిజన్లో రోజు జరుగుతున్న అవినీతి తంతూపై పలువురు గుసగుసలాడుకోవడం గమనార్హం!
నిబంధనలకు విరుద్ధంగా రేట్లు..
- ఒక అపార్టుమెంటుకు నల్లా కనెక్షన్ కావాలంటే అక్కడ దగ్గరలో పైప్ లేకున్నా సుమారుగా 35 మీటర్ల వరకు ఉన్న పైపు లైన్ల వద్ద నుంచి కొత్తగా నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు బోర్డు నిబంధనలు ఉన్నాయి. కానీ ఈ డివిజన్ జనరల్ మేనేజర్ ఏకంగా అపార్టుమెంటు వాసి తనను కలవలేదనే కారణంతో నీటి కనెక్షన్ పై అదనంగా ఫీజులు వేయడంపై ఆశ్చర్యం వ్యక్తమయ్యింది. ఆప్కో కాలనీలో ఒక అపార్టుమెంటు వాసి నీటి కనెక్షన్ కోసం దరఖాస్తు నెంబర్ 2025-11-1069కు ఏకంగా రూ.3 లక్షల 54 వేల రూపాయలు ఫీజును వేయడంపై అవాక్కయ్యాడు. తన ఇంటికి సుమారుగా 26 మీటర్ల సమీపంలో ఉన్న పైపు లైన్ల నుంచి కొత్త కనెక్షన్ ఇవ్వకుండా సదరు దరఖాస్తుదారుడు తనను కలవలేదని నెపంతో కావాలనే అదనంగా ఫీజును విధించారని, అంత డబ్బులు కట్టలేక తరువాత పైపు లైన్ వేసినప్పుడు దగ్గరగా వేస్తే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని అనుకున్నాడు. 8 నెలల తర్వాత దగ్గరలోనే ఉన్న 8 మీటర్ల దూరంలోని పైపు లైన్ నుండి పక్కనే ఉన్న వేరే భవనానికి కొత్తగా నీటి కనెక్షన్ ఇవ్వడంతో మళ్ళీ గత నెలలో (2026-8-2246) దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే ఈ సారి కూడా దరఖాస్తుదారుడు సదరు డివిజన్ మేనేజర్ కూడా అయిన డిజీఎంను కలవలేదనే నెపంతో, ఫీల్డ్ పరిశీలన చేయకుండానే, పాత ఫీజు 3 లక్షలు కట్టాలని తను చేసిన దరఖాస్తును రిజెక్ట్ చేశారు. జలమండలి అధికారులు వారికి ఇష్టం వచ్చినట్లు రుసుములు వేస్తే అది కట్టలేకపోయిన వారు, ఇంకొక సారి నీటి కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారి ఫైల్స్ కూడా నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నారు. సహారా మెయిన్ రోడ్డు వద్ద రెండు బహుళ అంతస్తులకు మాత్రం సమీపంలో పైప్ లైన్లు లేకున్నా ఎలాంటి ఫీజులు విధించకుండా కొత్తగా నల్లా కనెక్షన్లు ఇచ్చారని తెలుస్తోంది. అంటే ఈ అధికారిని కలిస్తే ఒక రేటు కలవకుంటే మరో రేటా? అని పలువురు స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఔట్ సోర్సింగ్ సిబ్బంది హవా..
జలమండలి పాత డివిజన్-11లో ఉద్యోగుల కంటే అవుట్ సోర్సింగ్ కింద పనిచేసే వారిదే పెత్తనం ఉందని పలువురు వాపోతున్నారు. కొత్తగా నల్లా కనెక్షన్ మంజూరు నుంచి ఫైల్స్ క్లియర్స్ చేసే వరకు అధికారుల కంటే అవుట్ సోర్సింగ్ సిబ్బందిదే హవా నడుస్తుందని సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిపై అక్రమంగా 15 వరకు డ్రైనేజీ కనెక్షన్లు ఇచ్చారని ఆరోపణలు రావడంతో విజిలెన్స్ విచారణ కూడా చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం, ఆ ఉద్యోగిని మంచి కాసులు కురిసే డివిజన్ కు ట్రాన్స్ ఫర్ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ జలమండలిలో పనిచేసే అవుట్ సోర్సింగ్ సిబ్బందికి మేనేజర్, డిజిఎం, జీఎం, ఇతర సిబ్బంది వత్తాసు పలుకుతున్నారని సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి. అంతే కాకుండా మన్సురాబాద్ లోని ఓ చికెన్ షాపు యజమాని నుంచి రూ.15 వేలు వసూలు చేశారని రవితేజ రెడ్డి అనే వ్యక్తి ప్రజా వాణిలో కూడా ఫిర్యాదు చేశారు. కొత్తగా నల్లా మంజూరు చేయాలన్నా, చార్జీలు లేకుండా రోడ్డు కట్టింగ్ చేయాలన్నా ఈ వ్యక్తిదే జలమండలి కార్యాలయంలో హవా నడుస్తుందని పలువురు వాపోతున్నారు.
డిజీఎంపై సిజీఎంకు ప్రజావాణిలో పిర్యాదు
దరఖాస్తుదారుడు 10 వేలు ఖర్చు చేసి గత ఏడాది నుండి 3 సార్లు నల్లా నీటి కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నా డీజీఎం రిజెక్ట్ చేయడం,3 లక్షల 54 వేల రూపాయలు కట్టాలని చెప్పడంతో సోమవారం హయత్ నగర్ జలమండలి కార్యాలయంలో సిజీఎం నాగేంద్ర కుమార్ కు లిఖితపూర్వకంగా డీజీఎం సాయి నాథ్ గౌడ్ పై పిర్యాదు చేశారు. పిర్యాదుపై సిజీఎం స్పందిస్తూ, అధికారులు ఫీల్డ్ పరిశీలన చేసి రెండు రోజుల వ్యవధిలో సమస్య పరిష్కరించాలని జిఎం మహేందర్ నాయక్ కు ఆదేశించారు.



