- టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ఉద్ఘాటన
- లింగోజిగూడ డివిజన్‌లో రూ. 40 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హైదరాబాద్:
తెలంగాణ గడ్డపై ప్రజాప్రభుత్వం కొలువైన తరువాత వెయ్యి రోజుల కాలంలో తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కి గౌడ్ స్పష్టం చేశారు. పేదల అభ్యున్నతే ధ్యేయంగా సాగుతున్న ఈ పాలనను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం లింగోజిగూడ డివిజన్ పరిధిలోని జానకి ఎంక్లేవ్ కాలనీలో రూ. 40 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు అలాగే భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు మధుయాష్కి గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి భూమి పూజ చేసి శంకుస్థాపన గావించారు.
దోపిడీ పాలనకు, ప్రజా పాలనకు మధ్య వ్యత్యాసం
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మధుయాష్కి గౌడ్ ప్రసంగిస్తూ, గత పాలకుల కుటుంబ పాలనలో రాష్ట్ర సంపద ఏ విధంగా దోపిడీకి గురైందో ప్రజలకు వివరించారు. గతంలో నిరంకుశంగా సాగిన విధానాలకు భిన్నంగా, నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజల చెంతకే సంక్షేమం చేరుతోందని తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ సరఫరా, రైతన్నల సంక్షేమం కోస రైతు రుణమాఫీ, అర్హులైన పేదలందరికీ నూతన రేషన్ కార్డుల జారీ, అలాగే రేషన్ ద్వారా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ వంటి బృహత్తర పథకాలను అమలు చేస్తున్న ఘనత ఈ ప్రజా ప్రభుత్వానిదే అని కొనియాడారు.
అభివృద్ధికి పెద్దపీట
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పురపాలక శాఖ బాధ్యతలను భుజాన వేసుకోవడంతో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించబడుతున్నాయని మధుయాష్కి వెల్లడించారు. మున్సిపల్ రంగంలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా నిధులు విడుదలవుతున్నాయని తెలిపారు. వెయ్యి రోజుల ఈ ప్రస్థానంలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ప్రత్యేక సభలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందికంటి శ్రీధర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ శాలిని, ప్రముఖ మహిళా నాయకురాళ్లు వసంత, రాజేశ్వరి, మహేశ్వరి, జ్యోతి, అనసూయ, నూర్జన్ని, ప్రభావతి, ప్రవీణ్ రెడ్డి, కోటగిరి శ్రీనివాస్, మల్లికార్జున రావు, యస్వంత్, సుధీర్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, అమీర్, మనోజ్, కప్పరి శ్రీనివాస్, గౌస్, రవికుమార్ రెడ్డి, జానకి ఎంక్లేవ్ కాలనీ అధ్యక్షులు జీవన్, సోమా చంద్ర శేఖర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.



