Home తెలంగాణ రక్షకుల ముసుగులో రాక్షస కాండ… మహిళలపై ఖాకీల అరాచకం!

రక్షకుల ముసుగులో రాక్షస కాండ… మహిళలపై ఖాకీల అరాచకం!

0
9
  • ప్రశ్నించే గొంతుకలపై కేంద్ర ప్రభుత్వ నిర్బంధం
  • సాకేత్ పోలీసు స్టేషన్ సీసీటీవీ పుటేజీని తక్షణమే బహిర్గతం చేయాలి
  • బాధ్యులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్.

దిల్లీ

ప్రజాస్వామ్య దేశంలో రక్షించాల్సిన పోలీసులే రాక్షసులుగా మారుతున్నారని, మహిళల భద్రతను గాలికొదిలేసి అధికార మదంతో అరాచకాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ రాజధాని నడిబొడ్డున మహిళలపై ఖాకీలు జరుపుతున్న దాడులు, దురుసు ప్రవర్తన అరాచక పాలనకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు. ప్రశ్నించే మహిళలను చూసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు వణికిపోతున్నారని సూటిగా నిలదీశారు. మహిళలను అణచివేసే నీచమైన సంస్కృతి దిల్లీ కేంద్రంగా స్పష్టంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు.
దిల్లీలో ఇటీవల జరిగిన ప్రజాస్వామ్య నిరసనల సందర్భంగా మహిళలపై, జర్నలిస్టులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన ఉదంతంపై రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

*బాధితుల ఆవేదనను పంచుకున్న రాహుల్:
ఇటీవల షహీన్ ఖాన్, నఫీసా ఖాన్ అనే మహిళా జర్నలిస్టులతో జరిపిన ముఖాముఖి సంభాషణకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్టుల కెమెరాలను లాక్కోవడం, రోడ్లపై ఈడ్చుకెళ్లడం దారుణమైన చర్య అని ఆక్షేపించారు. అంతటితో ఆగకుండా, పోలీసుల దౌర్జన్యంపై బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే కనీసం ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) కూడా నమోదు చేయకపోవడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

*పోలీస్ స్టేషన్లలోనే రక్షణ కరవు:
శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ స్టేషన్ల లోపలే మహిళలపై దాడులు జరగడం అత్యంత హేయమైన చర్య అని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు కాపాడాల్సిన వారే సామాన్య ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు పెనుప్రమాదంగా మారుతున్నారని ఘాటుగా విమర్శించారు. సాకేత్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ అరాచకానికి సంబంధించి స్టేషన్‌‌లోని సీసీటీవీ దృశ్యాలను వెంటనే బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిందితులైన పోలీసు అధికారులపై ఉపేక్షించకుండా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ ప్రజలు, మహిళలు పెద్దఎత్తున శాంతియుత నిరసనలు తెలిపారు. ఈ ఆందోళనలను అణచివేసే క్రమంలో పోలీసు యంత్రాంగం నిరంకుశంగా వ్యవహరించిందని, మహిళా నిరసనకారులు మరియు జర్నలిస్టులపై అత్యంత దురుసుగా, అమానుషంగా ప్రవర్తించిందనే తీవ్ర ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here